‘తెర’చుకోనున్నాయ్‌!

ABN , First Publish Date - 2020-12-04T05:06:50+05:30 IST

సినీ ప్రేక్షకులకు శుభవార్త. జిల్లాలో సినిమా సందడి మళ్లీ ప్రారంభమవుతోంది.

‘తెర’చుకోనున్నాయ్‌!

నేటి నుంచి సినీ సందడి

జిల్లాలో రెండు థియేటర్లు పునః ప్రారంభం
కరోనా నిబంధనల నడుమ నిర్వహణకు ఏర్పాట్లు
(శ్రీకాకుళం, ఆంధ్రజ్యోతి/నరసన్నపేట)

సినీ ప్రేక్షకులకు శుభవార్త. జిల్లాలో సినిమా సందడి మళ్లీ ప్రారంభమవుతోంది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో మార్చిలో థియేటర్లన్నీ మూతపడ్డాయి. ఎనిమిది నెలల సుదీర్ఘ విరామం అనంతరం జిల్లాలో రెండు సినిమా థియేటర్లు తెరచుకోనున్నాయి. శుక్రవారం శ్రీకాకుళంలోని సూర్యమహల్‌, నరసన్నపేటలోని శ్రీ వెంకటేశ్వర మహల్‌ స్ర్కీన్‌-2లో సినిమాలు ప్రదర్శించేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. థియేటర్‌ లోపల, బయట శానిటైజేషన్‌ చేపట్టారు. కొవిడ్‌ నిబంధనల నడుమ 50 శాతం మేర టిక్కెట్లు విక్రయించనున్నారు. ప్రేక్షకులు కరోనా నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని కోరారు. ప్రేక్షకులకు థర్మల్‌ స్ర్కీనింగ్‌ చేసి.. థియేటర్లలోకి అనుమతించనున్నారు.  ప్రేక్షకుల ఆదరణను బట్టి మిగతా థియేటర్లను పునః ప్రారంభించనున్నట్టు యాజమన్య సంఘ సభ్యులు చెప్పారు. వాస్తవానికి లాక్‌డౌన్‌  సడలింపుల్లో భాగంగా అక్టోబరు నుంచే సినీ వినోదానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. కరోనా నిబంధనలు పాటిస్తూ.. థియేటర్లు తెరచుకోవచ్చని ఆదేశించింది. 50 శాతం మేర టిక్కెట్లను విక్రయించి.. ప్రేక్షకులను థియేటర్లలోకి అనుమతించాలని స్పష్టం చేసింది. ఈ నిబంధనలు థియేటర్ల యాజమాన్యాలకు మింగుడు పడలేదు. మరోవైపు జిల్లాలో కరోనా వ్యాప్తి కొనసాగుతున్న నేపథ్యంలో థియేటర్లు తెరిచేందుకు ఆసక్తి చూపడం లేదు. సిబ్బంది జీతాలు, విద్యుత్‌ బిల్లులు, లక్షలాది రూపాయల పెట్టుబడుల నేపథ్యంలో మరికొన్నాళ్లు ఽథియేటర్లు మూసివేసి ఉంచడమే మేలని భావించారు. కానీ ఎట్టకేలకు నరసన్నపేటలో థియేటర్‌ శుక్రవారం తెరవనుండడంతో జిల్లాలో సినీ సందడి ప్రారంభం కానుందని ప్రేక్షకులు ఆశిస్తున్నారు. మరోవైపు కరోనా మహమ్మారి ప్రభావంతో థియేటర్లలో పనిచేసే సిబ్బంది రోడ్డున పడ్డారు. గేట్‌మెన్లు, బుకింగ్‌ క్లర్కులు, ఆపరేటర్లు, సెక్యూరిటీగార్డులతో పాటు పార్కింగ్‌, షాపుల నిర్వాహకులు ఉపాధి కోల్పోయారు. ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో థియేటర్లన్నీ తెరిస్తే తమకు ఉపాధి దొరుకుతుందని వారంతా ఆశగా ఎదురుచూస్తున్నారు.

Updated Date - 2020-12-04T05:06:50+05:30 IST