తెరపై కత్తి

ABN , First Publish Date - 2022-06-27T06:43:31+05:30 IST

సినిమా థియేటర్‌ యాజమాన్యాలకు, ప్రభుత్వానికి మధ్య టిక్కెట్ల అమ్మకాల మధ్య వివాదం ముదిరి పాకాన పడింది. ఆన్‌లైన్‌ విక్రయాలపై ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన జీవోను ఎగ్జిబిటర్లు వ్యతిరేకిస్తున్నారు.

తెరపై కత్తి

ప్రభుత్వం వర్సెస్‌ థియేటర్ల యాజమాన్యాలు 

ఆన్‌లైన్‌ టిక్కెట్లపై ఒప్పందం కుదుర్చుకోవాలని ఒత్తిళ్లు 

ఈ విధానంతో నష్టపోతామంటున్న యాజమాన్యాలు 

సినిమా థియేటర్ల మూసివేతకు నిర్ణయం?

నేడు ప్రకటించే అవకాశం?

భానుగుడి(కాకినాడ), జూన్‌ 26: సినిమా థియేటర్‌ యాజమాన్యాలకు, ప్రభుత్వానికి మధ్య టిక్కెట్ల అమ్మకాల మధ్య వివాదం ముదిరి పాకాన పడింది. ఆన్‌లైన్‌ విక్రయాలపై ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన జీవోను ఎగ్జిబిటర్లు వ్యతిరేకిస్తున్నారు. ‘మా డబ్బులు మా దగ్గరే ఉండాలి  కానీ మీ దగ్గర ఉండడం ఏంటి? మా కష్టాన్ని మీరు దోచుకుంటే కుదురదని, మీరు డబ్బులు ఇవ్వకపోతే ఎవరినీ అడగాలి’ అని థియేటర్‌ యాజమాన్యాలు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నాయి. అయితే ఆన్‌లైన్‌ టిక్కెట్లకు సంబంధించి ఉన్నపళంగా ప్రభుత్వం ఎంవోయూపై సంతకాలు చేయాలని ఎగ్జిబిటర్లపై ఒత్తిడి తెస్తోంది. ఇప్పుటి వరకు ప్రైవేట్‌ సంస్థలు ఆన్‌లైన్‌ టిక్కెట్లు అమ్మకాలు జరిగిన మరుసటి రోజు మధ్యాహ్నానికే థియేటర్‌ యాజమాన్యాల అకౌంట్‌లో జమ చేస్తున్నాయి. ఉన్న పళంగా ప్రైవేట్‌ సంస్థలతో ఒప్పందాలు రద్దు చేసుకుంటే ఇబ్బందులు తప్పవేమోనని థియేటర్‌ యాజమాన్యాలు మదన పడుతున్నాయి. ఎంవోయూ సంతకాలు చేయకపోతే థియేటర్‌ లైసెన్స్‌ రద్దు చేస్తామని రెవెన్యూ అధికారుల ద్వారా ఇప్పటికే ఒత్తిళ్లు తీసుకొస్తున్నారు. గత రెండేళ్లలో థియేటర్ల పరిస్థితి దారుణంగా పడిపోయిందని, ఒకపక్క కరోనా కారణంగా రెండేళ్లపాటు థియేటర్లు తెరవకుండా మూసుకుని నిర్వహణ ఖర్చుకు కోట్లాది రూపాయలు పెట్టామని, ప్రతిరోజూ థియేటర్‌ నిర్వహణకు రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకు అవుతుందని, ఇప్పటికిప్పుడు ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో థియేటర్ల మనుగడ ప్రశ్నార్థకంగా మారిందని తమ గోడును వెల్లబోసుకుంటున్నారు. వన్‌సైడ్‌ డాక్యుమెంట్‌ తీసుకువచ్చి 24 గంటల్లో సంతకాలు చేసి థియేటర్లను లీజుకు ఇవ్వాలని చెబుతున్నారని, అది ఎన్ని సంవత్సరాలో తెలియకుండా లీజుకు ఎలా ఇస్తామని, తమ కష్టాన్ని మీరు దోచుకుంటారా అని థియేటర్‌ యాజమాన్యాలు గగ్గోలు పెడుతున్నాయి. మంగళవారం నుంచి ఉమ్మడి జిల్లాలో సినిమా థియేటర్లు మూసివేసేందుకు యాజమాన్యాలు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. ఏదైనా సోమవారం జరిగే చర్చలు కొలిక్కివస్తే సరేసరి లేకుంటే ఒక్కసారి థియేటర్లు మూస్తే ఎప్పుడు తెరుస్తారో కూడా తెలియని పరిస్థితి తలెత్తనుంది. కాకినాడ జిల్లాలో 45 థియేటర్లుపైనే, తూర్పుగోదావరి జిల్లాలో 33 థియేటర్లు, కోనసీమ జిల్లాలో 56 థియేటర్లు ఉన్నాయి. ప్రభుత్వం వీటిని శాశ్వత లీజు పేరుతో 12 నిబంధనలు అనుసరించి వన్‌సైడ్‌ డాక్యుమెంట్‌ రూపొందించి సంతకాలు చేయించాలని అధికారులతో ఒత్తిడి తీసుకొస్తోంది. థియేటర్‌ యాజమాన్యాల సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం ముందుకు రావడం లేదు. ఇప్పటివరకు ఆన్‌లైన్‌ టిక్కెట్‌ పేరుతో పలు ప్రభుత్వ, ప్రైవేట్‌ కంపెనీలు థియేటర్లపై ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఒప్పందాలు కుదుర్చుకునే ముందు ఇంత సొమ్మును ముందుగానే ఽథియేటర్ల వద్ద ప్రైవేట్‌ కంపెనీలు జమ చేశాయి. ఇప్పటికిప్పుడు వీటిని రద్దు చేస్తే వెనక్కితిరిగి ఇచ్చేయడానికి తమ దగ్గర సొమ్ములు ఉండాలి కదా అని ప్రశ్నిస్తున్నారు. ఒకవేళ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంటే ఒప్పందం ప్రకారం డబ్బులు ఎన్నిరోజుల్లో థియేటర్‌ యాజమాన్యాలకు ప్రభుత్వం చెల్లిస్తోందో తెలియదు.. ఒకవేళ చెల్లించకపోతే ఎవరిని అడగాలి అనే దానిపై ప్రభుత్వం నుంచి స్పందన లేదు. ఒకవేళ ప్రభుత్వం బ్యాంకులకు అప్పులు ఉంటే థియేటర్ల నుంచి బ్యాంకులకు జమ అయిన సొమ్ము బ్యాంకు వారే తీసేసుకుంటే తమ పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఆన్‌లైన్‌లో టిక్కెట్‌ బుక్‌ చేసుకుంటే 1.9 శాతం పన్ను రూపంలో ప్రభుత్వానికి వెళుతోంది. అయితే ఇప్పటివరకు థియేటర్లలో అమ్మే టిక్కెట్లకు ట్యాక్స్‌ రూపంలో తీసుకోలేదని, థియేటర్ల నుంచి కూడా టిక్కెట్‌కు 1.9 శాతం తీసుకుంటే తాము నష్ట పోతామని థియేటర్ల యాజమాన్యాలు చెబు తున్నాయి. వన్‌సైడ్‌ డాక్యుమెంట్‌ పేరుతో అధికారుల నుంచి వేధింపులు ఎక్కువయ్యాయని, ఇలా అయితే థియేటర్లను రన్‌ చేయడం కష్టతరమని థియేటర్‌ యాజమాన్యాలు అంటున్నాయి. 

Updated Date - 2022-06-27T06:43:31+05:30 IST