జోరుగా చోడి సాగు

ABN , First Publish Date - 2022-07-02T06:33:48+05:30 IST

మన్యంలో చోడి(రాగి) నాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి.

జోరుగా చోడి సాగు
పాడేరు మండలం సలుగు పంచాయతీ డల్లాపల్లిలో చోడి నాట్లు వేస్తున్న గిరిజనులు

దుక్కి దున్ని, నాట్లు వేసే పనుల్లో గిరిజన రైతులు నిమగ్నం

చిరుధాన్యాల పంటల్లో మొదటిస్థానం

ఏజెన్సీలో 28 వేల హెక్టార్లలో సాగు 

పూర్తిగా సేంద్రీయ విధానంలో సాగు

ప్రభుత్వం నుంచి కొరవడిన ప్రోత్సాహం  

 (పాడేరు- ఆంధ్రజ్యోతి) 

మన్యంలో చోడి(రాగి) నాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. వేసవిలో కూడా వర్షాలు పడడంతో మే నెలాఖరు, జూన్‌ మొదటి వారంలో గిరిజన రైతులు నారుమడులు సిద్ధం చేసుకుని విత్తనాలు చల్లారు. నెల రోజుల్లో నారు ఎదగడంతో కొద్ది రోజుల నుంచి పొలంలో నాట్లు వేస్తున్నారు. ఏజెన్సీలో సాగు చేసే చిరుధాన్యాల పంటలో చోడి మొదటి స్థానంలో వుండడంతో దాదాపు అన్ని గ్రామాల్లో ఈ పంటను సాగు చేస్తుంటారు. 

ఏజెన్సీ వ్యాప్తంగా ఖరీఫ్‌ సీజన్‌లో లక్ష హెక్టార్లకుపైగా వివిధ రకాల పంటలు పండిస్తుంటారు. దీనిలో 46 వేల హెక్టార్లలో వరి, 28 వేల హెక్టార్లలో చోడి పంటను సాగు చేస్తుంటారు. నీటి సదుపాయం ఉన్న పల్లపు ప్రాంతాల్లో వరి పంటను, మెట్ట, కొండవాలు ప్రాంతాల్లో చోడిని వేస్తారు. ఇటీవల కురిసిన వర్షాలకు భూమి మెత్తబడడంతో దుక్కి పనులు పూర్తి చేసి, చోడి నాట్లు వేస్తున్నారు. చోడి పంటకు నీటి అవసరం చాలా తక్కువ వుంటుంది. అందువల్ల మెట్ట భూములతోపాటు కొండవాలు ప్రాంతాల్లో సైతం చోడి పంట పండుతుంది. అధిక పోషక విలువలు వుండడంతో గిరిజనుల బియ్యంకన్నా రాగులనే ఆహారంగా తీసుకుం టుంటారు. 

నాట్లు విధానంతో అధిక దిగుబడి

సాధారణంగా చిరుధాన్యాలు, పప్పుదినుసులు, నువ్వు వంటి నూనె పంటలను సాగు చేసే రైతులు విత్తనాలను నేరుగా పొలంలో చల్లుతుంటారు. దీనిని వెదజల్లే పద్ధతి అంటారు. ఇందుకు ఎక్కువ మొత్తంలో విత్తనం అవసరం అవుతుంది. పైగా పొలంలో మొక్కల మధ్య సమాన దూరం వుండదు. కొన్నిచోట్ల మొక్కలు పలుచగా, మరికొన్నిచోట్ల ఒత్తుగా వుంటాయి. దీనివల్ల ఆశించిన దిగుబడి రాదు. నారునాటే పద్ధతిలో సాగు చేస్తే విత్తనం ఖర్చు తగ్గడంతోపాటు పంట దిగుబడి రెట్టింపు అవుతుంది. శాస్త్రవేత్తలు, వ్యవసాయ శాఖ అధికారులు గ్రామాలకు వచ్చి అవగాహన కల్పించడంతో గిరిజన రైతులు కొంతకాలం నుంచి నారు నాటే విధానంలో చోడి పంటను సాగు చేస్తున్నారు. వేసవిలో కురిసే చెదురు మదురు వర్షాలకు దుక్కి దున్ని పొలాన్ని సిద్ధం చేసుకుంటారు. ఇదే సమయంలో నారుమళ్లలో విత్తనాలు చల్లుతారు. జూన్‌ చివరి వారం నుంచి ప్రధాన పొలంలో నాట్లు వేస్తుంటారు. ఇందుకోసం ప్రత్యేకంగా కూలీలను ఏర్పాటు చేసుకోరు. కుటుంబ సభ్యులంతా పొలం బాట పడతారు. మగవాళ్లు నాగలితో చాళ్లు చేస్తుంటే, మహిళలు, పిల్లలు నాగటి చాళ్లలో చోడి నారు నాటుతుంటారు.   

కొరవడిన ప్రభుత్వ ప్రోత్సాహం

చిరుధాన్యాల పంటల సాగుకు ప్రభుత్వం నుంచి ఎటువంటి ప్రోత్సాహం అందడంలేదని గిరిజన రైతులు అంటున్నారు. విత్తనాలు, వ్యవసాయ పనిముట్లను సొంతంగానే సమకూర్చుకుంటున్నారు. పంటలకు రసాయన ఎరువులు, క్రిమి సంహారక మందులు వినియో గించకుండా పూర్తిగా సేంద్రీయ విధానంలో సాగు చేస్తుంటారు. మార్కెట్‌లో సేంద్రీయ ఆహార ఉత్పత్తులకు అధిక గిరాకీ వుంది. తాము సేంద్రీయ పద్ధతిలో పంటలు పండిస్తున్నప్పటికీ ఇందుకు తగిన గుర్తింపు లభించడంలేదని, ఈ విషయంలో ప్రభుత్వ సహకారం కొరవడిందని రైతులు వాపోతున్నారు. అధిక దిగుబడి ఇచ్చే వంగడాలను వ్యవసాయ శాఖ ద్వారా అందజేయాలని, వ్యవసాయ పనిముట్లను పూర్తి రాయితీపై అందజేయాలని ఆదివాసీ రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. 

Updated Date - 2022-07-02T06:33:48+05:30 IST