సమాంతర వ్యవస్థగా ‘చౌకీదార్’

ABN , First Publish Date - 2021-02-24T06:04:50+05:30 IST

ప్రధానమంత్రి నరేంద్రమోదీకి భావోద్వేగం అత్యంత సహజంగా కలుగుతుంది. రెండు రోజుల క్రితం జరిగిన బిజెపి పదాధికారుల...

సమాంతర వ్యవస్థగా ‘చౌకీదార్’

ప్రధానమంత్రి నరేంద్రమోదీకి భావోద్వేగం అత్యంత సహజంగా కలుగుతుంది. రెండు రోజుల క్రితం జరిగిన బిజెపి పదాధికారుల (ఆఫీసు బేరర్ల) సమావేశంలో ఆయన దాదాపు రోజంతా పాల్గొని ఎంతో భావోద్వేగంతో మాట్లాడారు. తాను జీవితంలో ఎంత కష్టపడి పైకి వచ్చానో, పార్టీ కార్యకర్త నుంచి ప్రధానమంత్రి వరకూ రావడానికి మధ్య ఎన్ని ముళ్ల దారుల్ని అధిగమించానో ఆయన చెప్పుకున్నారు. సాగు చట్టాలపై ప్రతిపక్షాలు చేస్తున్న ప్రచారం నమ్మకూడదని, గతంలో కూడా వాజపేయి హయాంలో ఇలాంటి ప్రచారం చేశారని ఆయన వివరించారు.


కొత్తగా పార్టీలో చేరిన వారికి తప్ప ప్రధానమంత్రి ఉపన్యాసాలు తరుచూ వినే వారందరికీ ఆయన భావోద్వేగాలు కొత్తగా అనిపించలేదు. ప్రధానమంత్రి ఎక్కడ స్వరం తగ్గిస్తారో, ఎక్కడ పెంచుతారో, ఎక్కడ ఆవేశంగామాట్లాడతారో, ఎక్కడ గద్గదస్వరం వినిపిస్తారో వారికి బాగా తెలుసు. పార్టీలో కొత్తగా చేరిన వారికి మోదీ ఉపన్యాసం చాలా అద్భుతంగా అనిపించింది. ‘ఆయన మాలో ఒక కార్యకర్తగా కలిసిపోయి చాలా ఆత్మీయంగా మాట్లాడారు. కాంగ్రెస్ నాయకత్వానికీ బిజెపి నాయకత్వానికీ చాలా తేడా కనిపించింది..’ అని కాంగ్రెస్ నుంచి బిజెపిలో చేరిన ఒక నేత చెప్పారు. మొత్తానికి కొత్తగా నియమితులైన ఆఫీసు బేరర్లందరూ మోదీ అనుకున్న లక్ష్యాన్ని నెరవేర్చారు. వ్యవసాయ, కార్మిక సంస్కరణలను ప్రవేశపెట్టినందుకు, అద్భుతమైన బడ్జెట్‌ను ప్రవేశపెట్టినందుకు కరోనాను కట్టుదిట్టంగా ఎదుర్కొన్నందుకు వారు మోదీ సర్కార్‌ను అభినందిస్తూ రాజకీయ తీర్మానాన్ని ఆమోదించారు. 


ప్రస్తుతం దేశంలో రగులుతున్న అంశాలపై ఎవరూ మాట్లాడలేదు. సమావేశంలో ప్రధాని మోదీదే ప్రధాన ప్రసంగం. పార్టీ అధ్యక్షుడు జగత్ ప్రకాశ్ నడ్డా వందన సమర్పణలా చేసిన ముగింపు ఉపన్యాసం గురించి తప్ప మిగతా వారు ఏమి మాట్లాడారో పార్టీ ప్రధాన కార్యదర్శి భూపేంద్ర యాదవ్ చెప్పలేదు. ‘మోదీ సందేశం లభించడమే మా భాగ్యంగా భావించాము’ అని ఆయన చెప్పారు. నిజానికి ప్రధానమంత్రి తన ప్రసంగంలో పార్టీ కార్యకర్తలే నిత్యం జనంలో ఉంటారని, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల గురించి ప్రజలేమనుకుంటున్నారో వారికే ముందుగా తెలుస్తుందని అన్నారు. కాని జనం ఏమనుకుంటున్నారో ఆయన ఆఫీసు బేరర్ల ద్వారా అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నించలేదు.


