తాలు, తరుగు పేరుతో రైతులను ఇబ్బంది పెడితే కఠిన చర్యలు: మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి

ABN , First Publish Date - 2021-04-23T22:55:24+05:30 IST

కొనుగోలు కేంద్రాల్లో తూకం చేసిన ధాన్యాన్ని రైస్ మిల్లులకు వచ్చిన తర్వాత తాలు పేరుతో తరుగు తీయడం అన్యాయమని, తేమ, తాలు, తరుగు

తాలు, తరుగు పేరుతో రైతులను ఇబ్బంది పెడితే కఠిన చర్యలు: మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి

హైదరాబాద్: కొనుగోలు కేంద్రాల్లో తూకం చేసిన ధాన్యాన్ని రైస్ మిల్లులకు వచ్చిన తర్వాత తాలు పేరుతో తరుగు తీయడం అన్యాయమని, తేమ, తాలు, తరుగు పేరుతో రైతులను ఇబ్బందులు పెడితే కఠిన చర్యలు తప్పవని, పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి రైస్ మిల్లర్లను హెచ్చరించారు. ఈ విషయంలో ప్రధానంగా నల్గొండ జిల్లాలో వస్తున్న వార్తలపై విచారణ జరిపి వాస్తవ పరిస్థితులను నివేదించాలని పౌరసరఫరాల సంస్థ ఎన్ఫోర్స్మెంట్ అధికారులను ఆదేశించారు.ధాన్యం కొనుగోళ్లపై ప్రొక్యూర్మెంట్, మార్కెటింగ్, ఫైనాన్స్ అధికారులతో శుక్రవారం నాడు సంస్థ ఛైర్మన్ శ్రీనివాస్ రెడ్డి సమీక్షించారు.


కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చే విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని రైతాంగానికి విజ్ఞప్తి చేశారు. కరోనా రోజు రోజుకూ విజృంభిస్తున్న నేపథ్యంలో ధాన్యం అమ్ముకోవడానికి రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా పకడ్భంది చర్యలు తీసుకోవాలని, సంస్థలో సీనియర్ అధికారులు జిల్లాల వారిగా ప్రతిరోజూ ధాన్యం కొనుగోళ్లను పర్యవేక్షించాలని అన్నారు. ముఖ్యంగా నల్గొండ జిల్లాలో ప్రధాన ధృష్టి సారించాలని అధికారులకు సూచించారు. కరోనా ప్రభావం ధాన్యం కొనుగోళ్లపై ఏ మాత్రం పడకుండా క్షేత్రస్థాయిలో ధాన్యం కొనుగోళ్లకు ముడిపడి ఉన్న వ్యవసాయ, మార్కెటింగ్, రవాణా, తదితర విభాగాలతో సమన్వయంతో పనిచేయాలని కేంద్ర కార్యాలయం నుంచి ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు.


కరోనా నేపథ్యంలో హమాలీలు వాళ్ల స్వస్థలాలకు వెళ్లకుండా జిల్లా స్థాయిలో సరైన చర్యలు తీసుకోవాలని, ధాన్యం లోడింగ్ అలోడింగ్ మిల్లింగ్ పై హమాలీల కొరత లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.గన్నీ సంచుల కేటాయింపు, వినియోగంపై పారదర్శకత మరింత పెరగాలి, గడిచిన ఆరు సంవత్సరాల గన్నీ సంచుల రీకన్సిలేషన్ తక్షణం పూర్తిచేయాలన్నారు.పాత గన్నీ సంచుల నాణ్యతపై గోదాముల్లో, కొనుగోలు కేంద్రాల్లో ర్యాండమ్ గా తనిఖీలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. కేంద్రం నుండి రాష్ట్రానికి రావల్సిన నిధులు బకాయిలపై ప్రధాన దృష్టి సారించాలన్నారు.ఇప్పటి వరకు 30,722 మంది ప్రైవేట్ ఉపాధ్యాయులకు 7లక్షల 68వేల కిలోల సన్నబియ్యాన్ని 13,748 రేషన్ షాపుల ద్వారా పంపిణీ చేయడం జరిగింది. పంపిణీలో ఎలాంటి సాంకేతిక సమస్యలు ఎదురుకాకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.


Updated Date - 2021-04-23T22:55:24+05:30 IST