చీకట్లదేముంది!

ABN , First Publish Date - 2021-07-19T05:40:01+05:30 IST

తూర్పున ఒక పువ్వు పూస్తుంది కాంతి పరిమళమొకటి లోకమంతా విస్తరిస్తుంది కాంతి ధారల్లో స్నానించిన...

చీకట్లదేముంది!

తూర్పున ఒక పువ్వు పూస్తుంది

కాంతి పరిమళమొకటి

లోకమంతా విస్తరిస్తుంది


కాంతి ధారల్లో స్నానించిన

చెట్టు పిట్ట పుట్ట గుట్ట సమస్త ప్రపంచం

మనిషితోపాటే తన మురికితనాన్ని వీడి తేటపడుతుంది


ఈ నేల మీద మురికిధూపంలా 

వ్యాపిస్తున్న చీకటిని చీలుస్తూ

కిరణ ఖడ్గమొకటి పదును మొన మీద

మెరుపు సంతకం చేస్తుంది


రాత్రిపూట చుక్కలకు ఉప్పందించి

చందమామకు వెన్నెల సమాచారాన్నిచ్చి

పడమటి గదిలో సూర్యుడు

యుద్ధ వ్యూహాలు రచించటం

ఎత్తుగడగా మొదలవుతుంది

ఖండ ఖండాలుగ తెగిపడ్డ చీకటి 

రేపటి వెలుగుకు తలుపులు తీస్తూ

కాంతిపాదాలకింద నలిగి మాయమౌతుంది


పొద్దు పూయటమంటేనే

అనేక తరాల వెట్టి చీకటిని

ఖడ్గచాలనం గావించటం


పొద్దు పొడవటమంటేనే

ఒక ధిక్కారం కిరణ ఖడ్గమై

ఆధిపత్యపు చీకటి సామ్రాజ్యాన్ని

ముక్కలుగా నరికి పోగులు పెట్టటం


ఇవాళ విస్తరిస్తున్న చీకట్లదేముంది

పొడుస్తున్న పొద్దులం కావాల్సింది మనం!

చిత్తలూరి

82474 32521


Updated Date - 2021-07-19T05:40:01+05:30 IST