మూడు నెలలకు పైగా రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో ధర్నా చేస్తున్నా బిజెపి పదాధికారుల సమావేశంలో ఎవరూ మాట్లాడలేదు. అసలు గత ఏడాది సాగు చట్టాలపై ఆర్డినెన్స్‌లను ప్రవేశపెట్టినప్పుడు పార్టీలో అంతర్గతంగా ఎందుకు చర్చించలేదని అడగలేదు. కార్మిక చట్టాల గురించి సందేహాలు ప్రకటించలేదు. నిత్యావసర వస్తువులు, పెట్రోలు ధరలు ఆకాశానికి అంటినా ఎవరూ చర్చించే ప్రయత్నం చేయలేదు. ప్రభుత్వ ఆర్థిక విధానాలగురించి కానీ, బ్యాంకులు, ప్రభుత్వ రంగసంస్థలను తెగనమ్మేందుకు చేస్తున్న ప్రయత్నాల గురించి కానీ అడిగే ధైర్యం చూపలేదు. ఈ దేశం భవిష్యత్‌ను మార్చే కీలక నిర్ణయాలు తీసుకున్న ప్రధానమంత్రి రోజంతా తమ మధ్య ఉన్నా తమ మనసుల్లో రేగుతున్న సందేహాలను తీర్చుకునే ప్రయత్నం ఎవరూ చేయలేదు. ఇది పార్టీ ఆఫీసు బేరర్ల సమావేశమే కనుక హోంమంత్రి అమిత్ షాతో పాటు కేంద్రమంత్రులెవరినీ ఆహ్వానించలేదు. గతంలో వాజపేయి ప్రధానిగా ఉన్నప్పుడు ప్రతి కేంద్రమంత్రి పార్టీ కార్యాలయానికి వచ్చి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను వివరించేవారు. కాని ఇప్పుడు కేంద్రమంత్రులకు ఆ విలువ ఉన్నట్లు లేదు. మోదీ తీసుకున్న అన్ని నిర్ణయాలను రాజకీయ తీర్మానంలో పొందుపరిచి సభ్యుల హర్షధ్వానాలు పొందడమే ధ్యేయంగా ఈ సమావేశం జరిగింది. తాను తీసుకున్న నిర్ణయాలపై పార్టీ లాంఛన ఆమోదం పొందేందుకే మోదీ ఈ సమావేశం జరిపినట్లనిపించింది. 


కొత్తగా ఎన్నికైన పదాధికారులందరూ మోదీ, అమిత్ షా ఆచితూచి ఎంపిక చేసిన వారే. వారిలో కనీసం పదిశాతం మంది బిజెపిలో గత రెండు మూడేళ్లలోనే చేరిన వారు. తెలుగురాష్ట్రాల్లో కాంగ్రెస్ క్షీణ దశను గమనించిన డికె అరుణ, పురంధేశ్వరి, ఒడిషాలో బిజూ జనతాదళ్ తరఫున రెండుసార్లు లోక్ సభకు, రెండుసార్లు రాజ్యసభకు ఎంపికైన జయపాండా, తృణమూల్ కాంగ్రెస్ తరఫున రాజ్యసభకు ఎంపికై యుపిఏలో మంత్రిపదవులు చవి చూసిన ముకుల్ రాయ్, కేరళలో ఎస్‌ఎఫ్‌ఐ దశనుంచి సిపిఐ(ఎం) పార్టీలో ఉంటూ తర్వాత కాంగ్రెస్‌లో చేరి ఆ పార్టీల్లో రెండుసార్లు లోక్‌సభకు, ఒకసారి శాసనసభకు ఎన్నికై, చివరకు మోదీ విధానాలను ప్రశంసించి పార్టీ నుంచి బహిష్కృతుడైన అబ్దుల్లాకుట్టి, మొదటి ప్రయత్నంలోనే 1994లో ఐఏఎస్‌కు ఎంపికై ఒడిషాలోనూ, కేంద్రంలోనూ ముఖ్య పదవులను నిర్వహించిన అపరాజితా సారంగి వీరంతా బిజెపిలో తమ భవిష్యత్‌ను వెతుక్కుంటూ వచ్చిన వారే. ఇలాంటి పదాధికారులంతా తమ రాజకీయ భవిష్యత్‌ను చూసుకుంటారు కాని మోదీ, అమిత్ షా నిర్ణయాలను ప్రశ్నించి, లేదా కనీసం చర్చించి వివాదాస్పదం కావాలని ఎందుకు అనుకుంటారు?


మోదీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ ఇలాంటి కొత్త నేతలను, కార్యకర్తలను ప్రోత్సహిస్తున్నారు. వారికి పార్టీలో కీలక పదవులను కల్పిస్తున్నారు. పార్లమెంట్‌లో ఇతర పార్టీలకు చెందిన నేతలకు కన్నుగీటి తమవైపుకు తిప్పుకుంటున్నారు. కాంగ్రెస్, జనతాదళ్‌ల నుంచి తృణమూల్‌లో చేరి రెండుసార్లు రాజ్యసభకు ఎన్నికై, మన్మోహన్ హయాంలో మంత్రిపదవులు కూడా నిర్వహించిన దినేశ్ త్రివేది తాజాగా తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి కాషాయతీర్థం పుచ్చుకున్నారు. రాష్ట్రాల్లో వ్యూహం మరొకరకంగా ఉన్నది. అధికారంలో ఉన్న ప్రభుత్వాలను పడగొట్టాలన్నా, తాము అధికారంలోకి రావాలన్నా ఇతర పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలను రాజీనామా చేయించడం, వారికి మళ్లీ సీట్లు ఇచ్చి గెలిపించుకోవడం బిజెపికి వెన్నతో పెట్టిన విద్య అయింది. రెండు రోజుల క్రితం అయిదుగురు ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో పుదుచ్చేరిలో కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోయిన విషయం తెలిసిందే. ఏప్రిల్‌లో పుదుచ్చేరిలో ఎన్నికలకు ముందు తమ ప్రభుత్వం ఉంటే అక్కడ విజయం ఏదో రకంగా దక్కించుకోగలమన్నదే బిజెపి వ్యూహంగా కనిపిస్తోంది. 


