సినిమా.. చిత్తుచిత్తు!

ABN , First Publish Date - 2021-05-07T06:54:53+05:30 IST

సంవత్సరం కాలం తరువాత ఽథియేటర్లు తెరిచిన ఆనందం కొద్దిరోజులు కూడా మిగల్లేదు. రెండో దశ కరోనాతో థియేటర్లు మళ్లీ మూతపడిన విషయం తెలిసిందే.

సినిమా.. చిత్తుచిత్తు!

ఆగిన సినిమాలు

మూతపడిన థియేటర్లు 

యాజమాన్యాలకు కోలుకోలేని దెబ్బ

ఉపాధికీ భారీ గండి               

భానుగుడి(కాకినాడ), మే 6 : సంవత్సరం కాలం తరువాత ఽథియేటర్లు తెరిచిన ఆనందం కొద్దిరోజులు కూడా మిగల్లేదు. రెండో దశ కరోనాతో థియేటర్లు మళ్లీ మూతపడిన విషయం తెలిసిందే. ఏడాదిపాటు థియేటర్లు ఎప్పుడు తెరుద్దామా అని ఎదురుచూసిన వాటి యాజమాన్యాలకు, ఇటు ప్రేక్షకులకు చివరకు నిరాశే మిగిలింది. ఏదొక విధంగా కొవిడ్‌ నిబంధనలను పాటిస్తూ నడుపుదామనుకున్నా, మరోవైపు టిక్కెట్ల ధరలు థియేటర్లను మూతపడే దిశగా తీసుకెళ్లాయి. దీనికితోడు కొత్త సినిమాల విడుదల కూడా నిలిచిపోయాయి. ఈ మొత్తం వ్యవహారంతో చివరకు థియేటర్లు బలయ్యాయి. వీటిపై ఆధాపడిన చిరుద్యోగులంతా మళ్లీ రోడ్డున పడ్డారు. జిల్లావ్యాప్తంగా ఉన్న 140 థియేటర్లు మూతపడ్డాయి. నిజానికి వేసవి వస్తే సినిమాల హడావుడే ఎక్కువ ఉండేది. స్కూళ్లకు సెలవులు రావడం, అందరికీ కాస్త విరామం దొరికే సమయం కావడంతో అందరూ సినిమా దారి పట్టేవారు. దీనికి తగ్గుట్టుగానే ఎక్కువ సినిమాల విడుదల కూడా ఇదే సమయంలో ఉండేది. 2020లో వచ్చిన నష్టాన్ని తట్టుకుని నిలబడి మళ్లీ ఽథియేటర్లను తెరిచినా అనుకోని పరిస్థితుల్లో మూసివేయాల్సి రావడం, ఇప్పుడు కర్ఫ్యూ పేరిట వచ్చిన నిబంధనల నేపథ్యంలో ఇక థియేటర్లు తెరుచుకునే అవకాశం ఇప్పట్లో లేనట్టేనని అంచనా వేస్తున్నారు. ఈ స్థితిలో యాజమాన్యాలు వచ్చే నష్టాలను ఎలా భరించాలో అర్థంకాక తలలు పట్టుకుంటున్నారు. కోట్లాది రూపాయల నష్టాల నుంచి ఎలా తప్పించుకోవాలో తెలియడం లేదని ఆయా థియేటర్ల యాజమాన్యాలు వాపోతున్నాయి.



Updated Date - 2021-05-07T06:54:53+05:30 IST