సీఐఈ లీజు స్థలాలపై లొల్లి

ABN , First Publish Date - 2021-03-01T07:12:07+05:30 IST

కో ఆపరేటివ్‌ ఇండస్ట్రీస్‌ ఎస్టేట్‌ (సీఐఈ) బాలానగర్‌ ఫేజ్‌-1లోని లీజు స్థలాలపై లొల్లి కొనసాగుతోంది. పర్సన్‌ ఇన్‌చార్జి కమిటీ

సీఐఈ లీజు స్థలాలపై లొల్లి
బాలానగర్‌ కో ఆపరేటీవ్‌ ఇండస్ట్రీస్‌కు ప్రభుత్వం ఇచ్చిన లీజు స్థలం ఇదే

 అసోసియేషన్‌ ముసుగులో డబ్బులు వసూలు చేస్తున్నారంటూ ఆరోపణలు

 అనధికార మెమోను ఆసరాగా చేసుకుని దందా


బాలానగర్‌, ఫిబ్రవరి 28 (ఆంధ్రజ్యోతి): కో ఆపరేటివ్‌ ఇండస్ట్రీస్‌ ఎస్టేట్‌ (సీఐఈ) బాలానగర్‌ ఫేజ్‌-1లోని లీజు స్థలాలపై లొల్లి కొనసాగుతోంది. పర్సన్‌ ఇన్‌చార్జి కమిటీ(పీఐసీ) లేకుండానే లీజు స్థలాన్ని స్వాధీనం చేసుకున్నారని కొందరు ఆరోపిస్తుంటే, కో ఆపరేటివ్‌ ఇండస్ట్రియల్‌ ఎస్టేట్‌ టెనెంట్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ సభ్యులు ఆ స్థలం తమకే దక్కుతుందని, దాని కోసం డబ్బులు కూడా ముట్ట చెప్పామని అంటున్నారు. 


లీజు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు 

పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో 1963లో బాలానగర్‌ నర్సాపూర్‌ చౌరస్తా సమీపంలోని 47 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని ఆనాటి ప్రభుత్వం 75 మందికి 51 సంవత్సరాల లీజుకు ఇచ్చింది. 2015 డిసెంబర్‌ 31కి లీజు గడువు ముగియడంతో  స్థలాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ఆ స్థలాల్లో ఎలాంటి కట్టడాలు, విక్రయాలు చేయకూడదని ఉత్తర్వులను జారీ చేసింది. 


పీఐసీ లేకుండానే 

లీజు గడువు ముగిసిన ప్రభుత్వ స్థలాన్ని పీఐసీ పర్యవేక్షణలో  స్వాధీనం చేసుకోవాలి. కానీ 17-02-2011 నాటికి పీఐసీ గడువు ముగిసింది. దీంతో ప్రభుత్వ పరిశ్రమల శాఖ అధికారులు రంగారెడ్డి - 1 డీఐసీలో డిప్యూటీ డైరెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న రాజారావును పర్సన్‌ ఇన్‌చార్జిగా నామినేట్‌ చేశారు. ఆయన ద్వారా లీజు స్థలాలను స్వాధీనం చేసుకున్నట్లుగా ఆర్‌టీఐ ఉద్యమకారుడు కుప్పు స్వామి అడిగిన అంశాలపై అధికారులు తెలిపిన వివరాల ద్వారా తెలుస్తోంది. రాజారావు పర్యవేక్షణలో పంచనామా నిర్వహించి స్థలాన్ని ప్రభుత్వానికి అప్పగించారు. అయితే నామినేట్‌ అయిన పర్సన్‌ ఇన్‌చార్జి కేర్‌ టేకర్‌గా మాత్రమే ఉండాలని, స్థలాలు స్వాధీనం చేసుకునే అధికారం లేదని పలువురు సీనియర్‌ పారిశ్రామికవేత్తలు వాదిస్తున్నారు. 


టెనెంట్స్‌ పరిస్థితి ఏంటి?

లీజు స్థలాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడంతో సబ్‌ లీజుకు తీసుకుని ఆ స్థలంలో పరిశ్రమలు నడుపుకుంటున్న సుమారు 250 మంది ఆందోళనకు గురవుతున్నారు. తామంతా రోడ్డున పడతామని చెబుతున్నారు. 2016లో టెనెంట్స్‌ అందరూ ఎం.నర్సింహ్మరావుగౌడ్‌ నేతృత్వంలో ఆయన అధ్యక్షుడిగా కో ఆపరేటివ్‌ ఇండస్ట్రియల్‌ ఎస్టేట్‌ టెనెంట్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ను ఏర్పాటు చేశారు. ప్రభుత్వ ధర ప్రకారం గజానికి రూ.15,000 చొప్పున చెల్లించి స్థలాలు కొనుక్కోవడానికి తామంతా సిద్ధంగా ఉన్నామని కమిషనర్‌ ఆఫ్‌ ఇండస్ట్రీస్‌ అధికారులను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. వారి వినతిని పరిశీలించిన అఽధికారులు లీజు స్థలాలపై అనధికార మెమో(521/1995, తేది:13.2.2016)ను అంతర్గత పరిశీలన కోసం విడుదల చేశారు. 


అనధికార మెమోను చూపిస్తూ..

