Advertisement

నిర్ణయించేది ఆయనే!

Feb 26 2021 @ 00:30AM

ఎలాంటి పరిస్థితులు ఎదురైనా దైవ చింతన మానని వారు ఎందరో ఉంటారు. వారు అచంచలమైన విశ్వాసం కలిగిన వారు. ప్రతి పనినీ దేవుడి ధ్యానంతోనే సాగిస్తూ ఉంటారు. ‘ఇంత చేస్తున్నాం. దైవం మనకు ఎలాంటి ప్రతిఫలం ఇస్తాడు?’ అనే ప్రశ్న అలాంటి విశ్వాసులలో తలెత్తితే... ఆశ్చర్యపోనక్కర్లేదు. దాన్ని దైవం పట్ల అవిధేయతగా పరిగణించనవసరం లేదు. నిజానికి రెండువేల ఏళ్ళ కిందట... సాక్షాత్తూ ఏసు ప్రభువుకే ఈ ప్రశ్న ఎదురయింది. ఆయన ప్రత్యక్ష శిష్యులైన అపొస్తలుల్లో ముఖ్యుడు పేతురు స్వయంగా అడిగాడు... ‘‘నిన్ను అనుసరించడం కోసం ప్రతిదాన్నీ మేం వదులుకున్నాం. మాకు ఏం దొరుకుతుంది?’’ అని. దేవుడి వెంట నడిచిన వారికి రాబోయే కాలంలో దక్కే ప్రతిఫలం ఏమిటనేది పేతురు ప్రశ్నలోని అంతరార్థం. ‘పరలోక రాజ్యం’ అని ఒక్క మాటలో ఏసు సమాధానం ఇస్తే చాలు. కానీ ఆ రాజ్యం ఎలా ఉంటుందో కూడా ఆయన వివరించాడు. 


‘‘‘పరలోక రాజ్యం... పొద్దున్నే తన ద్రాక్ష తోటలో పని చెయ్యడానికి కూలీలను నియమించుకోవడానికి వెళ్తున్న భూస్వామిలా ఉంటుంది. అతను రోజంతా పని చేస్తే ఒక దీనారం ఇవ్వడానికి ఒప్పుకొని, పనివారిని తన ద్రాక్ష తోటలోకి పంపించాడు. ఉదయం తొమ్మిది గంటలయింది. అతను బజారులోకి వెళ్ళాడు. అక్కడ పని దొరక్కపోవడంతో నిలబడిన కొందరిని చూశాడు. ‘‘మీరు కూడా వెళ్ళండి, నా ద్రాక్షతోటలో పని చెయ్యండి. నేను మీకు ఇవ్వాల్సినంత మొత్తం ఇస్తాను’’ అన్నాడు. వాళ్ళు తోటలోకి వెళ్ళారు. తోట యజమాని మధ్యాహ్నం పన్నెండు గంటలకూ, మూడు గంటలకూ కూడా బజారుకు వెళ్ళాడు. పని దొరక్కుండా నిలబడిన వారిని తన తోటలో పని చెయ్యడానికి పంపించాడు.  సాయంత్రం అయిదు గంటలయింది. అతను మరోసారి బయటకు వచ్చాడు. ఇంకా అక్కడ నిలబడిన కొందరు కనిపించారు. ‘‘రోజంతా ఏ పని చెయ్యకుండా ఇక్కడెందుకు నిలబడ్డారు?’’ అని అడిగాడు. ‘‘మమ్మల్ని ఎవరూ పనిలో పెట్టుకోలేదు’’ అని వాళ్ళు చెప్పారు. ‘‘మీరు కూడా వెళ్ళండి. నా ద్రాక్ష తోటలో పని చెయ్యండి’’ అని అన్నాడు.


మరికొంత సమయం గడిచిన తరువాత, తోట పర్యవేక్షకుణ్ణి యజమాని పిలిచాడు. పనివాళ్ళందరినీ పిలిచి, ‘‘వాళ్ళకి కూలీ డబ్బులు ఇవ్వు. చివర్లో పనికి తీసుకున్నవాళ్ళతో మొదలుపెట్టు... ఆఖరులో మొదట పనిలోకి వచ్చిన వాళ్ళకు ఇవ్వు’’ అని చెప్పాడు. సాయంత్రం అయిదు గంటలకు పనిలోకి వచ్చిన వాళ్ళు ఒక్కొక్క దీనార్‌ చొప్పున అందుకున్నారు. 


