MP Raghurama ఇంటికి మళ్లీ సీఐడీ.. విచారణకు హాజరవుతా.. కీచకుడెవరో తేలుస్తా..

ABN , First Publish Date - 2022-01-13T06:41:01+05:30 IST

సంక్రాంతి పండుగకు ముందు రాష్ట్ర సీఐడీ పోలీసులు మరోసారి వైసీపీ నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ఇంటికి వెళ్లారు.

MP Raghurama ఇంటికి మళ్లీ సీఐడీ.. విచారణకు హాజరవుతా.. కీచకుడెవరో తేలుస్తా..

  • 17న విచారణ..

అమరావతి/రాయదుర్గం, జనవరి 12 (ఆంధ్రజ్యోతి): సంక్రాంతి పండుగకు ముందు రాష్ట్ర సీఐడీ పోలీసులు మరోసారి వైసీపీ నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ఇంటికి వెళ్లారు. గురువారం నుంచి నియోజకవర్గంలో పర్యటిస్తానని ఆయన ప్రకటించిన నేపథ్యంలో.. దేశద్రోహం, రాజద్రోహం కేసుల  విచారణకు రావాలని నోటీసు ఇచ్చారు. బుధవారం హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని ఆయన నివాసానికి వెళ్లిన సీఐడీ బృందం ఈనెల 17న విజయవాడలోని తమ కార్యాలయంలో హాజరు కావాలని నోటీసులో పేర్కొంది. రఘురామ ఇంట్లో లేకపోవడంతో తనకివ్వాలని కుమారుడు అడుగగా.. సీఐడీ బృందం నిరాకరించింది. కాసేపటికి ఎంపీ వచ్చి స్వయంగా సంతకం చేసి నోటీసు అందుకున్నారు. గతంలో మీడియా సమావేశంలో రఘురామ మాట్లాడుతూ.. వైసీపీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు గుర్తుచేస్తూ సీఎం జగన్‌ ఒకే కులానికి పెద్దపీట వేస్తున్నారంటూ రెడ్ల ప్రస్తావన తీసుకొచ్చారు.


ప్రభుత్వ విశ్వసనీయతను దెబ్బతీసేలా ఆయన వ్యాఖ్యలున్నాయంటూ సీఐడీ సుమోటోగా దేశద్రోహం కేసు నమోదు చేసింది. ఈ కేసులో అత్యుత్సాహం ప్రదర్శించిన సీఐడీ అధికారులు గత ఏడాది మే 14న హైదరాబాద్‌ నుంచి ఆయన్ను గుంటూరు తీసుకొచ్చి.. అర్ధరాత్రి చిత్రహింసలకు గురిచేయడం తెలిసిందే.


కాగా.. పండుగ ముందు తనకు ఇలా నోటీసు ఇవ్వడం కక్షసాధింపులో భాగమేనని రఘురామ అన్నారు. పాలకుడు చేసిన ద్రోహాన్ని ప్రశ్నిస్తే రాజద్రోహం కేసులు పెడతారా అని మండిపడ్డారు. సీఐడీ విచారణకు హాజరవుతానని, హీరో ఎవరో, కీచకుడెవరో తేలుస్తానని చెప్పారు. ‘ఏ రోజైతే నేను నా నియోజకవర్గానికి వెళ్లాలనుకున్నానో.. ముందుగానే హడావుడిగా నోటీసు తయారు చేశారు. హిందువులకు సంక్రాంతి చాలా ప్రత్యేకం. ఈ విషయం సీఐడీ చీఫ్‌ సునీల్‌కుమార్‌కు తెలియకపోవచ్చు, సీఎం జగన్‌కు అసలే తెలిసి ఉండకపోవచ్చు’ అని ఆయన అన్నారు.

Updated Date - 2022-01-13T06:41:01+05:30 IST