తస్మాత్‌ జాగ్రత్త

ABN , First Publish Date - 2022-05-13T13:36:50+05:30 IST

విదేశీ యువతుల ఫొటోలు పంపించి ఆన్‌లైన్‌ ద్వారా పలు ముఠాలు మోసాలకు పాల్పడుతున్నాయని, వీటిపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని గ్రేటర్‌ చెన్నై పోలీసు క

తస్మాత్‌ జాగ్రత్త

- విదేశీ యువతుల ఫొటోలతో మోసాలు 

- సిటీ పోలీసు కమిషనర్‌ హెచ్చరిక


చెన్నై: విదేశీ యువతుల ఫొటోలు పంపించి ఆన్‌లైన్‌ ద్వారా పలు ముఠాలు మోసాలకు పాల్పడుతున్నాయని, వీటిపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని గ్రేటర్‌ చెన్నై పోలీసు కమిషనర్‌ శంకర్‌జివాల్‌ హెచ్చరించారు.ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విట్టర్లలో ఈ ముఠాలకు చెందిన వ్యక్తులు అర్ధనగ్నంగా ఉన్న విదేశీ యువతులు, సూటు బూటు వేసుకున్న యువతుల ఫొటోలను పంపి నగరంలోని యువకులను ఆకట్టుకుంటున్నారని, ఆ తర్వాత రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు తాము వస్తున్నామని, అప్పుడు కలుస్తామంటూ తీయటి కబుర్లు చెబుతారని తెలిపారు. తరువాత ఢిల్లీ, ముంబాయి ఎయిర్‌పోర్టుల్లో దిగామని, తమ వెంట తెచ్చిన కోట్లాది రూపాయల విలువైన విదేశీ మారకద్రవ్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారంటూ నమ్మబలుకుతారని, వాటిని విడిపించుకునేందుకు ఆర్థిక సాయం చేయాలంటూ సందేశాలు పంపుతారని, వీటిని నమ్మి యువకులు లక్షలాది రూపాయలను ఆ ముఠా సభ్యులు చెప్పే బ్యాంక్‌ ఖాతాలకు పంపి మోసపోతున్నారని కమిషనర్‌ వెల్లడించారు. ఇదే విధంగా ఆ ముఠా సభ్యులు అందమైన విదేశీ యువకుల ఫొటోలను పంపి తాము భారతీయ యువతులను వివాహం చేసుకోవాలనుకుంటున్నామని నమ్మబలుకుతున్న విషయం కూడా తెలిసిందన్నారు. విదేశాల్లోని మల్టీ నేషనల్‌కంపెనీల్లో లక్షలాది రూపాయల వేతనంతో పనిచేస్తున్నట్లు తప్పుడు గుర్తింపు కార్డులు, వేతనపు సర్టిఫికెట్లు ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విట్టర్‌లకు సందేశాలు పంపుతున్నారని వాటి పట్ల కూడా ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించాలని కమిషనర్‌ అప్రమత్తం చేశారు. ఎట్టి పరిస్థితుల్లో బ్యాంక్‌ ఖాతా, ఓటీపీ తదితర వివరాలను వెల్లడించకూడదని, నగదును ఎవరి బ్యాంక్‌ ఖాతాల్లోకి జమ చేయకూడదని కమిషనర్‌ శంకర్‌ జివాల్‌ హెచ్చరించారు.

Read more