అనధికార మెమోను సంపాదించిన కొంతమంది అసోసియేషన్‌ సభ్యులు స్థలాలు వస్తాయని నమ్మిస్తూ డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. డబ్బులు ఇచ్చినట్లుగా కొందరి వీడియోలు కూడా బయటకు వచ్చాయి. ఈ విషయంపై ‘ఆంధ్రజ్యోతి’ ఆరా తీయగా డబ్బులు అడిగింది వాస్తవమేనని, తాము కూడా ఇచ్చామని కొందరు పరిశ్రమల నిర్వాహకులు తెలిపారు. మరికొందరు బయటికి చెప్పేందుకు జంకుతున్నారు. ఇదిలా ఉండగా, ఆ స్థలంలో డబుల్‌ బెడ్రూం ఇళ్లు, 100 పడకల ఆస్పత్రిని నిర్మించాలనే యోచనలో ఉన్నట్లు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గతంలో ప్రకటించారు. మరోవైపు ఆ స్థలాలు తమకే వస్తాయని అసోసియేషన్‌ సభ్యులు చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం ఆ స్థలం ప్రభుత్వ ఆధీనంలోనే ఉందని, స్థలాలు ఇప్పిస్తామని ఎవరైనా వసూళ్లకు పాల్పడితే ఫిర్యాదు చేయాలని అధికారులు సూచిస్తున్నారు. 


లీజు గడువు ముగిసింది

2015 డిసెంబర్‌తో బాలానగర్‌ కో ఆపరేటివ్‌ ఇండస్ట్రీలో ఉన్న 47 ఎకరాల ప్రభుత్వ స్థలం లీజు గడువు ముగిసింది. ప్రస్తుతం ఆ స్థలం ప్రభుత్వ ఆధీనంలో ఉంది. దీనిపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయానికీ రాలేదు. ఆ స్థలంలో కట్టడాలు, అమ్మకాలు చేపడితే శిక్షార్హులు.

- పి.రవీందర్‌, మేడ్చల్‌ జిల్లా పరిశ్రమల జీఎం 


మాకు ఎవరూ డబ్బులు ఇవ్వలేదు

ప్రభుత్వం ఇచ్చిన 501 జీవోపై స్టేటస్‌ కో ఉంది. స్థలాల విషయం ప్రభుత్వ పరిశీలనలో ఉంది. లీజు స్థలం టెనెంట్స్‌కు ఇవ్వాలని అధికారులను, మంత్రులను కలుస్తున్నాం. స్థలాల కోసం మాకు ఎవరూ డబ్బులు ఇవ్వలేదు. 

- ప్రకాశ్‌, జనరల్‌ సెక్రెటరీ, సీఐఈ బాలానగర్‌ ఫేజ్‌-1 టెనెంట్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌


అక్రమాలు భరించలేకనే బయటకు వచ్చాను

టెనెంట్స్‌ వెల్ఫేర్‌ కోసం పని చేయాల్సిన సీఐఈ బాలానగర్‌ టెనెంట్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ అక్రమాలకు పాల్పడుతోంది. అందుకే అసోసియేషన్‌ వ్యవహారాలకు దూరంగా ఉంటున్నాను. నేను రాజీనామా చేయకుండానే 7 సార్లు నా సంతకాన్ని ఫోర్జరీ చేశారు. బాలానగర్‌ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

- శ్రీనివాస్‌.(ఎ-6) సీఐఈ బాలానగర్‌ ఫేజ్‌-1, టెనెంట్‌


అది చట్ట విరుద్ధం

పీఐసీ లేకుండానే లీజు స్థలాలు స్వాధీనం చేసుకున్నారు. ఇది చట్ట విరుద్ధం. పీఐసీ 2011లోనే రద్దయింది. అప్పటి నుంచి కొత్త కమిటీ లేదు. ఆర్టీఐ ద్వారా ఈ విషయం తెలిసింది. అంతర్గంగా ఉండాల్సిన అనధికార మెమో ఎలా బయటకు లీక్‌ అయింది. దీనికి బాధ్యులు ఎవరు? ఇలాంటి ఎన్నో అక్రమ వ్యవహారాలు నిగ్గు తేలాల్సి ఉంది. వీటిపై త్వరలో లోకాయుక్తలో ఫిర్యాదు చేస్తున్నాం.

- కేఎన్‌. కుప్పుస్వామి, ఆర్టీఐ కార్యకర్త, బాలానగర్‌


డబ్బులు ఇవ్వాలని అడిగారు

గతంలో నన్ను కూడా స్థలాల కోసం అసోసియేషన్‌ వారు డబ్బులు అడిగారు. ఇప్పటి వరకు ఇచ్చిన వారి డబ్బులు ఏమయ్యాయి. అసోసియేషన్‌ డబ్బు ఏం చేసింది. ఎంత వసూలు చేసింది, ఎంత ఖర్చు చేసింది. జీవోకు సంబంధించిన పూర్తి వివరాలు తెలిశాక డబ్బుల విషయం ఆలోచిస్తానని చెప్పాను. అప్పటి నుంచీ అసోసియేషన్‌ సభ్యులు నన్ను దూరం పెడుతున్నారు. ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదు. స్థలాల విషయమై కొద్ది రోజుల క్రితం కొంతమంది నుంచి గజానికి ఇంత అని డబ్బులు తీసుకున్నది వాస్తవం.   

- ఉమారాణి, ఉమా ఆర్‌కే అపారెల్స్‌(ఏ-9) సీఐఈ, బాలానగర్‌

Updated Date - 2021-03-01T07:12:07+05:30 IST