జిల్లాలో చిరుజల్లులు

ABN , First Publish Date - 2021-10-17T04:45:52+05:30 IST

అల్పపీడన ప్రభావం కారణంగా శనివారం మెదక్‌ జిల్లా వ్యాప్తంగా పలు చోట్ల చిరుజల్లులు కురిశాయి.

జిల్లాలో చిరుజల్లులు

చిట్కుల్‌గ్రామంలో 63.5 మి.మీ వర్షం

ఆంధ్రజ్యోతి ప్రతినిధి, మెదక్‌, అక్టోబరు 16: అల్పపీడన ప్రభావం కారణంగా శనివారం మెదక్‌ జిల్లా వ్యాప్తంగా పలు చోట్ల చిరుజల్లులు కురిశాయి. అకాశం మేఘావృతమై మబ్బులు కమ్ముకున్నాయి. అల్పపీడనంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరైన జనం కొంత ఉపశమనం పొందారు. అత్యధికంగా చిల్‌పచెడ్‌ మండలంలోని చిట్కుల్‌లో 63.5 మి.మీ వర్షపాతం నమోదైంది. తూప్రాన్‌లో 3.6 మి.మీ వర్షం కురిసింది. శివ్వంపేటలో ఉరుములతో కూడిన వర్షం పడింది. కొన్ని మండలాల్లో చిరు జల్లులు కురిశాయి. మరి కొన్ని మండలాల్లో వర్షం పడలేదు. మరో 24 గంటల పాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ పేర్కొంది.

నర్సాపూర్‌లో గంటపాటు  వర్షం

నర్సాపూర్‌, అక్టోబరు 16: నర్సాపూర్‌లో శనివారం రాత్రి గంట పాటు ఉరుములతో కూడిన భారీ వర్షం పడింది. కాగా నర్సాపూర్‌- సంగారెడ్డి ప్రధాన రహాదారిపై భారీ వర్షం వల్ల గతంలో ఎప్పుడూ లేని విధంగా వర్షపు నీరు పెద్ద ఎత్తున నిలిచి పోవడంతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు. పట్టణంలోని తొమ్మిదోవార్డు కుంట సమీపంలోని కాలనీలో  వర్షానికి ఇళ్ల మధ్య నీరు చేరడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

మొగుడంపల్లి, కోహీర్‌ మండలాల్లో...

జహీరాబాద్‌ అక్టోబరు 16: కోహిర్‌, మొగుడంపల్లి మండలాల్లో శుక్రవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. ఝరాసంగం మండలంలో సాధారణ వర్షపాతం నమోదైంది. రెండు మండలాల్లో భారీ వర్షం నమోదు కావడం వల్ల కోతకు వచ్చిన మొక్కజొన్న పంటకు తీవ్ర నష్టం జరిగింది. కోహీర్‌లో 14.5 మి.మీ, దిగ్వాల్‌లో 24.5 మి.మీ,  ఝరాసంగంలో 8.8 మి.మీ, మొగుడంపల్లి మండలంలో 40.5 మి.మీ, వర్షపాతం నమోదైనట్లు మండల అధికారి శ్రీనివాస్‌ తెలిపారు.

Updated Date - 2021-10-17T04:45:52+05:30 IST