హరితగోస

ABN , First Publish Date - 2022-05-15T06:29:57+05:30 IST

హరిత తెలంగాణనే లక్ష్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలంగాణ ప్రత్యేకరాష్ట్రంగా అవతరించిన నాటి నుంచి తెలంగాణ కు హరితహారం పథకానికి శ్రీకారం చుట్టారు.

హరితగోస
బీర్నంది నర్సరీలో ఎండిపోయిన మొక్కలు (ఫైల్‌)

జిల్లాలో హరితలక్ష్యంపై నిర్లక్ష్యపు నీడ

ఎవెన్యూ ప్లాంటేషన్‌లో నాటిన మొక్కల సంరక్షణ గాలికి..

ఇప్పటికే పలు చోట్ల చనిపోయిన మొక్కలు

మరికొన్ని చోట్ల నాటిన మొక్కలను నరికేస్తున్న గ్రామపంచాయతీ సిబ్బంది

సరైన ప్రణాళిక లేకుండా మొక్కలు నాటించి ఆ తర్వాత తొలగింపుపై ప్రజల ఆగ్రహం

జిల్లాలో పలు నర్సరీలలో ఎండుతున్న మొక్కలు 

జూన్‌లో ప్రారంభం కానున్న ఎనిమిదవ విడత హరితహారం

ఖానాపూర్‌, మే 14 : హరిత తెలంగాణనే లక్ష్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలంగాణ ప్రత్యేకరాష్ట్రంగా అవతరించిన నాటి నుంచి తెలంగాణ కు హరితహారం పథకానికి శ్రీకారం చుట్టారు. అనుకున్నదే లక్ష్యంగా యుద్ద ప్రాతిపాదికన మొక్కలు నాటే ప్రక్రియను ప్రారంభించారు. ప్రతీ యేడాది జూన్‌మాసంలో హరితహారం కార్యక్రమాన్ని ఒక పండగలా ప్రభుత్వం నిర్వహిస్తూ వస్తుంది. ఈ పథకంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా కోట్లలో మొక్కలు నాటించారు. తెలంగాణకు హరితహారం కార్యక్రమం ప్రారంభించిన నాటి నుంచి ఇప్పటి వరకు రాష్ట్రంలో చాలచోట్ల అద్భుత ఫలితాలు కనిపిస్తున్నాయి. ఈ కార్యక్రమం మొదలైన నాటి నుంచి రాష్ట్రం లో 4 శాతం అడవులు పెరిగినట్లు అధికారులు చెబుతున్నారంటే ఈ హరతహారం పథకం భావితరాలకు ఎంత ఉపయోగకరంగా ఉంటుందో తెలుస్తోంది. ఇంతటి గొప్ప లక్ష్యంతో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలంగాణ  రాష్ట్రంలో చేపట్టిన హరితహారం పథకంపై జిల్లాలో కొంతమంది అధికారులు, సిబ్బంది పర్యవేక్షణ లోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. దీంతో హర తలక్ష్యంపై నిర్లక్ష్యపు నీడలు కమ్ముకుంటున్నాయి. సుమారు మరో నెల రోజుల్లో ఎనిమిదవ విడుత హరితహారం ప్రారంభం కానున్న నేపథ్యంలో అధికారులు ఇప్పటి నుంచే అప్రమత్తం అవ్వకపోతే హరిత లక్ష్యం నిరుగారిపోతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి.

ఎవెన్యూ ప్లాంటేషన్‌పై పట్టింపు కరువు

నిర్మల్‌ జిల్లాలో 2021-22 సంవత్సరానికి గాను మొత్తం 598 చోట్ల ఎవెన్యూ ప్లాంటేషన్‌లు ఏర్పాటు చేశారు. జిల్లావ్యాప్తంగా రహదారులకు ఇరువైపుల 465 కిలోమీటర్ల పొడవున ఏర్పాటు చేసిన ఎవెన్యూ ప్లాంటేషన్‌లలో మొత్తం 186174 మొక్కలను నాటారు. ఇంత వరకు బాగనే ఉన్నప్పటికి పలుచోట్ల నాటిన మొక్కలు ఎండిపోయాయి. అధికారుల పర్యవేక్షణ లోపం కారణంగా జిల్లాలో పలుచోట్ల రోడ్డుకు ఇరువైపుల ఉన్న మొక్కల్లో కొన్ని అగ్నికి ఆహుతి అయినట్లు చెబుతున్నారు. మరి కొన్ని చోట్ల గ్రామా ల్లో రోడ్డుకు ఇరువైపుల నాటిన మొక్కలను గ్రామ పంచాయతీ సిబ్బందే నరికేయడం పలు అనుమానాలకు తావిస్తోంది. లక్షల రూపాయలు వెచ్చించి మొక్కలను నాటి ఆ నాటిన మొక్కలను సంరక్షించేందుకు, అవి ఎండిపోకుండా ఉండేందుకు నిత్యం నీటివసతి కల్పించి తీరా పెరిగాక గ్రామపంచాయతీ అధికారులే తమ సిబ్బంది చేత చెట్లను నరికి వేయించడం పట్ల పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొక్కలు నాటే ముందే అవి ఉపయోగకరంగా ఉంటాయా లేదా అని చూడకుండా మొక్కలు నాటించడం అవి పెరిగి పెద్దగా అయ్యాక అవి ప్రమాదకరమైనవి అంటూ నరికి వేయడం చూస్తే హరితహారంపై మన అధికారులకు ఎంత శ్రద్ధ ఉందో తెలిసిపోతుందని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నాటిన మొక్కలను నరికివేయడం ద్వారా వృధా అయిన ప్రజాధనం పరిస్థితి ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు.  

