‘భాగ్య’వంతుల నగరం!

Published: Wed, 02 Mar 2022 00:23:09 ISTfb-iconwhatsapp-icontwitter-icon
భాగ్యవంతుల నగరం!

  • కుబేరుల అడ్డాగా హైదరాబాద్‌!! 
  •  అలా్ట్ర హై నెట్‌వర్త్‌ వ్యక్తులు అధికంగా ఉన్న నగరాల్లో 2వ స్థానం 
  •  గత ఏడాది 12.3ు  పెరుగుదలతో 467కు  చేరిన నగర శ్రీమంతులు
  •  2026 నాటికి 728కి చేరే అవకాశం  జూ వెల్లడించిన నైట్‌ఫ్రాంక్‌ నివేదిక


హైదరాబాద్‌ :  హైదరాబాద్‌ కుబేరుల అడ్డాగా మారుతోంది. కనీసం 3 కోట్ల డాలర్ల (దాదాపు రూ.226 కోట్లు) సంపద కలిగిన అలా్ట్ర హైనెట్‌వర్త్‌ ఇండివిడ్యువల్స్‌ (యూహెచ్‌ఎన్‌డబ్ల్యూఐ) అధికంగా ఉన్న భారత నగరాల్లో హైదరాబాద్‌ రెండో స్థానంలో నిలిచింది. గత ఏడాది నగరంలో వీరి సంఖ్య 467కు చేరుకుంది. అంతక్రితం సంవత్సరం చివరి నాటికి ఉన్న 416 మందితో పోలిస్తే, 12.3 శాతం పెరిగారని నైట్‌ఫ్రాంక్‌ తాజా నివేదిక వెల్లడించింది. 1,596 మంది ‘యూహెచ్‌ఎన్‌డబ్ల్యూఐ’లతో ముంబై నగరం ప్రథమ స్థానంలో ఉంది. 2026 నాటికి భాగ్యనగర కుబేరులు మరో 56 శాతం పెరిగి 728కి చేరుకోవచ్చని రిపోర్టు అంచనా వేసింది. 2016 నాటికి హైదరాబాద్‌లో 314 మంది యూహెచ్‌ఎన్‌డబ్ల్యూఐలు ఉండగా.. గత ఐదేళ్లలో వీరి సంఖ్య 48.7 శాతం పెరిగింది. 

 

2021లో 11 శాతం  పెరిగిన సంపన్నులు 

గత ఏడాది భారత్‌లో అలా్ట్ర హైనెట్‌వర్త్‌ ఇండివిడ్యువల్స్‌ 11 శాతం పెరిగి 13,637కు చేరుకున్నారని నైట్‌ఫ్రాంక్‌ వెల్లడించింది. స్టాక్‌ మార్కెట్ల జోరు, డిజిటల్‌ విప్లవం ఇందుకు ప్రధానంగా దోహదపడ్డాయని నైట్‌ఫ్రాంక్‌ ఇండియా చైర్మన్‌, ఎండీ శిశిర్‌ బైజాల్‌ అన్నారు. 2026 నాటికి భారత అలా్ట్ర హై నెట్‌వర్త్‌ వ్యక్తులు 39 శాతం పెరిగి 19,006కు చేరుకోవచ్చని  అంచనా. 2016లో 7,401 మంది ‘యూహెచ్‌ఎన్‌డబ్ల్యూఐ’లు ఉండగా.. గత ఐదేళ్లలో సంఖ్య 84 శాతం పెరిగింది. 
నైట్‌ఫ్రాంక్‌ ‘వెల్త్‌ రిపోర్ట్‌ 2022’లోని ముఖ్యాంశాలు..

 గత సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా అలా్ట్ర హైనెట్‌వర్త్‌ ఇండివిడ్యువల్స్‌ 9.3 శాతం వృద్ధితో 6,10,569కి పెరిగారు. ఇందులో దాదాపు 20 శాతం (1,35,192) మంది స్వయంకృషితో పైకొచ్చిన 40 ఏళ్లలోపు యువతీ యువకులే. 2021లో యువ సంపన్నుల సంఖ్య వృద్ధిలో భారత్‌ 6వ స్థానంలో ఉంది. 

 గత ఏడాది బెంగళూరులోని అలా్ట్ర హైనెట్‌వర్త్‌ వ్యక్తులు అత్యధికంగా 17.1 శాతం వృద్ధితో 352కు చేరుకున్నారు. ఢిల్లీలో 12.4 శాతం పెరుగుదలతో 210కి, హైదరాబాద్‌లో 12.3 శాతం వృద్ధితో 467కు, ముంబైలో 9 శాతం పెరిగి 1,596కు చేరుకున్నారు. 

 దేశంలోని 69 శాతం అలా్ట్ర హై నెట్‌వర్త్‌ల సంపద ఈ ఏడాది మరో 10 శాతం మేర పెరగవచ్చని అంచనా. 

