Advertisement

పౌరహక్కుల మేధావి శేషయ్య

Oct 14 2020 @ 01:51AM

భారతదేశంలోని హక్కుల ఉద్యమంలోని ఉదారవాద వైఖరికి-మార్క్సిస్టు వైఖరికి మధ్య ప్రధాన సంఘర్షణ జరుగుతున్నది. ఇది పౌరహక్కుల ఉద్యమ సిద్ధాంత, ఆచరణ తలాల్లో ప్రతిఫలిస్తున్నది. ఇందులో ప్రొ. శేషయ్య తన జ్ఞానం వల్ల, ఆచరణ వల్ల క్రియాశీలంగా భాగమయ్యారు. దీనికి కారణం ఆయన మేధావిగా రూపొందిన క్రమంలోనే ఉన్నది. ఆయన ఆలోచనా వ్యక్తిత్వానికి పునాది మార్క్సిస్టు పద్ధతిలో ఉంది. అయితే తనది పౌరహక్కుల కార్యరంగమనే విషయంలో ఆయనకు నిరంతర అప్రమత్తత ఉండేది.


‘పౌర,రాజకీయ, ఆర్థిక, సాంఘిక సాంస్కృతిక రంగాలన్నిటి సమాహారమే మానవ హక్కులు’ అని ఒక చోట ప్రొ. శేషయ్య రాశారు. సుమారు పాతికేళ్ల కిందటి మాట అది. దాన్ని ఆ తర్వాత మరింత అభివృద్ధి చేశారు. ఆయన పౌరహక్కుల ఉద్యమంలో నేరుగా ప్రధాన బాధ్యతలు తీసుకునే కాలానికి మన సమాజ సంక్షోభం తీవ్ర దశలోకి చేరుకున్నది. అనేక రూపాల్లో సామాజిక హింస, రాజ్యహింస పెచ్చరిల్లిపోయాయి. పీడిత అస్తిత్వ ఆకాంక్షలు బలపడ్డాయి. వర్గపోరాటాలు తీవ్రమయ్యాయి. అలాంటి భిన్నమైన సామాజిక సందర్భంలో ఆయన పౌరహక్కుల అవగాహనను అభివృద్ధి చేయాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే పౌరహక్కుల ఉద్యమంలో చాల కాలంగా నడుస్తున్న అవగాహనా చర్చ కూడా ఒక స్పష్టమైన, దృఢమైన వైఖరికి చేరుకున్నది. ఒక సంక్షోభకాలంలో సాహసోపేతంగా సంస్థకు నాయకత్వం వహించడమే కాదు. ఆలోచనారంగంలో కూడా ప్రవాహానికి ఎదురీదడానికి సిద్ధమైన మేధో సాహసి ఆయన. 


ఆ కాలంలో రాజ్య ప్రేరిత హంతక ముఠాలు పౌరహక్కుల నాయకుల హత్యలకు తెగబడ్డాయి. వ్యవస్థాగత సవాళ్లతోపాటు అనేక రకాలుగా రాజ్య నిర్బంధం తారాస్థాయికి చేరుకున్నది. అయినా పౌర హక్కుల మౌలిక అవగాహన దెబ్బతినకుండా ఆయన కాపాడగలిగారు. మామూలుగా సంక్షోభకాలంలోనే మేధావుల ఆలోచనలు పరీక్షకు గురవుతాయి. కానీ శేషయ్య ఆందోళన పడలేదు. అభిప్రాయాలు మార్చుకోలేదు. దాని కోసం సిద్ధాంత చర్చలు లేవదీయలేదు. నిజానికి ఆయన ఈ సంక్షోభాన్ని కేవలం పౌరహక్కుల ఉద్యమ సమస్యగానే చూడలేదు. దాని మూలాల్లోంచి చూశారు. మౌలికంగా మన సమాజ ప్రజాస్వామికీకరణ క్రమంలోని అనివార్యమైన సవాళ్లుగా గుర్తించారు. ప్రపంచవ్యాప్తంగా తలెత్తిన కొత్త సిద్ధాంతాల ప్రభావాల్లో భాగంగా అర్థం చేసుకున్నారు. పౌరహక్కుల మేధావిగా శేషయ్యను అంచనా వేయాల్సింది ఇక్కడే. బహుశా భారతదేశంలోని అనేక పౌర ప్రజాస్వామిక ఆలోచనాధారల్లో ఆయనది విశిష్టమైన ఒరవడి. దాన్ని మనం ఇంకా అర్థం చేసుకోవలసే ఉన్నది. ఆయన మౌలిక ఆలోచనాపరుడు. అందువల్ల పౌరహక్కుల ఉద్యమాన్ని చుట్టూ ఉన్న ఇతర ఉద్యమాల, భావజాలాల ప్రపంచంలో సమగ్రంగా అర్థం చేసుకొనేందుకు ప్రయత్నించారు. ‘ప్రజలు తమ జీవిత మనుగడ కోసం చేసే పోరాటాలే ప్రజాస్వామిక హక్కుల పోరాటానికి ప్రాతిపదిక’ అనే ఆయన మౌలిక అవగాహన అక్కడితో ఆగిపోలేదు. ‘భూస్వామ్య, పెట్టుబడిదారీ వ్యతిరేక పోరాటాలకు కూడా ఇదే ప్రాతిపదిక ఉంటుంది’ అని కూడా అన్నారు. హక్కుల ఉద్యమానికి ఉండే ప్రాతిపదిక మిగతా పోరాటాలకు కూడా ఉంటుందని గుర్తించడం ఒక ముఖ్యమైన ప్రజాస్వామిక వైఖరి. 


