CID Case On Chandra Babu: ఏ1గా చంద్రబాబును చేర్చుతూ జగన్ సర్కార్ కేసు.. ఇంతకూ ఏమిటీ కేసు?

ABN , First Publish Date - 2022-05-11T21:17:25+05:30 IST

రాజధాని అమరావతితో కృష్ణా, గుంటూరు జిల్లాలను అనుసంధానం చేస్తూ 2018లో సీఆర్‌డీఏ ఇన్నర్‌ రింగ్‌ రోడ్డును ప్రతిపాదించింది. ఎనిమిది వరుసల రహదారి నిర్మాణం కోసం భూ సేకరణ పద్ధతిలో..

CID Case On Chandra Babu: ఏ1గా చంద్రబాబును చేర్చుతూ జగన్ సర్కార్ కేసు.. ఇంతకూ ఏమిటీ కేసు?

రాజధాని అమరావతితో కృష్ణా, గుంటూరు జిల్లాలను అనుసంధానం చేస్తూ 2018లో సీఆర్‌డీఏ ఇన్నర్‌ రింగ్‌ రోడ్డును ప్రతిపాదించింది. ఎనిమిది వరుసల రహదారి నిర్మాణం కోసం భూ సేకరణ పద్ధతిలో వెళ్లాలని అప్పటి ప్రభుత్వం నిర్ణయించింది. విడతల వారీగా ప్రాజెక్టును పూర్తి చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. మొత్తం 16,556 ఎకరాల భూమి సేకరించి రెండు దశల్లో పూర్తి చేయాలనేది లక్ష్యం.


అయితే రింగ్‌ రోడ్డు అలైన్‌మెంట్‌లో కొందరి భూముల ధరల పెంపునకు కుట్ర దాగుందని 2019లో అధికారంలోకి వచ్చిన జగన్‌ ప్రభుత్వం ఆరోపించింది. దీనిపైనే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలంటూ ఎమ్మెల్యే ఆళ్ల ఇటీవల ఫిర్యాదు చేశారు. ప్రాథమిక విచారణలో రాజకీయ నేతలు, భూ యజమానులు, సంస్థలు.. మొత్తం 13 మందిని నిందితులను చేర్చింది. దీంతో పాటు ‘మరికొందరు ప్రభుత్వ, ప్రైవేటు వ్యక్తులు’ ఉన్నట్లు తెలిపింది. ఆ ప్లాన్‌ రూపొందించిన అధికారి ఎవరు? దానికి ఆమోదం తెలిపిందెవరు? ఆ ప్లాన్‌లో సంతకాలు ఎవరు పెట్టారనే విషయాలను మాత్రం ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొనలేదు.


ఏయే సెక్షన్లు

  • మాస్టర్‌ ప్లాన్‌, ఇన్నర్‌ రింగ్‌ రోడ్డులో అవకతవకలపై కుట్ర, మోసం, అవినీతి ఆరోపణలు చేశారు. ఐపీసీ సెక్షన్లు 120(బి), 420, 34, 35, 36, 37, 166, 167, 217   కింద ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. దీంతోపాటు అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్‌ 13(2) రెడ్‌ విత్‌  13(1)(ఏ) కూడా చేర్చారు.
  • 120(బి): నేరపూరిత కుట్ర.. గరిష్ఠంగా మరణశిక్ష, యావజ్జీవ కారాగార శిక్ష, రెండేళ్లు.. అంతకుమించి కఠిన కారాగార శిక్ష.. కనిష్ఠంగా ఆరు నెలల శిక్ష, జరిమానా విధించొచ్చు.
  • 420: మోసం, నమ్మక ద్రోహం.. ఏడేళ్ల వరకూ శిక్ష, జరిమానా.
  • 34: వ్యక్తులు గ్రూపుగా ఏర్పడి కుట్ర, నేరాలకు పాల్పడడం.. శిక్షతోపాటు జరిమానా.
  • 35: ఉద్దేశపూర్వకంగా తప్పు చేయడం.. స్వార్థంతో నేరానికి పాల్పడడం..
  • 36: న్యాయవిరుద్ధమైన చర్యలు
  • 37: పాక్షికంగా నష్టం కలిగించడం, గాయపరచడం.
  • 166: పబ్లిక్‌ సర్వెట్‌ చట్టాన్ని గౌరవించకపోవడం.
  • 167: పబ్లిక్‌ సర్వెంట్‌ తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించడం.. మూడేళ్ల వరకూ శిక్ష, జరిమానా.
  • 217: చట్టవిరుద్ధంగా పబ్లిక్‌ సర్వెంట్‌ నిర్ణయాలు తీసుకోవడం.. రెండేళ్ల వరకూ శిక్ష
  • 13(2): పబ్లిక్‌ సర్వెంట్‌ అవినీతికి పాల్పడడం.. ఏడేళ్ల వరకూ శిక్ష.
  • 13(1)(ఏ): నేరపూరిత కుట్ర.. ఏడేళ్ల శిక్షతోపాటు జరిమానా.

Read more