నాన్నతో పోల్చుకోను: తుషార్‌ కపూర్‌

Jun 18 2021 @ 01:11AM

కృష్ణగారి సినిమాలు చూశా..


నాన్న సినిమాలపై ప్రయోగం చేయను ..

- తుషార్‌ కపూర్‌


‘చిన్నతనంలో హైదరాబాద్‌, మద్రాస్‌లో ఎక్కువగా ఉండడం వల్ల కృష్ణగారి సినిమాలు ఎక్కువగా చూశా. ఈతరం హీరోల చిత్రాలను అంతగా చూడలేదు. ఓసారి హైదరాబాద్‌ షూటింగ్‌కు వచ్చినప్పుడు ‘మురారి’ చూసిన గుర్తుంది’’ అని బాలీవుడ్‌ హీరో, నిర్మాత తుషార్‌కపూర్‌ అన్నారు. తాజాగా ఆయన ‘ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి’కి ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ విశేషాలు...


కరోనా, లాక్‌డౌన్‌ వల్ల ప్రపంచం మొత్తం స్తంభించిపోయినట్లు అనిపించింది. ఈ పదిహేను నెలల్లో మనుషుల జీవితాలు మారిపోయాయి. పేద, ధనిక అనే తేడా లేకుండా అందరి పరిస్థితి ఒకటే. ఇంటికే పరిమితం కావడం వల్ల నేను మా అబ్బాయికి చాలా దగ్గరయ్యాను. ఫ్యామిలీ కోసం ఎక్కువ సమయం కేటాయించాను. 

20 ఏళ్ల జర్నీ..

నటుడిగా కెరీర్‌ ప్రారంభించి 20 ఏళ్లు పూర్తయింది. నటుడిగా, నిర్మాతగా ఈ జర్నీలో చాలా నేర్చుకున్నా. ఎలాంటి కథలు ఎంచుకోవాలి, పోటీ ప్రపంచంలో కెరీర్‌ ఎలా ప్లాన్‌ చేసుకోవాలి అన్న విషయంలో అనుభవం తెచ్చుకున్నా. అయితే ఈ జర్నీలో చెడ్డ సినిమాలు కూడా చేశా. 

నాన్నతో పోల్చుకోను..

నాన్న జితేంద్ర స్టార్‌ హీరో. ఆయన 250కు పైగా చిత్రాల్లో నటించారు. ఆయన చాలా విషయాల్లో నాకు స్ఫూర్తి. ఆయనతో నన్ను పోల్చుకోను. నటనలో నాన్న స్టైల్‌ వేరు. నా స్టైల్‌ వేరు. సౌత్‌లో హిట్‌ అయిన చిత్రాలు ఎన్నో హిందీలో చేశారాయన. ఆయన నటించిన చిత్రాలపై ప్రయోగాలు చేయాలని నేను ఎప్పుడూ అనుకోలేదు. 

సాయం చేసుకుంటాం..

నా సోదరి ఏక్తా కపూర్‌ చాలా తెలివైన అమ్మాయి. ప్రొడక్షన్‌ రంగంలో చురుకుగా ఉంటుంది. తనకు ఏదైనా సలహా, సాయం కావాలంటే అడుగుతుంది. నేను అంతే! 


తెలుగు సినిమాలు చూశా...

చిన్నతనంలో హైదరాబాద్‌, మద్రాస్‌ ఉండడం వల్ల కృష్ణగారి చిత్రాలు ఎక్కువగా చూసేవాడిని. కొన్ని ఎన్టీఆర్‌ చిత్రాలు కూడా చూశా. అప్పట్లో థియేటర్లో సినిమా చూస్తే ఆ క్రేజ్‌ వేరుగా ఉండేది. అప్పుడప్పుడు సబ్‌టైటిల్స్‌ ఉన్న దక్షిణాది చిత్రాలు చూస్తా. ఈ మధ్యన నయనతార నటించిన ఓ సినిమా చూశా. సౌత్‌ సినిమాలను హిందీలో రీమేక్‌ చేయమని చాలా ఆఫర్లు వచ్చాయి. ఇంకా అటువైపు ఆలోచించలేదు. ఈ జనరేషన్‌ హీరోల్లో మహేశ్‌ నటించిన ‘మురారి’ సినిమా చూసినట్లు గుర్తుంది. గత ఏడాది తమిళంలో హిట్టైన ‘కాంచన’ సినిమాను ‘లక్ష్మి’  టైటిల్‌తో రీమేక్‌ చేశాం. పెద్ద హిట్టైంది. ప్రస్తుతం పలు చిత్రాలు సెట్స్‌ మీదున్నాయి. 

బాత్‌రూమ్‌ సింగర్‌ని..

నాకు సంగీతం అంటే చాలా ఇష్టం. నేనను పెద్ద బాత్‌రూమ్‌ సింగర్‌ని.

ఆ ప్లేస్‌ ఇష్టం...

హైదరాబాద్‌లో నాకు రామోజీ ఫిల్మ్‌సిటీ అంటే చాలా ఇష్టం. అక్కడ చాలా ప్రశాంతంగా ఉంటుంది. నా షూటింగ్‌లు కూడా ఎక్కువగా అక్కడే జరుగుతుంటాయి. మా అబ్బాయికి హైదరాబాద్‌ ఏదైనా ప్రదేశాన్ని చూపించాలనుకుంటే నా లిస్ట్‌లో మొదట రామోజీ ఫిల్మ్‌సిటీ ఉంటుంది. హైదరాబాద్‌ ఫుడ్‌ అంటే నాకు ఇష్టం. 





Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.