పరువు దక్కింది!

ABN , First Publish Date - 2020-12-03T09:38:33+05:30 IST

ఆస్ట్రేలియా పర్యటనలో కోహ్లీసేన తొలి విజయం అందుకుంది. మొదటి రెండు వన్డేలలో పోరాడకుండానే ఓడిన తీరుతో విమర్శలు ఎదుర్కొన్న భారత్‌.. చివరి మ్యాచ్‌లో భిన్నమైన ప్రదర్శనతో ఆకట్టుకుంది. దాంతో బుధవారం కంగారూలతో జరిగిన మూడో వన్డేలో 13 పరుగులతో గెలిచి సిరీస్‌ ..

పరువు దక్కింది!

చివరి వన్డేలో భారత్‌ గెలుపు

హార్దిక్‌, జడేజా మెరుపులు కోహ్లీ హాఫ్‌ సెంచరీ


మొత్తంగా టీమిండియా ఆటతీరు గాడిన పడింది. క్లీన్‌స్వీ్‌పను తప్పించుకోవాల్సిన మ్యాచ్‌లో చెలరేగింది. బ్యాటింగ్‌, బౌలింగ్‌ విభాగాల్లో సత్తాచాటి ఆస్ట్రేలియాకు షాకిచ్చింది. కోహ్లీ హాఫ్‌ సెంచరీతో పాటు హార్దిక్‌ పాండ్యా, జడేజా జోడీ చెలరేగడంతో భారత్‌ భారీ స్కోరు చేసింది. అనంతరం బౌలర్లు కూడా లయ అందుకోవడమేకాదు కీలక తరుణాల్లో వికెట్లు పడగొట్టి ప్రత్యర్థికి బ్రేకులు వేశారు.దాంతో ఆఖరి వన్డేలో గెలుపొందిన ఉత్సాహంతో టీ20 సిరీ్‌సకు భారత్‌ సిద్ధమైంది.


కాన్‌బెర్రా: ఆస్ట్రేలియా పర్యటనలో కోహ్లీసేన తొలి విజయం అందుకుంది. మొదటి రెండు వన్డేలలో పోరాడకుండానే ఓడిన తీరుతో విమర్శలు ఎదుర్కొన్న భారత్‌.. చివరి మ్యాచ్‌లో భిన్నమైన ప్రదర్శనతో ఆకట్టుకుంది. దాంతో బుధవారం కంగారూలతో జరిగిన మూడో వన్డేలో 13 పరుగులతో గెలిచి సిరీస్‌ అంతరాన్ని 1-2కు తగ్గించింది. మొదట బ్యాటింగ్‌ చేసిన భారత్‌ 50 ఓవర్లలో 5 వికెట్లకు 302 పరుగులు చేసింది. హార్దిక్‌ పాండ్యా (76 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్‌తో 92 నాటౌట్‌), రవీంద్ర జడేజా (50 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లతో 66 నాటౌట్‌) మెరుపు బ్యాటింగ్‌తో ప్రత్యర్థికి చుక్కలు చూపారు. కెప్టెన్‌ కోహ్లీ (78 బంతుల్లో 5 ఫోర్లతో 63) హాఫ్‌ సెంచరీ చేశాడు. లెఫ్టామ్‌ స్పిన్నర్‌ ఆస్టన్‌ అగర్‌ రెండు వికెట్లు తీశాడు. ఛేదనలో ఆస్ట్రేలియా 49.3 ఓవర్లలో 289 పరుగులకు ఆలౌటైంది. ఫించ్‌ (82 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లతో 75) మరోసారి కెప్టెన్‌ ఇన్నింగ్స్‌ ఆడాడు. మ్యాక్స్‌వెల్‌ (38 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లతో 59) ధనాధన్‌ బ్యాటింగ్‌ చేయగా, క్యారీ (38) రాణించాడు. శార్దూల్‌ ఠాకూర్‌ మూడు వికెట్లు పడగొట్టాడు. బుమ్రా, అరంగేట్రం ఎడమ చేతి పేసర్‌ నటరాజన్‌ రెండేసి వికెట్లు తీశారు. పాండ్యా ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా’, స్మిత్‌ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీ్‌స’గా నిలిచారు. ఇరుజట్ల మధ్య మొదటి టీ20 శుక్రవారం ఇక్కడే జరగనుంది. తొలి రెండు వన్డేల్లో ఘోర పరాజయంపాలైన టీమిండియా ఈ మ్యాచ్‌లో ఏకంగా నాలుగు మార్పులతో బరిలోకి దిగింది. మయాంక్‌ అగర్వాల్‌, నవ్‌దీప్‌ సైనీ, షమీ, చాహల్‌ స్థానాల్లో శుభ్‌మన్‌ గిల్‌, నటరాజన్‌, శార్దూల్‌ ఠాకూర్‌, కుల్‌దీప్‌ యాదవ్‌ జట్టులోకొచ్చారు.