పౌరహక్కుల ఉద్యమ కర్తవ్యాలు వాటికవి వేరుగా ఉంటాయని ఆయన అనుకోలేదు. హక్కులు రూపొందిన ప్రజా పోరాటాల చరిత్ర నుంచి, హక్కుల స్వభావం నుంచి వాటిని వేరు చేసి చూడలేదు. మన సమాజంలో ఆ చరిత్రకు, ఆ స్వభావానికి తగిన పౌరహక్కుల ఉద్యమం తన కర్తవ్యాలను నిర్వచించుకోడానికి దోహదం చేశారు. హక్కులు అమలులోకి రాకుండా ఆధిపత్య సంబంధాలు అడ్డుకుంటాయని, హక్కులను అమలు చేయాల్సిన రాజ్య యంత్రాంగమే వాటిని కాలరాస్తుందనే రెండు విషయాలను కలిపి చూసేవారు. హక్కులు రూపొంది విలువలుగా మారే క్రమంలో, నాగరికతా వికాసంలో ముందుకు వచ్చిన రాజ్యాంగాన్ని, న్యాయ వ్యవస్థను, చట్టబద్ధ పాలనను శేషయ్య సునిశితంగా, విమర్శనాత్మకంగా చూసేవారు. రాజ్యాంగం ద్వారా హక్కుల అమలుకు ఉన్న అవకాశాలను, రాజ్యాంగ యంత్రమే హక్కులను కాలరాయడానికి ఉన్న కారణాలను ఆయన ఏకకాలంలో పదునుగా విశ్లేషించేవారు. రాజ్యాంగంలోకి, శిక్షా స్మృతిలోకి, భారత సామాజిక వ్యవస్థలోని అనేక అసమానతలలోకి వెళ్లి ఈ విషయాలు వివరించేవారు. 


ఈ క్రమంలోనే ఆయన ‘రాజ్యాంగం సామాజిక ఉత్పత్తి సంబంధాల్లో మార్పు తీసుకరాలేదు’ అని స్పష్టం చేశారు. ఈ మాట చెప్పడానికి మోమాటపడలేదు. హక్కుల ఉద్యమకారుడిగా ఉత్పత్తి సంబంధాల మార్పు గురించి నాకెందుకు అని అనుకోలేదు. దేనికంటే ఆర్థిక, సాంఘిక అసమానతలకు, హింసకు సామాజిక ఉత్పత్తి సంబంధాలు కారణం. హక్కులు లేకపోవడానికి, అమలు కాకపోవడానికి కూడా ఇలాంటి ఉత్పత్తి సంబంధాలను కాపాడే రాజ్యం కారణం. దళితులకు హక్కులు లేకుండా చేసే కులవ్యవస్థను, మహిళలకు హక్కులు లేకుండా చేసే పితృస్వామ్యాన్ని రాజ్యం బలపరుస్తోంది. వాటి అండదండలు రాజ్య వ్యవస్థకు ఉన్నాయి. ఆ సమూహాలకు హక్కులు లేకుండా పోవడానికి ఇతర కారణాలను మాత్రమే గుర్తించి ఉత్పత్తి సంబంధాల్లోని కారణాన్ని ఎందుకు విస్మరించాలి? వాటిని మార్చే పోరాటాల్లోంచి ముందుకు వచ్చే హక్కుల ఆవరణను ఎందుకు కాదనాలి? హక్కుల ఉద్యమంలోని ఉదారవాద పరిమితులను అధిగమించేందుకు ఈ వైపు నుంచి శేషయ్య హక్కుల తాత్వికతను బలోపేతం చేశారు. 


