ఆయనకు మంత్రి పదవి ఇవ్వకపోతే వేరే కుంపటి.. భయపడిన జగన్

ABN , First Publish Date - 2022-04-24T00:22:00+05:30 IST

ఏపీ కేబినెట్‌లో చిత్తూరు జిల్లాకు బంపరాఫర్‌ తగిలింది. ఏకంగా ముగ్గురు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు దక్కాయి. గతంలో రెండు..

ఆయనకు మంత్రి పదవి ఇవ్వకపోతే వేరే కుంపటి.. భయపడిన జగన్

ఏపీ కేబినెట్‌లో చిత్తూరు జిల్లాకు బంపరాఫర్‌ తగిలింది. ఏకంగా ముగ్గురు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు దక్కాయి. గతంలో రెండు మంత్రి పదవులు ఉండగా, తాజా విస్తరణలో ఆ సంఖ్య మూడుకు పెరిగింది. గతంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి,  కె.నారాయణస్వామి మంత్రులుగా కొనసాగారు. మలివిడత విస్తరణలో జగన్‌ వీరిద్దరిని కొనసాగిస్తూ నగరి ఎమ్మెల్యే ఆర్‌కే రోజాకు అవకాశం ఇచ్చారు. 


నిజానికి 90 శాతం మంత్రులను తీసేస్తానన్న జగన్‌ తరువాత జరిగిన పరిణామాలతో జడిశారు. అందుకే చాలామంది పాతకాపులను తిరిగి కొనసాగించారు. ఈ క్రమంలో సీనియర్ల కోటాలో పెద్దిరెడ్డికి చోటు దక్కిందని భావించినా, నారాయణస్వామి కొనసాగింపే అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. దీనికితోడు పాతమంత్రులలో చాలామంది శాఖలలో మార్పులు చేశారు. కానీ నారాయణస్వామికి గతంలోలానే ఉపముఖ్యమంత్రితోపాటు, ఎక్సైజ్‌ శాఖనూ అలాగే ఉంచారు. దీనివెనుక ఉన్న మర్మమేమిటనేదానిపై వైసీపీలో బోలెడు చర్చ సాగుతోంది. 

 


ఇక తమ తొలివిడతలో ఈ ఇద్దరు మంత్రులు చిత్తూరుజిల్లాకు ప్రత్యేకించి ఏమీ చేయలేదు. కేవలం తమ తమ నియోజకవర్గాల అభివృద్ధికే పరిమితమయ్యారు.  ప్రభుత్వంలో పలుకుబడి ఉన్న మంత్రిగా పేరుగాంచిన పెద్దిరెడ్డి కూడా జిల్లా అభివృద్ధిపై దృష్టి సారించలేదు. కానీ తన సొంత నియోజకవర్గం పుంగనూరు విషయంలో ఉదారంగా వ్యవహరించారు. ఇక్కడ అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయించారు. మరి రెండోసారి ఇచ్చిన అవకాశాన్నైనా ఆయన చిత్తూరు జిల్లా అభివృద్ధి కోసం వినియోగిస్తారా లేక మరోసారి నియోజకవర్గానికే పరిమితమవుతారా అనే చర్చ సాగుతోంది. ఇక రెండోసారి పెద్దిరెడ్డికి మంత్రి పదవి రావడం వెనుక వైసీపీ కార్యకర్తలు రకరకాలుగా చర్చలు సాగుతున్నాయి. గత మూడేళ్లలో జిల్లాలో అనేక కీలక పరిణామాలు, వివాదాల వెనుక మంత్రి పెద్దిరెడ్డి పేరు ప్రముఖంగా ప్రచారమైంది.


