సీఐడీ దౌర్జన్యం

ABN , First Publish Date - 2022-07-01T08:57:41+05:30 IST

సీఐడీ దౌర్జన్యం

సీఐడీ దౌర్జన్యం

అమరావతిలో అర్ధరాత్రి యూట్యూబర్‌ అరెస్ట్‌

రాత్రి వేళ గోడదూకి ఇంట్లోకి ప్రవేశం

గడ్డపలుగుతో తలుపులు పగులగొట్టి లోనికి

అడ్డొచ్చిన తల్లిని నెట్టివేసిన వైనం

సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టారన్న అభియోగం

మంగళగిరిలో మరో టీడీపీ కార్యకర్త అదుపులోకి

ఇద్దరినీ గుంటూరు తరలించి రోజంతా విచారణ


గుంటూరు, జూన్‌ 30: సోషల్‌ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టారన్న నెపంతో సామాన్యులపై సీఐడీ అధికారుల దౌర్జన్యం కొనసాగుతూనే ఉంది. ఈ ఆరోపణలపై ఇప్పటికే కొందరు టీడీపీ కార్యకర్తలను అరెస్టు చేసిన సీఐడీ అధికారులు తాజాగా.. మరోసారి ఓవర్‌ యాక్షన్‌ చేశారు. సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టారనే అభియోగంపై పల్నాడు జిల్లాకు చెందిన టీడీపీ కార్యకర్త, యూట్యూబర్‌ గార్లపాటి వెంకటేశ్‌ అర్ధరాత్రి అదుపులోకి తీసుకున్నారు.  మంగళగిరిలోనూ మరో టీడీపీ కార్యకర్త సాంబశివరావు బెడ్‌రూమ్‌లోకి ప్రవేశించి బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. ఇరువురిని గుంటూరులోని సీఐడీ ప్రాంతీయ కార్యాలయానికి తరలించి ఉదయం నుంచి రాత్రి వరకు విచారణ పేరుతో కార్యాలయంలోనే ఉంచారు. కనీసం వారిని ఎందుకు అరెస్టు చేస్తున్నారో కూడా చెప్పకపోవడం, వారి న్యాయవాదులకు కనీసం ఎఫ్‌ఐఆర్‌ కూడా ఇవ్వకపోవటంతో టీడీపీ నాయకులు సీఐడీ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. దీంతో వారిని కూడా అరెస్టు చేశారు. ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. పల్నాడు జిల్లా అమరావతి మండలం ధరణికోటకు చెందిన గార్లపాటి వెంకటేశ్‌ టీడీపీ సానుభూతిపరుడు. ఆయన సొంతగా ఓ యూట్యూబ్‌ చానల్‌ నిర్వహిస్తున్నారు. అలాగే నకరికల్లుకు చెందిన టీడీపీ సానుభూతిపరుడు మోకరాల సాంబశివరావు కొంతకాలంగా కుటుంబంతో కలిసి మంగళగిరిలో ఉంటూ ప్రైవేటు ఉద్యోగం చేసుకుంటున్నాడు. బుధవారం రాత్రి 11.30 గంటల సమయంలో సివిల్‌ డ్రెస్‌లో ఉన్న ఐదుగురు వ్యక్తులు ధరణికోటలోని వెంకటేశ్‌ ఇంటికి వెళ్లారు. గేటుకు తాళం వేసి ఉండటంతో గోడ దూకి లోపలకు  ప్రవేశించారు. సీఐడీ పోలీసులమని, వెంకటేశ్‌ కోసం వచ్చామని చెప్పారు. వాళ్లంతా సివిల్‌ డ్రెస్‌లో ఉండి, అక్రమంగా లోనికి చొరబడడంతో కంగారుపడిన వెంకటేశ్‌ కుటుంబ సభ్యులు వారిని వీడియో తీశారు. ఆగ్రహించిన సీఐడీ సిబ్బంది అందులో తాము కనిపించకుండా ఉండేందుకు లైట్లు పగలగొట్టారు. వెంకటేశ్‌ ఉన్న గది తలుపులు పగలగొట్టేందుకు ప్రయత్నించారు. అడ్డుకునేందుకు వచ్చిన తల్లిని పక్కకు నెట్టేశారు. దాదాపు రెండు గంటలపాటు పోలీసులు హల్‌చల్‌ చేశారు. చివరకు వెంకటేశ్‌ ఉన్న గదిలోకి ప్రవేశించి అదుపులోకి తీసుకున్నారు. ఈ దృశ్యాన్ని కూడా వెంకటేశ్‌ అక్క ఫోనులో వీడియో తీస్తుండటంతో ఆ ఫోన్‌ను లాగేసుకున్నారు. వెంకటేశ్‌తోపాటు అతని తల్లిదండ్రుల సెల్‌ఫోన్లు, అక్క సెల్‌ఫోన్‌ మొత్తం నాలుగింటినీ సీజ్‌ చేసి వెంకటేశ్‌ను అదుపులోకి తీసుకుని గుంటూరు తరలించారు. గురువారం ఉదయం 6 గంటల సమయలో మంగళగిరిలోని సాంబశివరావు ఇంట్లోకి కూడా సీఐడీ పోలీసులు అదేవిధంగా దూసుకెళ్లారు. బెడ్‌రూమ్‌లో సాంబశివరావు భార్య పసిపిల్లకు పాలు ఇస్తున్నప్పటికీ నేరుగా లోపలికి వెళ్లారు. సాంబశివరావును అరెస్టు చేసి గుంటూరు తీసుకువచ్చారు. ఉదయం నుంచి రాత్రి వరకు వెంకటేశ్‌, సాంబశివరావులను తమ అదుపులోనే ఉంచి విచారించారు. తమ కార్యకర్తలను సీఐడీ పోలీసులు కక్షపూరితంగా అక్రమంగా అరెస్టు చేశారంటూ టీడీపీ నాయకులు సీఐడీ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. దీంతో  పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని నగరంపాలెం స్టేషన్‌కు తరలించారు. 