మొదట పనిలోకి వచ్చిన వాళ్ళు తమకు ఎక్కువ డబ్బు ఇస్తారని అనుకున్నారు. కానీ వాళ్ళకు కూడా పర్యవేక్షకుడు ఒక్కొక్క దీనారే ఇచ్చాడు. అది తీసుకుంటున్నప్పుడు వాళ్ళు ఆ తోట యజమాని మీద సణుక్కోవడం ప్రారంభించారు. ‘‘వీళ్ళందరినీ ఒక గంట క్రితం మాత్రమే పనిలోకి తీసుకున్నారు. కానీ వాళ్ళకూ, మాకూ సమానంగా కూలీ డబ్బులు ఇస్తున్నారు. మేం ఉదయం నుంచీ ఎండలో ఎంతో కష్టపడ్డాం. ఎక్కువ పని చేశాం కదా్‌’’ అని నిలదీశారు. 


అప్పుడు వారిలో ఒకరిని ఉద్దేశించి భూమి యజమాని మాట్లాడుతూ ‘‘మిత్రమా, నేను మీకు చేసిన అన్యాయం ఏదీ లేదు. మీరు ఒక దీనార్‌ తీసుకొని పని చెయ్యడానికి ఒప్పుకున్నారు కదా! అది తీసుకొని వెళ్ళండి. నేను చివర్లో పనిలోకి తీసుకున్నవారికి కూడా మీకు ఇచ్చినంతే ఇవ్వాలని అనుకున్నాను. నా సొంత డబ్బుల్తో నేను కోరుకున్నది చేసే హక్కు నాకు లేదా? లేకుంటే నేను ఉదారంగా ఉన్నాను కాబట్టి మీకు అసూయగా ఉందా?’’ అని ప్రశ్నించాడు’’ అంటూ కథను ఏసు ప్రభువు ముగించాడు. 


పనివారు అందరికీ ఒకే విధంగా చెల్లించాలన్న భూస్వామి నిర్ణయం అన్యాయం కాదు... దయ. ఆ దయాగుణం దైవత్వాన్ని ప్రతిఫలిస్తుంది. దైవం అనుగ్రహం ఉన్నవారిలో విశ్వాసం ఎప్పుడు కలిగినా, వారు దైవ సేవలో ఎప్పుడు తమను నిమగ్నం చేసుకున్నా తన అపారమైన కరుణను వారిపై ఆయన ప్రసరిస్తాడు. ద్రాక్ష తోట యజమానిలా తన దయను అవసరమైనప్పుడు, ఎవరిపట్ల ఎలా ప్రదర్శించాలనే నిర్ణయం ఆయనదే! దానికి అర్హులైన వారందరికీ ఫలాలు దక్కుతాయి. దైవం చూపిన దారిలో జీవితాన్ని గడిపి, అంతిమంగా పరలోక రాజ్యంలో ప్రవేశించినవారందరూ సమాన ఫలాలను పొందుతారు. వారందరిపైనా దైవ కృప సమానంగా వర్షిస్తుంది.  


దయాగుణం దైవత్వాన్ని ప్రతిఫలిస్తుంది. దైవం అనుగ్రహం ఉన్నవారిలో విశ్వాసం ఎప్పుడు కలిగినా, వారు దైవ సేవలో ఎప్పుడు తమను నిమగ్నం చేసుకున్నా తన అపారమైన కరుణను వారిపై ఆయన ప్రసరిస్తాడు. ద్రాక్ష తోట యజమానిలా తన దయను అవసరమైనప్పుడు, ఎవరిపట్ల ఎలా ప్రదర్శించాలనే నిర్ణయం ఆయనదే! దానికి అర్హులైన వారందరికీ ఫలాలు దక్కుతాయి.

Follow Us on:
Advertisement
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.