న్యాయ శాస్త్ర నిపుణుడిగా రాజ్యాంగం ద్వారా రాగల మార్పులపట్ల కూడా శేషయ్యకు స్పష్టత ఉన్నది. అయితే హక్కులను ప్రజా జీవితంలో భాగం చేయడానికి రాజ్యం మీద ఒత్తిడి తెచ్చేలా పోరాటం చేయాలని మాత్రమే ఆయన అనుకోలేదు. ఆ పని చేయవలసిందే. అయితే ఈ కర్తవ్యాన్ని హక్కుల చరిత్ర వైపు నుంచి విమర్శనాత్మకంగా ఆయన చూస్తారు. సామాజిక, ఉత్పత్తి సంబంధాల వైపు నుంచి ఆ కర్తవ్యానికి ఉండే అవరోధాలను పట్టించుకోవాలని అంటారు. ఇది పౌరహక్కుల ఉద్యమ అవగాహనలో కీలకమనేవారు. అందుకే ఆయన ఒక చోట ‘రాజ్యాంగం, చట్టం ప్రకారం రాజ్యం నడుచుకోవాలనే సూత్రం ఉన్నప్పటికీ ఆచరణలో ప్రభుత్వం చట్టాన్ని అమలు చేయదు. కాకపోగా పాలక వర్గాలు, ఉన్నత ఆస్తిపర వర్గాలు తమకు అనుకూలంగా చట్టాలను అమలు చేసుకుంటుంటాయి..’ అని స్పష్టం చేశారు. దేనికంటే రాజ్యాంగ యంత్రం మీద ఆస్తిపర వర్గాల పెత్తనం ఉన్నది. దళితులకు, మిగతా పీడిత ప్రజలకు హక్కులు లేకపోవడానికి, ఉన్నవి అమలు కాపోవడానికి ఇది ఒక ముఖ్యమైన కారణం.


అసలు ‘మనిషి కేంద్రంగా హక్కులను నిర్వచించే ఉదారవాద హక్కుల భావనలపట్లనే ఆయనకు తీవ్రమైన విమర్శ ఉండేది. దేనికంటే రాజ్యాంగం ద్వారా వ్యక్తికి సంక్రమించిన హక్కులను చట్టాల ద్వారానే రాజ్యం అణిచివేస్తుంది. ‘ప్రపంచంలో ఇంత వరకు ఏ ఒక్క మనిషి తనంతకు తానుగా హక్కులు సంపాదించుకోలేదు. అది సాధ్యం కూడా కాదు. హక్కులు వ్యక్తి అనుభవ రూపంలో ఉంటాయికాని సారంలో సామూహికమే..’ అంటారు. వ్యక్తులు హక్కులను సాధించుకోడానికి సామూహికంగా మారితే రాజ్యం ఆగ్రహిస్తుందంటారు. 