లక్ష్యం.. కష్టసాధ్యం కాకపోయినా..

గత రెండు మ్యాచుల్లో ఆసీస్‌ ఓపెనర్లు అందించిన సెంచరీ భాగస్వామ్యాలు చూస్తే 303 పరుగుల లక్ష్యం వారికి పెద్ద కష్టం కాకపోవచ్చనిపించింది. కానీ భారత్‌ బౌలర్ల ధాటికి అది అందకుండా పోయింది. ఫించ్‌తో కలిసి అనూహ్యంగా ఇన్నింగ్స్‌ ప్రారంభించిన లబుషేన్‌ (7)ను నటరాజన్‌ ఆదిలోనే క్లీన్‌బౌల్డ్‌ చేసి వన్డేలలో తొలి వికెట్‌ సాధించాడు. రెండు మ్యాచ్‌ల్లో రెండు సెంచరీలతో ఊపుమీదున్న స్టీవ్‌ స్మిత్‌ (7)ను శార్దూల్‌ పెవిలియన్‌కు చేర్చడంతో ఆసీస్‌ కష్టాల్లో పడ్డట్టే కనిపించింది. కానీ ఫించ్‌-హెన్రిక్స్‌ (22) మూడో వికెట్‌కు 61రన్స్‌ చేసి ఆదుకున్నారు. హెన్రిక్స్‌ను పెవిలియన్‌ చేర్చిన శార్దూల్‌ ప్రత్యర్థిని మరోసారి దెబ్బకొట్టగా..ఫించ్‌ను అవుట్‌ చేసిన జడేజా ఆసీ్‌సకు షాకిచ్చాడు. అరంగేట్ర ఆటగాడు కామెరూన్‌ గ్రీన్‌ (21), జడేజా అద్భుత క్యాచ్‌కు నిష్క్రమించాడు. అయితే క్యారీ-మ్యాక్స్‌వెల్‌ భారత బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ జట్టును విజయం దిశగా నడిపించే ప్రయత్నం చేశారు. ఈ జోడీ ప్రమాదకరంగా మారుతున్న తరుణంలో లేని పరుగుకోసం వెళ్లి క్యారీ రనౌటవడంతో భారత్‌ ఊపిరి పీల్చుకుంది. భారీషాట్లతో చెలరేగుతున్న మ్యాక్స్‌వెల్‌ను కళ్లు చెదిరే యార్కర్‌తో బౌల్డ్‌ చేసిన బుమ్రా భారత్‌కు కీలక బ్రేక్‌ ఇచ్చాడు. తర్వాత అగర్‌ (28) కొద్దిసేపు ఆస్ట్రేలియా ఓటమి నిలువరించాడు.


హార్దిక్‌, జడేజా షో: సిరీ్‌సలో తొలిసారి టాస్‌ గెలిచిన కోహ్లీ ఫ్లాట్‌ వికెట్‌పై బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు. ఆరంభంలోనే సీనియర్‌ ధవన్‌ (16)ను అబాట్‌ బోల్తా కొట్టించాడు. మరో ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌ చూడముచ్చటైన షాట్లతో అలరించగా..కోహ్లీ నిదానంగా ఆడాడు. గిల్‌ (33), శ్రేయాస్‌ అయ్యర్‌ (19), కేఎల్‌ రాహుల్‌ (5).. 41 పరుగుల తేడాతో అవుటవగా.. కోహ్లీ సిరీ్‌సలో మూడోసారి పేసర్‌ హాజెల్‌వుడ్‌ బౌలింగ్‌లో నిష్క్రమించాడు. అప్పటికి భారత్‌ స్కోరు 32 ఓవర్లలో 152/5. 250 పరుగులు చేస్తే గగనమే అని భావించారు. కానీ జట్టు స్కోరు మూడొందలు దాటిందంటే అందుకు కారణం హార్దిక్‌-జడేజా. కుదురుకునేందుకు కొంత సమయం తీసుకున్న వీరు..ఆపై పేసర్లు, స్పిన్నర్లు అనే భేదం లేకుండా విరుచుకుపడ్డారు. ఆరోవికెట్‌కు అజేయంగా రికార్డు స్థాయిలో 150 రన్స్‌ జత చేశారు. చివరి ఐదు ఓవర్లలో ఇద్దరూ కలిసి 76 పరుగులు రాబట్టడం విశేషం. 46, 47, 48 ఓవర్లలోనే 53 రన్స్‌ వచ్చాయంటే వారు ఏస్థాయిలో విజృంభించారో అర్థమవుతుంది. 


