సిటీ శాఖలో.. సందిగ్ధత

ABN , First Publish Date - 2022-06-23T04:37:26+05:30 IST

ప్రభుత్వ శాఖల్లో బదిలీల హడావుడి కనిపిస్తోంది. అనుకూలమైన ప్రాంతాలకు బదిలీ చేయించుకునేందుకు ఉద్యోగులు ఎవరి స్థాయిలో వారు ప్రయత్నాలు చేసుకుంటున్నారు.

సిటీ శాఖలో.. సందిగ్ధత
వాణిజ్యపన్నులశాఖ కార్యాలయం

బదిలీలపై ఉద్యోగుల్లో ఉత్కంఠ

గడువు సమీపిస్తున్నా కౌన్సెలింగ్‌పై మౌనం

సర్కిల్స్‌ పునర్విభజనతోనే బదిలీ ప్రక్రియలో జాప్యం

 

గుంటూరు, జూన్‌ 22: ప్రభుత్వ శాఖల్లో బదిలీల హడావుడి కనిపిస్తోంది. అనుకూలమైన ప్రాంతాలకు బదిలీ చేయించుకునేందుకు ఉద్యోగులు ఎవరి స్థాయిలో వారు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. అయితే వాణిజ్యపన్నులశాఖ(సీటీ)లో మాత్రం అసలు బదిలీల అంశమే తేలలేదు. ఈ శాఖలో ఉద్యోగుల బదిలీల ప్రక్రియపై ఇంకా సందిగ్ధత వీడలేదు. ఉద్యోగుల సాధారణ బదిలీలకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. తొలుత బదిలీలకు ఆఖరి గడువు ఈ నెల 17వ తేదీగా ప్రకటించింది. దీనిపై వివిధ శాఖల నుంచి వచ్చిన అభ్యంతరాల నేపథ్యంలో 30వ తేదీ వరకు పొడిగించింది. ఆ గడువు కూడా సమీపిస్తున్నా సీటీ శాఖలో మాత్రం బదిలీల అంశం తేలడంలేదు.   కౌన్సెలింగ్‌ తేదీలను ప్రకటించకపోవడంతో ఉద్యోగుల్లో ఉత్కంఠ నెలకొంది. ఆ శాఖలో అధికారుల నుంచి ఉద్యోగుల వరకు బదిలీల వ్యవహారంపై కొన్ని రోజులుగా చర్చలు సాగుతున్నాయి. జిల్లాల పునర్విభజన, సర్కిల్స్‌ రీ -స్ట్రక్చరింగ్‌ వంటి కారణాలే బదిలీల జాప్యానికి కారణంగా అధికారవర్గాలు చెబుతున్నాయి. ఐదేళ్ల పైబడి ఒకే చోట పనిచేయడం, సొంత ప్రాంతంలో విధుల నిర్వహణ వంటి పలు అంశాల ఆధారంగా పలు కీలక శాఖల్లో ఇప్పటికే బదిలీల ప్రక్రియ మొదలైంది. అయితే  ఈ బదిలీల హడావుడి వాణిజ్యపన్నుల శాఖలో కనిపించటం లేదు. రాష్ట్ర ప్రభుత్వ ఆదాయంలో కీలకమైన వాణిజ్యపన్నుల శాఖలో బదిలీలపై ఉన్నతాధికారులు ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు ఆశాఖ అధికారులు తెలిపారు. ఈ క్రమంలోనే బదిలీల ప్రక్రియలో జాప్యం జరుగుతుందని ఒక అధికారి పేర్కొన్నారు.


విభజన కసరత్తుతోనే జాప్యం..

ఓ వైపు జిల్లాల పునర్విభజన, సర్కిల్స్‌ రీ స్ట్రక్చరింగ్‌ చేస్తూనే మరో వైపు ప్రాంతీయ కార్యాలయాల ఏర్పాటుపై ఉన్నతాధికారులపై కసరత్తు చేస్తున్నట్లు చెబుతున్నారు. జీఎస్‌టీ కౌన్సిల్‌ ఏర్పాటు తదనంతరం రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చే పరిహారం జూన్‌ ఆఖరుతో ముగియనున్నది. రీజనల్‌ కార్యాలయాల ఏర్పాటుపై విధి విధానాలు రూపొందించేందుకు ఉన్నతాధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇది కూడా బదిలీల్లో జాప్యానికి కారణంగా చెబుతున్నారు.


సత్తెనపల్లి సర్కిల్‌ రద్దుపై మంత్రి అభ్యంతరం?

వాణిజ్యపన్నులశాఖ సత్తెనపల్లి సర్కిల్‌ను రద్దు చేయడంపై మంత్రి అంబటి రాంబాబు అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలిసింది. సత్తెనపల్లిని రెవెన్యూ డివిజన్‌ కేంద్రంగా చేస్తే సీటీ శాఖ సర్కిల్‌ కార్యాలయాన్ని రద్దు చేయడం ఏమిటని ఆయన ప్రశ్నించినట్లు సమాచారం. త్వరలోనే ఆర్థికశాఖ మంత్రి బుగ్గనను కలిసి ఈ అంశంపై వివరించనున్నట్లు తెలిసింది. ఉమ్మడి గుంటూరు జిల్లాలోని గుంటూరు, నరసరావుపేట డివిజన్లలో సీటీ శాఖ సర్కిల్స్‌ రీ స్ట్రక్చర్‌పై కూడా రెండు డివిజన్ల అధికారులు అభిప్రాయాలను తెలియజేసినట్లు సమాచారం. గతంలో ఉన్నట్లుగానే డివిజన్‌ పరిధిలోని సర్కిల్స్‌ ఉంచాలని, కొత్తగా మార్పులు, చేర్పులతో ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందని ఉన్నతాధికారులకు తెలియజేసినట్లు ఆ శాఖవర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో సర్కిల్స్‌ రీ స్ట్రక్చర్‌ ప్రక్రియ కొలిక్కి వచ్చాకే బదిలీలకు అనుమతి రానున్నదని అధికారులు చెబుతున్నారు. 

Updated Date - 2022-06-23T04:37:26+05:30 IST