ప్రొ. శేషయ్య హక్కుల దృక్పథంలో ప్రజాస్వామికీకరణ ప్రక్రియలకు ప్రాధాన్యత ఉంటుంది. మన సమాజంలో ప్రజాస్వామికీకరణ ఎలా ఉన్నది? దానికి ఏ ఏ సాంఘిక, ఆర్థిక సంబంధాలు అవరోధంగా ఉన్నాయి? హక్కుల అమలును కూడా అవి ఎలా అడ్డుకుంటున్నాయి? మొదలైన విషయాలను పరిగణలోకి తీసుకోవాలంటారు. అందుకే రాజకీయార్థిక సాంఘిక లక్ష్యాలతో సాగే ప్రజా ఉద్యమాలతో నిమిత్తం లేకుండా హక్కుల సాధన, పరిరక్షణ సాధ్యం కాదంటారు. హక్కుల విశ్లేషణను ఒక ప్రత్యేకమైన విడి అంశంగా చూచే పద్ధతికి ఆయన వ్యతిరేకి. కేవలం రాజ్యాంగం, న్యాయం, చట్టబద్ధ పాలన మొదటైన వాటికి హక్కుల దృక్పథాన్ని పరిమితం చేయలేదు. సామాజిక రాజకీయార్థిక విశ్లేషణ స్థాయికి దాన్ని ఆయన అభివృద్ధి చేశారు.


రాజ్యాంగయంత్రం ద్వారా హక్కుల అమలుకు ప్రయత్నించడం, అందులోని విలువలను కాపాడటమే పౌరహక్కుల దృక్పథ విస్తరణ అనే వాదన బలంగా ఉన్న కాలంలో ఆయన చాలా తీవ్ర స్వరంతో ఈ వైఖరిని వివరించేవారు. ఈ క్రమంలో ఆయన వేర్వేరు పోరాటాల మధ్య ఎన్నడూ పోటీ తీసుకరాలేదు. ఆయనకు అన్ని రకాల ప్రజాపోరాటాల పట్ల గౌరవం ఉండేది. రాజ్యానికి వ్యతిరేకంగా పోరాడే శక్తులపై అమలయ్యే అణచివేతకు, సాంఘిక అణచివేతలకు మధ్య తేడా తెలుసు కాబట్టి ఆ రెంటికి వ్యతిరేకంగా పౌరహక్కుల దృక్పథానికి ఉండాల్సిన సమన్వయాన్ని సాధించారు. 


భారతదేశంలోని హక్కుల ఉద్యమంలోని ఉదారవాద వైఖరికి-మార్క్సిస్టు వైఖరికి మధ్య ప్రధాన సంఘర్షణ జరుగుతున్నది. ఇది పౌరహక్కుల ఉద్యమ సిద్ధాంత, ఆచరణ తలాల్లో ప్రతిఫలిస్తున్నది. ఇందులో ప్రొ. శేషయ్య తన జ్ఞానం వల్ల, ఆచరణ వల్ల క్రియాశీలంగా భాగమయ్యారు. దీనికి కారణం ఆయన మేధావిగా రూపొందిన క్రమంలోనే ఉన్నది. ఆయన ఆలోచనా వ్యక్తిత్వానికి పునాది మార్క్సిస్టు పద్ధతిలో ఉంది. అయితే తనది పౌరహక్కుల కార్యరంగమనే విషయంలో ఆయనకు నిరంతర అప్రమత్తత ఉండేది. ప్రొ. శేషయ్య హక్కుల వ్యాఖ్యాతగా, సిద్ధాంతకర్తగా, ఉద్యమకారుడిగా చేసిన పరిశీలనలు చాలా వరకు ఈ ఇరవై ఏళ్ల పరిణామాల్లో రుజువయ్యాయి. రాజ్యాంగానికి లోబడి జరిగే పోరాటాల పాత్ర గుర్తించేందుకు ఎవ్వరికీ ఇబ్బంది ఉండదు. రాజ్యాంగానికి అవతల జరిగే పోరాటాల వల్ల కూడా హక్కుల చైతన్యం వికసిస్తుందని, కొత్త హక్కులు వస్తాయని గుర్తించడం దగ్గరే అసలు సమస్య ఉంది. నిజానికి ఈ రెండు పోరాటాల మధ్యనే హక్కుల ఉద్యమం ఉంటుంది. అంతేగాని అదెక్కడో విడిగా ఉండదు. ఈ ఎరుక అందించడం ద్వారా పౌరహక్కుల దృక్పథ విస్తరణకు ప్రొ. శేషయ్య కృషి చేశారు. దాన్ని గుర్తించి ముందుకు తీసికెళ్లడమే ఆయనకు మనం ఇచ్చే నివాళి.


పాణి

Follow Us on:
Advertisement
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.