అనుసరించిన పద్ధతిలో తేడా ఉందేమోకాని, కాంగ్రెస్‌లో గతంలో అవలంబించిన సంస్కృతికీ, బిజెపిలో ఏర్పడుతున్న సంస్కృతికీ పెద్ద తేడా కనిపించడం లేదు. నిజానికి మోదీ అనే వ్యక్తే ఒక తిరుగులేని శక్తిగా ప్రభవిస్తున్నారు. సకల రాజకీయాలు మోదీ చుట్టూనే తిరుగుతున్నప్పుడు మిగతా వారంతా ఆయనకు ‘ప్రచారక్’లుగా మారడంలో ఆశ్చర్యం లేదు. అందుకే బిజెపి పదాధికారుల సమావేశాలు జరిగినా, పార్లమెంటరీ పార్టీ సమావేశాలు జరిగినా మారుతున్న భారత రాజకీయాల తీరుతెన్నులను తెలుసుకొమ్మని వారికి మోదీ చెబుతున్నారు. తమ పనితీరు మార్చుకోవాలని, తన ప్రభుత్వ విధానాలను ప్రజలకు వివరించాలని నిర్దేశిస్తున్నారు.


ఇదంతా ఒక పంచ కూళ కషాయం అయితే కాంగ్రెస్‌ను, ఇతర పార్టీలను ద్వేషించి, మోదీని అభిమానించి బిజెపిలో చేరకపోయినా ఆ పార్టీకి అండగా నిలుస్తున్న కొత్త తరం ఒకటి తయారైంది. వేలాది మందితో కూడిన సోషల్ మీడియా బృందాలు ఏర్పడ్డాయి. వారు ప్రభావితం చేస్తున్న ప్రజల సంఖ్య కూడా తక్కువేమీకాదు. వీరందరికీ ఒకప్పటి సిద్ధాంతాల గురించి, కానీ బిజెపికి, సంఘ్‌కు ఉన్న సంబంధం గురించి కానీ పెద్దగా తెలియకపోవచ్చు. గతంలో వాజపేయి, ఆడ్వాణీ ఉన్నప్పుడు ఆర్‌ఎస్ఎస్ బిజెపి సంస్కృతిని నిర్దేశించేది. ఇతర పార్టీలతో పోలిస్తే తమది విశిష్టమైన పార్టీ అని చెప్పుకునేది. ఇప్పుడు బిజెపి తనకంటూ భిన్నమైన సంస్కృతిని ఏర్పర్చుకుంది. ఇది మోదీ సంస్కృతి; సంఘ్‌తో నిమిత్తం లేకుండా ఒక పద్ధతి ప్రకారం ఏర్పడుతున్న సమాంతర వ్యవస్థ. సంఘ్ సమర్థించినా, సమర్థించకపోయినా మోదీని సమర్థించే మోదీ సేన ఒకటి స్పష్టంగా కనిపిస్తోంది. కానీ పదాధికారులనుంచి పార్లమెంట్ సభ్యుల వరకూ, కార్యకర్తలనుంచి సీనియర్ నేతల వరకూ ప్రశ్నించేవారే లేరు. సంభవిస్తున్న పరిణామాలను చర్చించేవారే అంతకంటే లేరు. పార్టీకి, ప్రభుత్వానికి, ప్రజాస్వామానికీ అతీతంగా వాటిని శాసించే ఒకే ఒక వ్యక్తి ఉన్నప్పుడు, దేశంలో ప్రభవిస్తున్న ప్రస్తుత వ్యవస్థకు ఏ పేరు పెట్టాలా అన్న సందేహం కలగక తప్పదు. రెండోసారి ఎన్నికయిన వెంటనే మోదీ తన ట్విట్టర్ నుంచి మై భీ చౌకీదార్ హు (నేను కాపలాదారు) అన్నటాగ్ లైన్‌ను తీసేశారు. కాపలాదారు పదానికి అర్థం మారిపోయిందా?


ఎ. కృష్ణారావు

ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి

Updated Date - 2021-02-24T06:04:50+05:30 IST