వారెవ్వా.. పాండ్యా-జడేజా

ఈ మ్యాచ్‌లో 108 బంతుల్లోనే 150 పరుగులు జోడించిన హార్దిక్‌ పాండ్యా-రవీంద్ర జడేజా.. ఆసీ్‌సపై ఆరో వికెట్‌కు అత్యధిక పరుగుల భాగస్వామ్యం నమోదు చేసిన భారత జోడీగా రికార్డు సృష్టించింది. అంతకుముందు 1999లో రాబిన్‌ సింగ్‌-శఠగోపన్‌ రమేష్‌ కలిసి ఆసీ్‌సపై ఆరో వికెట్‌కు 123 రన్స్‌ చేశారు. 


స్కోరుబోర్డు

భారత్‌: ధవన్‌ (సి) అగర్‌ (బి) అబాట్‌ 16, గిల్‌ (ఎల్బీ) అగర్‌ 33, కోహ్లీ (సి) క్యారీ (బి) హాజెల్‌వుడ్‌ 63, అయ్యర్‌ (సి) లబుషేన్‌ (బి) జంపా 19, కేఎల్‌ రాహుల్‌ (ఎల్బీ) అగర్‌ 5, హార్డిక్‌ (నాటౌట్‌) 92, జడేజా (నాటౌట్‌) 66, ఎక్స్‌ట్రాలు: 8, మొత్తం:  50 ఓవర్లలో 302/5. వికెట్లపతనం: 1/26, 2/82, 3/114, 4/123, 5/152, బౌలింగ్‌: హాజెల్‌వుడ్‌ 10-1- 66-1, మ్యాక్స్‌వెల్‌ 5-0-27-0, అబాట్‌ 10-0-84-1, కామెరూన్‌ గ్రీన్‌ 4-0-27-0, అగర్‌ 10-0-44-2, జంపా 10-0-45-1, హెన్రిక్స్‌ 1-0-7-0.

ఆస్ట్రేలియా: లబుషేన్‌ (బి) నటరాజన్‌ 7, ఫించ్‌ (సి) ధవన్‌ (బి) జడేజా 75, స్మిత్‌ (సి) రాహుల్‌ (బి) శార్దూల్‌ 7, హెన్రిక్స్‌ (సి) ధవన్‌ (బి) శార్దూల్‌ 22, గ్రీన్‌ (సి) జడేజా (బి) కుల్దీప్‌ 21, క్యారీ (రనౌట్‌) 38, మ్యాక్స్‌వెల్‌ (బి) బుమ్రా 59, అగర్‌ (సి) కుల్దీప్‌ (బి) నటరాజన్‌ 28, అబాట్‌ (సి) రాహుల్‌ (బి) శార్దూల్‌ 4, జంపా (ఎల్బీ) బుమ్రా 4, హాజెల్‌వుడ్‌ (నాటౌట్‌) 7, ఎక్స్‌ట్రాలు: 17, మొత్తం: 49.3 ఓవర్లలో 289, వికెట్లపతనం: 1/25, 2/56, 3/117, 4/123, 5/158, 6/210, 7/268, 8/278, 9/278, 10/289, బౌలింగ్‌: బుమ్రా 9.3-0-43-2, నటరాజన్‌ 10-1-70-2, శార్దూల్‌ ఠాకూర్‌ 10-1-51-3, కుల్దీప్‌ యాదవ్‌ 10-0-57-1, జడేజా 10-0-62-1.

Updated Date - 2020-12-03T09:38:33+05:30 IST