చిమిడిపోయిన నెనరెసరు

ABN , First Publish Date - 2021-12-06T05:42:08+05:30 IST

జిగురుబతుకు ఊడల ఊగని అడుగు ఎదగోడ చెరగని ఆమె నూనెనీడ ముడిలేని కోక తాటికొసకుచ్చు అంటిన తావి...

చిమిడిపోయిన నెనరెసరు

జిగురుబతుకు ఊడల ఊగని అడుగు

ఎదగోడ చెరగని ఆమె నూనెనీడ

ముడిలేని కోక తాటికొసకుచ్చు అంటిన తావి

కట్టతప్పిన దారి నిట్టనిలిచిన వేలుపు

ఊరుపు సైగల కొనల కొలిచే అచూపు


నీరెండతలపులు సోకి జోగని నూగు

జలగడ్డి తాకిడి చీరిన పొరతెరల చెమ్మ

అంటుకున్న దిగులు ఊటమాట

తెగనితోవ పేనని గొంతులో చేపముల్లు

సొంపుసడి గుసగుసల తవ్వుగల్లు దిక్కులచూపు

తడికొలకు జల్లెడ చివికిన మట్టు


దరి కలపని గాలితీవెల వంతెనవేళ్ళు

ఆపద పొదల పొంచిన జబ్బలచేతులు


నిమిరే ఊసుతెడ్డు లేని చిక్కటి రాగిజావపగలు

ముంపొగ దాచిన పలచటి చీకటిముక్కల రాతిరి

ఆమెముసురు తేలిపోయిన మబ్బెనక వచ్చి

చిమిడిపోయిన నెనరెసరు వార్చే పొద్దుబుట్ట

కె. రామచంద్రారెడ్డి

Updated Date - 2021-12-06T05:42:08+05:30 IST