వెంకటేశ్‌ను అరెస్టు చేస్తున్నాం: సీఐడీ

ఫోర్జరీ డాక్యుమెంటును ఫార్వర్డ్‌ చేసిన కేసులో నోటీసు ఇచ్చేందుకు సీఐడీ అధికారులు వెళ్లగా వెంకటేశ్‌, ఆయన కుటుంబ సభ్యులు తమ విధులకు ఆటంకం కలిగించారని సీఐడీ అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో సాంబశివరావుకు 41ఎ నోటీసు ఇచ్చి పంపుతున్నామని, వెంకటేశ్‌ను మాత్రం మేజిస్ట్రేట్‌ ముందు హాజరుపరచనున్నామని గురువారం రాత్రి సీఐడీ అధికారులు ప్రకటించారు. సోషల్‌ మీడియాలో పోస్టింగ్‌ పెడితే 41ఎ నోటీసు ఇచ్చి విచారణకు పిలవాలేగానీ  చట్టవిరుద్ధంగా ఇళ్లలోకి అక్రమంగా ప్రవేశించి అదుపులోకి తీసుకున్నారని టీడీపీ లీగల్‌ సెల్‌ న్యాయవాదులు నాగులూరి హరిబాబు, దొద్దాల కోటేశ్వరరావు ఆరోపించారు. కాగా.. వెంకటేశ్‌ అరెస్టులో పాల్గొన్న సీఐడీ పోలీసులందరూ శిక్షార్హులేనని, వారందరిపై ప్రైవేట్‌ కేసు టీడీపీ సీనియర్‌నేత వర్ల రామయ్య హెచ్చరించారు. 

Updated Date - 2022-07-01T08:57:41+05:30 IST