జస్టిస్ ఎంవై ఇక్బాల్ మృతి పట్ల సీజేఐ సంతాపం

ABN , First Publish Date - 2021-05-07T22:30:53+05:30 IST

సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఎంవై ఇక్బాల్ మృతి పట్ల భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ ఎన్‌వి రమణ సంతాపం వ్యక్తం చేశారు...

జస్టిస్ ఎంవై ఇక్బాల్ మృతి పట్ల సీజేఐ సంతాపం

న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఎంవై ఇక్బాల్ మృతి పట్ల భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ ఎన్‌వి రమణ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. మానవతా విలువల కోసం మనస్సాక్షికి లోబడి పనిచేసిన మహనీయుడు జస్టిస్ ఇక్బాల్ అంటూ కొనియాడారు. 70 ఏళ్ల జస్టిస్ ఇక్బాల్.. గురువారం రాత్రి గుర్గాన్‌లోని ఓ ప్రయివేటు ఆస్పత్రిలో మృతి చెందారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. ఇవాళ వీడియో కాన్ఫరెన్సు ద్వారా సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం కొలువుదీరగానే.. జస్టిస్ ఇక్బాల్ మృతిపై ఆయన ఓ ప్రకటన చేశారు. జస్టిస్ ఇక్బాల్‌కు నివాళి అర్పించేందుకు తర్వాత పూర్తిస్థాయి కోర్టు సమావేశపరుస్తామని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. ‘‘ఈ రోజు కార్యకలాపాలు ప్రారంభించే ముందు ఓ ప్రకటన చేయాల్సి ఉంది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఎంవై ఇక్బాల్ మృతి చెందారని బార్, బెంచ్ సభ్యులకు తెలియజేసేందుకు చింతిస్తున్నాను. ఆయన మృతి పట్ల ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను..’’ అని జస్టిస్ ఎన్‌వీ రమణ పేర్కొన్నారు. జస్టిస్ ఇక్బాల్‌తో తనకున్న అనుబంధాన్ని సీజేఐ ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. పారదర్శకతా చట్టం, సమాచార హక్కు చట్టం కింద బ్యాంకుల గురించి సమాచారాన్ని వెల్లడిచేయాలని ఆర్బీఐకి ఆదేశిస్తూ తీర్పు చెప్పిన ధర్మాసనంలో జస్టిస్ ఇక్బాల్ కూడా ఉన్నారు. 2012 డిసెంబర్‌లో ఆయన సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. నాలుగేళ్ల పాటు సేవలు అందించిన తర్వాత 2016 ఫిబ్రవరి 12న ఆయన పదవీ విరమణ చేశారు. 

Updated Date - 2021-05-07T22:30:53+05:30 IST