లక్ష్యం చేరని నర్సరీలు

రాష్ట్రంలో చేపట్టిన హరితహారం పథకంలో భాగంగా ప్రతీగ్రామంలో ప్రతీఏడాది నాటే మొక్కల కోసం ఎక్కడికో వెళ్లి తేవాల్సిన శ్రమ లేకుండా ప్రభుత్వం ప్రతీ గ్రామపంచాయతీ పరిధిలో ఒక నర్సరీని ఏర్పాటు చేసింది. ఇందుకోసం అయ్యే ఖర్చును ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ ద్వారా నిధులను కేటాయించింది. ఈ ప్రక్రియలో భాగంగా జిల్లాలో 396 గ్రామ పంచాయతీలో నర్సరీలు ఏర్పాటు చేశారు. అయినప్పటికీ గత ఏడాది నిర్వహించిన హరితహారంలో నర్సరీల్లో సరిపడ మొక్కలు లేకపోవడంతో ప్రత్యేకంగా గ్రామ పంచాయతీ నిధుల్లోంచి డబ్బులను డ్రా చేసి మొక్కలను కొనుగోలు చేశారు. ఇందుకు గాను ఒక్కోమొక్కకు రూ.180 నుంచి రూ.250 వరకు నిధులు వెచ్చించి మొక్కలను కొనుగోలు చేశారు. ఓ వైపు నర్సరీల కోసం డబ్బులు ఖర్చు చేస్తూ తీరా అవసరం వచ్చిన నాటికి మొక్కలు అందుబాటులో లేవని మొక్కలను కొనుగోలు చేయడం వెనుక మతలాబు ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఈ మొక్కలు కొనుగోలు విషయంలో భారీగా నిధుల దుర్వినియోగం జరిగిందనే ఆరోపణలు వినిపించాయి. ఒక్కో మొక్కకు రూ, 100 నుండి రూ, 120 వరకు అదనంగా లెక్కలు చూపి జిల్లాలో కొంతమంది పంచాయతీ కార్యదర్శులు, ఎంపీడీవోలు కలిసి ఆ డబ్బులను కాజేశారనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అందులో భాగంగానే జిల్లాలో పలునర్సరీలపై కొంతమంది పంచాయతీ కార్యదర్శులు నిర్లక్ష్యం చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. నర్సరీల్లో మొక్కలు లేవనే సాకుతో ప్రైవేటు నర్సరీల నుంచి మొక్కలను కొనుగోలు చేసి ఇష్టా రాజ్యంగా లెక్కలు రాసుకోవాలనే ఎత్తుగడలో భాగంగానే నర్సరీల్లో మొక్కలను ఎండబెడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా జిల్లా అధికార యంత్రాంగం రాభోయే హరితహారాన్ని మరింత విజయవంతం చేయాలంటే ఈ అంశాలపై దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు. ప్రతీఏడాది జూన్‌ మాసంలో ప్రారంభమయ్యే హరితహారం ఈ ఏడాది సైతం జూన్‌లోనే ప్రారంభమౌతుందని అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మరో నెల రోజుల్లో ఎనిమిదవ విడుత హరితహారం ప్రారంభం అవుతున్న తరుణంలో ప్రభుత్వ లక్ష్యం నేరవేరాలంటే ఈ నిర్లక్ష్యానికి కారకులైన వారిపై కఠిన చర్యలు చేపట్టాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు. 

నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవు...

హరితహారంలో నాటిన మొక్కలను ఖచ్చితంగా కాపాడాలి. నర్సరీల్లో మొక్కలు ఎండిపోకుండా కాపాడాలి. నాటించిన మొక్కలను నరికివేసిన వారిపై చర్యలు తీసుకుంటాం. హరితహారం పట్ల నిర్లక్ష్యం చేసే వారిపై కఠినచర్యలు తప్పవు. 

- వెంకటేశ్వరరావు, జిల్లా పంచాయతీ అధికారి నిర్మల్‌



Updated Date - 2022-05-15T06:29:57+05:30 IST