Advertisement

ఆన్‌లైన్‌లో శోధించి చోరీలు

Jan 17 2021 @ 01:05AM
నిందితుల వివరాలను వెల్లడిస్తున్న సీపీ అంజనీకుమార్‌

గుడిలో చోరీతో గుట్టురట్టు

అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట్‌

హైదరాబాద్‌ సిటీ, జనవరి 16 (ఆంధ్రజ్యోతి): వారు బతుకుదెరువు కోసం నగరానికి వచ్చారు. ఇక్కడ పాత నేరస్థులతో జట్టుకట్టారు. ముఠాగా ఏర్పడి బైక్‌ తాళాలు ఎలా విరగ్గొట్టాలి, తాళం లేని బైక్‌లను ఎలా స్టార్ట్‌ చేయాలి అన్న అంశాలను ఆన్‌లైన్‌లో శోధించారు. ఇంటి ముందు నిలిపి ఉంచిన ద్విచక్రవాహనాలతోపాటు, ఇళ్లల్లో చోరీలు చేశారు. ఏడాదిలో 26 చోరీలు చేసిన వీరు, చివరికి గుళ్లో దొంగతనం చేసి పోలీసులకు పట్టుపడ్డారు. ఆబిడ్స్‌ పోలీసులతోపాటు సౌత్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ సిబ్బంది ఈ ముఠాను అరెస్ట్‌ చేసింది. శనివారం కమిషనరేట్‌లో సీపీ అంజనీకుమార్‌ వివరాలు వెల్లడించారు.

బైక్‌లు, ఇళ్లల్లో చోరీలు చేసిన ఈ ముఠా ఇటీవల జగదీష్‌ మార్కెట్‌లోని మహాలక్ష్మి ఆలయంలో చోరీ చేసింది. సాక్ష్యాలు లేకుండా సీసీ టీవీ ఫుటేజీలు నిక్షిప్తమైన డీవీఆర్‌నూ ఈ దొంగలు ఎత్తుకెళ్లారు. రంగంలోకి దిగిన పోలీసులు సమీప లాడ్జ్‌లపై దృష్టి సారించి, ఆబిడ్స్‌ ప్రాంతంలోని ఓ లాడ్జ్‌లు మూడు నెలలపాటు ఈ ముఠా బస చేసినట్లు గుర్తించారు. లాడ్జ్‌లో గది తీసుకునేందుకు ఇచ్చిన ఆధార్‌ వివరాలతో బీదర్‌ ప్రాంతానికి చెందిన ముఠా నాయకుడు వాజిద్‌ను అరెస్ట్‌ చేశా రు. అతడిచ్చిన సమాచారంతో సోను, సమీర్‌, బాబూరావ్‌, సమీర్‌, ఇస్మాయిల్‌లను సౌత్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ సిబ్బంది అరెస్ట్‌ చేశారు. వారి నుంచి 26 కేసులకు సంబంధించి 23 బైకులు, 6 గ్రాముల బంగారు ఉంగరం, కిలో వెండి ఆభరణాలు, ల్యాప్‌టాప్‌, సీసీటీవీ డీవీఆర్‌, 3 సెల్‌ఫోన్లు మొత్తం కలిపి రూ. 35 లక్షల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. మరో ముగ్గురు నిందితులు షాహిద్‌, అమీర్‌, ఇలియా్‌సలు పరారీలో ఉన్నారు. వాహనాలకు యాంటీ థెఫ్ట్‌ అలారంతోపాటు, జీపీఎస్‌ ట్రాకర్‌ను అనుసంధానించుకోవడం, ఇంటి ముందు సీసీ కెమెరాల ఏర్పాటుతో ఇలాంటి చోరీలను నివారించవచ్చని పోలీసులు తెలిపారు. సమావేశంలో సెంట్రల్‌ జోన్‌ జాయింట్‌ సీపీ విశ్వప్రసాద్‌, సౌత్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ డీసీపీ చక్రవర్తి గుమ్మి, ఆబిడ్స్‌ ఏసీపీ కె. వెంకట్‌రెడ్డి, ఆబిడ్స్‌ ఇన్‌స్పెక్టర్‌ సి. అంజయ్య,  టాస్క్‌ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్‌ రాఘవేంద్ర, ఆబిడ్స్‌ డీఐ జి. గోపిలతోపాటు సిబ్బంది పాల్గొన్నారు. కేసు ఛేదనలో ప్రతిభ చూపిన సిబ్బందిని సీపీ అభినందించి, వారికి రివార్డులను అందించారు. పలు కేసుల్లో నిందితులుగా ఉన్న వీరిపై పీడీయాక్ట్‌ ప్రయోగిస్తామని తెలిపారు.  

Follow Us on:
Advertisement