 2026 నాటికి ప్రపంచంలోని ‘యూహెచ్‌ఎన్‌డబ్ల్యూఐ’లు 28.4 శాతం పెరిగి 7,83,671కి చేరుకోవచ్చని అంచనా. వచ్చే ఐదేళ్లలో వీరి సంఖ్య ఆసియా, ఆస్ట్రేలియాల్లో అత్యధికంగా 33 శాతం చొప్పున పెరగవచ్చని అంచనా. ఉత్తర అమెరికాలో 28 శాతం, లాటిన్‌ అమెరికాలో 26 శాతం వృద్ధి చెందే అవకాశాలున్నాయి. 

 గత ఐదేళ్లలో ఢిల్లీలోని శ్రీమంతులు 101.2 శాతం పెరగగా.. ముంబైలో 42.6 శాతం, బెంగళూరులో 22.7 శాతం వృద్ధి నమోదైంది. వచ్చే ఐదేళ్లలో బెంగళూరులో వీరి సంఖ్య 89 శాతం పెరిగి 665కు చేరుకోవచ్చని అంచనా. 


ఇళ్ల్లపైనే 29% పెట్టుబడులు 


గత ఏడాది భారత్‌లోని అలా్ట్ర హై నెట్‌వర్త్‌ వ్యక్తులు తమ పెట్టుబడుల్లో 29 శాతం నివాస గృహాల కొనుగోలుకే కేటాయించినట్లు నైట్‌ఫ్రాంక్‌ రిపోర్టు వెల్లడించింది. 22 శాతం కమర్షియల్‌ ప్రాపర్టీ ప్రత్యక్ష కొనుగోలుకు, మరో 8 శాతం పరోక్షంగా కమర్షియల్‌ ప్రాపర్టీలో పెట్టుబడులకు కేటాయించినట్లు సంస్థ సర్వేలో వెల్లడైంది. అంటే, గత సంవత్సరం ‘యూహెచ్‌ఎన్‌డబ్ల్యూఐ’లు మొత్తం పెట్టుబడుల్లో 60 శాతం స్థిరాస్తి కోసమే కేటాయించారు. భారత ‘యూహెచ్‌ఎన్‌డబ్ల్యూఐ’ల్లో 10 శాతం మంది ఈ ఏడాది కొత్త ఇల్లు కొనుగోలు చేసే ఆలోచనలో ఉన్నట్లు రిపోర్టు తెలిపింది. 

దేశంలోనే కాకుండా బ్రిటన్‌, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌, అమెరికా వంటి దేశాల్లోనూ ప్రాపర్టీ కొనుగోలుకు మనవాళ్లు ఆసక్తి చూపుతున్నట్లు నైట్‌ఫ్రాంక్‌ పేర్కొంది. భారత ‘యూహెచ్‌ఎన్‌డబ్ల్యూఐ’లు సగటున 2,3 ఇళ్లు కలిగి ఉన్నారని, 32 శాతం సంపన్నులు తమ రెండో ఇంటిని గత ఏడాది అద్దెకిచ్చారని రిపోర్టు తెలిపింది. భాగ్యవంతుల నగరం!

అత్యధిక బిలియనీర్లున్నదేశాల్లో భారత్‌@ 3 

గత ఏడాదికి గాను అత్యధిక బిలియనీర్లున్న ప్రపంచ దేశాల్లో భారత్‌ మూడో స్థానంలో నిలిచింది. అమెరికా 748 బిలియనీర్లతో అగ్రస్థానంలో నిలవగా.. చైనాలో 554 మంది, భారత్‌లో 145 బిలియనీర్లున్నారు. కనీసం 100 కోట్ల డాలర్లు లేదా రూ.7,500 కోట్లు ఆస్తి కలిగిన వారు ఈ పరిధిలోకి వస్తారు. ఆసియాలో అత్యధిక బిలియనీర్లున్నది భారత్‌లోనే. ఆసియాలోని మొత్తం బిలియనీర్లలో 36 శాతం మన దేశం వారే. 


అభిరుచి కొనుగోళ్ల కోసం 11%

గత సంవత్సరంలో భారత అలా్ట్ర హై నెట్‌వర్త్‌ వ్యక్తులు 11 శాతం పెట్టుబడులను పెయింటింగ్స్‌ తదితర కళాకృతులు, ఆభరణాలు, క్లాసిక్‌ కార్లు, గడియారాలు, లగ్జరీ హ్యాండ్‌బ్యాగ్‌ల కోసం కేటాయించినట్లు నైట్‌ఫ్రాంక్‌ సర్వే తెలిపింది. గత ఏడాది 29 శాతం మంది సంపన్నులు ఈ తరహా కొనుగోళ్ల కోసం అధికంగా వెచ్చించారని రిపోర్టు వెల్లడించింది. భవిష్యత్‌లో లాభాలు పంచుతాయన్న అశతో కాకుండా మోజుతోనే వీటిని కొనుగోలు చేస్తున్నారని నైట్‌ఫ్రాంక్‌ పేర్కొంది. 


Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

బిజినెస్Latest News in Teluguమరిన్ని...

Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.