ఈ ఊరిలో ఒక్కో ఇంట్లో ఇద్దరు ప్రభుత్వోద్యోగులు.. అంత్యక్రియల ఊసేలేదు.. దేవుళ్లనే నమ్మని ఈ గ్రామం కథేంటో తెలిస్తే..

ABN , First Publish Date - 2021-12-23T17:24:22+05:30 IST

రాజస్థాన్‌లోని చూరూ జిల్లాలోని..

ఈ ఊరిలో ఒక్కో ఇంట్లో ఇద్దరు ప్రభుత్వోద్యోగులు.. అంత్యక్రియల ఊసేలేదు.. దేవుళ్లనే నమ్మని ఈ గ్రామం కథేంటో తెలిస్తే..

రాజస్థాన్‌లోని చూరూ జిల్లాలోని లాంబా కీ ఢాణీ గ్రామం ఎంతో విచిత్రంగా కనిపిస్తుంది. గ్రామంలో ఎటువంటి మందిరం గానీ, మసీదు గానీ కనిపించదు. ఈ గ్రామానికి చెందినవారు ఎటువంటి ధార్మిక కార్యక్రమాలలోనూ పాల్గొనరు. 105 ఇళ్లు ఉన్న ఈ లాంబా కీ ఢాణీ గ్రామ జనాభా 750. వీరిలో 200 మంది ప్రభుత్వ ఉన్నత ఉద్యోగాలు చేస్తుండగా, 60 మంది పెన్షనర్స్ ఉన్నారు. గ్రామానికి చెందిన 25 మంది యువకులు కెనడాలో వైద్యులుగా ఉన్నారు. గ్రామానికి చెందిన ఐదుగురు ఉద్యోగులు జాతీయ స్థాయి క్రీడల్లో తమ సత్తాచాటి, వివిధ పతకాలు అందుకున్నారు. వీరిలో ఇద్దరు కోచ్‌లుగా కూడా రాణిస్తున్నారు.


ఇంతేకాదు గ్రామానికి చెందిన ఇద్దరు ఇంటెలిజెన్స్ బ్యూరోలో అధికారులుగా పనిచేస్తున్నారు. అలాగే గ్రామానికి చెందిన వారిలో ఇద్దరు ప్రొఫెసర్లు, ఏడుగురు లాయర్లు, 35 మంది అధ్యాపకులు ఉన్నారు. ఇక్కడ స్వాతంత్ర్య సంగ్రామంలో పాల్గొన్న సేనాని కూడా ఉన్నారు. గ్రామానికి చెందినవారు భగవంతుడిని నమ్మరని, కృషి, పట్టుదలను మాత్రమే పూర్తిగా నమ్ముతారని స్థానికులు తెలిపారు. గ్రామంలో ఎవరైనా చనిపోతే వారికి శాస్త్రబద్ధంగా అంత్యక్రియలు కూడా నిర్వహించరు. కేవలం మృతదేహాన్ని దహనం చేస్తారు. గ్రామంలో రెండు ప్రైవేటు స్కూళ్లు, ఒక హైస్కూలు ఉంది. ఒక ప్రభుత్వ ఆరోగ్య కేంద్రం, పోస్టాఫీసు కూడా ఉన్నాయి. గ్రామంపై ఆర్య సమాజం ప్రభావం ఉన్నదని ఇక్కడి వృద్ధులు తెలిపారు. ఇక్కడి పిల్లలు ఆర్య సమాజం స్కూలులోనే చదువుకుంటారని తెలిపారు. గ్రామానికి చెందిన ఈశ్వర్ సింగ్ మాట్లాడుతూ తన తండ్రి స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్నారని 2018లో ఆయన కన్నుమూశారని తెలిపారు. గ్రామానికి చెందిన వారు మూఢనమ్మకాలకు దూరంగా ఉంటారని పేర్కొన్నారు.

Updated Date - 2021-12-23T17:24:22+05:30 IST