తిరుపతి లోక్ సభ ఉపఎన్నిక సందర్భంగా జరిగిన గొడవలలో పెద్దిరెడ్డి పాత్ర వివాదాస్పదమైంది.  తరువాత  స్థానిక సంస్థల ఎన్నికలను సైతం ఆయన కనుసైగలతో శాశించారు.  ప్రత్యేకించి పుంగనూరు నియోజకవర్గంలో జరిగిన ఎన్నికల అక్రమాలు రాష్ట్రవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించాయి. అన్నిచోట్లా ఏకగ్రీవాలు కావడం వెనుక పెద్దిరెడ్డి చక్రం తిప్పారనే విమర్శలు వచ్చాయి. ఇక కుప్పం నియోజకవర్గంలోనైతే పెద్దిరెడ్డి చాలా దూకుడుగా వ్యవహరించారు. ఇక్కడ ఓటర్లను ప్రలోభపెట్టే కార్యక్రమాలు తీవ్రస్థాయిలో జరిగాయి. టిడిపిని అడ్డుకునేందుకు పోలీస్ యంత్రాంగాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకోవడానికి పెద్దిరెడ్డి వెనకడుగు వేయలేదు. దీంతో మంత్రివర్గంలో రెండోసారి పెద్దిరెడ్డిని కొనసాగించడం జగన్‌కు అనివార్యంగా మారిందంటున్నారు. దీనికితోడు ఒకవేళ పెద్దిరెడ్డిని కొనసాగించకపోతే ఆయన ఎక్కడ వేరుకుంపటి పెడతారోననే భయమూ జగన్‌లో ఉందంటారు. 


ఇక నారాయణస్వామి విషయానికి వస్తే.... ఆయనకూడా  గంగాధరనెల్లూరు నియోజకవర్గ అభివృద్దికే పరిమితయ్యారు. అయితే ఊహించని రీతిలో నారాయణస్వామికి రెండోసారికూడా మంత్రి పదవి దక్కడం,అందులోను మళ్ళీ  డిప్యూటీ సీఎం హోదా కల్పించి, ఎక్సైజ్ శాఖనే  కేటాయించడం చర్చనీయాంశమైంది. మద్యపాన విషయంలో పదపదే మాజీ సీఎం చంద్రబాబునాయుడును నారాయణస్వామి ఇష్టమొచ్చినట్టు మాట్లాడేవారు.సీఎం జగన్ దేవుడంటూ ఆయనకు తన చర్మం ఒలిచి చెప్పులు కుటిస్తానంటూ ప్రతి సమావేశంలోను మాట్లాడేవారు. పశ్చిమ గోదావరి జిల్లాలో కల్తీ సారాకు అనేక కుటుంబాలు బలైపోయిన నేపథ్యంలో ప్రతిపక్షాలు, చంద్రబాబునాయుడు సైతం ఈ అంశాలపై తీవ్ర స్దాయిలో ప్రభుత్వంపై ఎదురు దాడికి దిగాయి.నారాయణస్వామిని ఎక్సైజ్ శాఖ పదవినుంచి తొలగించాలనే డిమాండ్‌ పెరిగింది.  


ఈ నేపథ్యంలో  నారాయణస్వామికే  మరోసారి ఎక్సైజ్ శాఖను కేటాయించడంపై  రకరకాలైన చర్చలు సాగుతున్నాయి. ప్రతిపక్షాలు నారాయణస్వామిని తొలగించాలని డిమాండ్‌ చేశాయి కాబట్టి, జగన్‌ ఆయనను తిరిగి అదేశాఖలో కొనసాగించారంటున్నారు. ప్రతిపక్షాల డిమాండ్‌కు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకోవడమంటే జగన్‌కు మహాసరదా. దీంతోపాటు జగన్ మాటను జవదాటని మెతకైన వ్యక్తిగా నారాయణస్వామి మెలుగుతున్నారు. పైగా ఎప్పడైనా చర్మం ఒలిచి చెప్పులు కుట్టిస్తాను అంటారయ్యే... నారాయణస్వామి విధేయత ఏ స్థాయిలో ఉంటుందో రెండోసారి మంత్రివర్గ విస్తరణలో తేటతెల్లమైంది. జగన్‌ కాళ్ళపై పడి మరీ నారాయణస్వామి తన ప్రభుభక్తిని చాటుకున్నారు. కనుక సమర్థతతో పనేముంది... మర్ధన చేయడం వస్తే చాలని వైసీపీ వర్గాలు చెపుతున్న మాట.  



Updated Date - 2022-04-24T00:22:00+05:30 IST