మహారాష్ట్ర టు బెజవాడ

ABN , First Publish Date - 2021-03-02T06:29:38+05:30 IST

వరుసగా నాలుగైదు దొంగతనాలు చేసి పోలీసులకు చిక్కితే ఆ వ్యక్తిపై ఒక స్టాంప్‌ పడుతుంది.

మహారాష్ట్ర టు బెజవాడ

 రూటు మార్చిన నేరగాడు

లాక్‌డౌన్‌ తర్వాత నుంచి వరుస చోరీలు

సహకరించిన బావమరిది

ఇద్దర్నీ అరెస్టు చేసిన సీసీఎస్‌ పోలీసులు

రూ.5 లక్షల సొత్తు స్వాధీనం

విజయవాడ, మార్చి 1 : వరుసగా నాలుగైదు దొంగతనాలు చేసి పోలీసులకు చిక్కితే ఆ వ్యక్తిపై ఒక స్టాంప్‌ పడుతుంది. ఎక్కడ ఏ నేరం జరిగినా ముందుగా అతడినే అదుపులోకి తీసుకుంటారు. అటువంటి 16 కేసుల్లో నిందితుడిగా ఉంటే పోలీసుల నిఘా ఇంకెంత గట్టిగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఏ వీధిలో తాను తిరిగినా పోలీసు నిఘా పెరిగిపోవడంతో నేరాలను విజయవాడకు మార్చేశాడు మహారాష్ట్రకు చెందిన నేరగాడు. బంధువుల ఇంటికి వచ్చి చుట్టంలా ఉంటూనే బావమరిదితో కలిసి పలు చోరీలు చేశాడు. వాళ్లిద్దర్నీ సీసీఎస్‌ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. ముస్తఫా బోనా షకీల్‌ అన్సారీ అలియాస్‌ బోన అలియాస్‌ ముస్తఫా మహారాష్ట్రలోని సోలాపూర్‌ జిల్లా పండరీపురానికి చెందిన స్వగ్రామంలో ఫొటోఫ్రేమ్‌ పనులు చేస్తుంటాడు. మహారాష్ట్రలో కోంద్‌వాడ, కడక్‌, మార్కెట్‌ యార్డు, వండ్‌వాడీ పోలీస్‌స్టేషన్లలో అతడిపై 16 దొంగతనాల కేసులున్నాయి. మద్యం, జూదం వంటి చెడు వ్యసనాలకు బానిసైన షకీల్‌ ఆదాయం సరిపోకపోవడంతో చోరీలవైపు మళ్లాడు. ఈ కేసుల్లో బెయిల్‌పై జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత మహారాష్ట్రలోని పండరీపురానికి మకాం మార్చాడు. షకీల్‌ అన్సారీ అక్క, బావ విజయవాడలోని కబేళా ప్రాంతంలో ఉంటారు. గడచిన ఏడాది లాక్‌డౌన్‌ సమయంలో అన్సారీ తండ్రి మరణించడంతో అక్కబావతోపాటు బావ సోదరుడు మహ్మద్‌ ఆలీ అన్సారీ మహారాష్ట్ర వెళ్లారు. అక్కడ వాళ్లంతా మాట్లాడుకున్న సందర్భంలో తనకు పోలీసుల దృష్టిలో ఎక్కువ ముద్ర పడిందని చెప్పాడు. ఇక మహారాష్ట్రలో ఉండొద్దని చెప్పిన వాళ్లు విజయవాడకు రమ్మని ఆహ్వానించారు. వారి వెంట తీసుకొచ్చారు. అప్పటి నుంచి ఇక్కడే ఉంటున్నాడు. షకీల్‌ అన్సారీకి బావ సోదరుడు అలీ అన్సారీ సహకరించేవాడు. ఉదయం పూట ఆలీ అన్సారీ బైక్‌పై నగరంలో తిరుగుతూ తాళాలు వేసి ఉన్న ఇళ్లను గుర్తించి షకీల్‌ అన్సారీకి చెప్పేవాడు. తర్వాత షకీల్‌ అన్సారీ వెళ్లి తాళాలను పగలుగొట్టి ఇళ్లలో ఉన్న బంగారం, వెండి ఆభరణాలను తీసుకొచ్చేవాడు. వాటిని ఆలీ అన్సారీ ప్రైవేటు ఫైనాన్స్‌ కంపెనీలకు విక్రయించేవాడు. భవానీపురం, పటమట, మాచవరం పోలీస్‌స్టేషన్ల పరిధిలో మొత్తం ఆరు నేరాలు చేశారు. సీసీఎస్‌ ఏసీపీ కొల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పోలీసుల బృందం వారిని అరెస్టు చేసి  రూ.5 లక్షల విలువ గల బంగారు, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకుంది.  


Updated Date - 2021-03-02T06:29:38+05:30 IST