టీవీ డిబేట్లతో మరింత కాలుష్యం : సీజేఐ

ABN , First Publish Date - 2021-11-17T19:55:31+05:30 IST

అసందర్భ వ్యాఖ్యలతో కూడిన టీవీ డిబేట్లపై భారత ప్రధాన

టీవీ డిబేట్లతో మరింత కాలుష్యం : సీజేఐ

న్యూఢిల్లీ : అసందర్భ వ్యాఖ్యలతో కూడిన టీవీ డిబేట్లపై భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ ఎన్‌వీ రమణ ఆవేదన వ్యక్తం చేశారు. టీవీ డిబేట్లు మిగిలినవాటికన్నా ఎక్కువ కాలుష్యాన్ని సృష్టిస్తున్నాయన్నారు. కోర్టులు చేసే స్వల్ప వ్యాఖ్యలను సైతం వివాదాస్పద అంశాలుగా మార్చుతున్నారని పేర్కొన్నారు. ఢిల్లీలో వాయు కాలుష్యంపై ఓ విద్యార్థి దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)పై విచారణ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 


ఈ సమయంలో సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా  టీవీ డిబేట్ల అంశాన్ని లేవనెత్తారు. ఢిల్లీలో గాలి కలుషితమవడంలో పంట దుబ్బుల కాల్చివేత ప్రభావంపై సుప్రీంకోర్టును తాను తప్పుదోవ పట్టించినట్లు టీవీ డిబేట్లలో నిందిస్తున్నారన్నారు. దీనిపై జస్టిస్ రమణ స్పందిస్తూ, తాము తప్పుదోవలో పడలేదన్నారు.  


‘‘మీరు ఓ సమస్యను ఉపయోగించుకోవాలనుకుంటున్నారు, దానిని మేం పరిశీలించేవిధంగా చేస్తున్నారు, ఆ తర్వాత దానిని వివాదాస్పదం చేయాలనుకుంటున్నారు. అప్పుడు మిగిలేది ఒకరినొకరు నిందించుకోవడం మాత్రమే. టీవీల్లో డిబేట్లు మిగిలినవాటి కన్నా ఎక్కువ కాలుష్యం సృష్టిస్తున్నాయి’’ అని జస్టిస్ రమణ అన్నారు. 


ఢిల్లీలో గాలి కాలుష్యానికి కారణం రైతులు తమ పంట వ్యర్థాలను కాల్చడమేనని ఆరోపించడంపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. దీపావళి సందర్భంగా బాణసంచా కాల్చడాన్ని ప్రముఖులు సైతం సమర్థించడాన్ని గుర్తు చేసింది. 


ఈ ధర్మాసనంలోని జస్టిస్ సూర్యకాంత్ మాట్లాడుతూ, దేని వల్ల ఎంత శాతం కాలుష్యం వస్తోందనేదానితో సంబంధం లేకుండా, రైతుల దయనీయ స్థితిని గుర్తించాలన్నారు. రైతులు తమ పంట వ్యర్థాలను కాల్చవలసిన అవసరం ఎందుకు వస్తోందో ఎవరూ పరిశీలించడం లేదన్నారు. ఫైవ్ స్టార్, సెవెన్ స్టార్ సదుపాయాలుగల భవనాల్లో నివసించేవారు రైతులను నిందిస్తున్నారన్నారు. రైతులకుగల భూముల విస్తీర్ణం ఎంత? వారి భూముల నుంచి ఈ వ్యర్థాలను తొలగించడానికి తగిన ప్రత్యామ్నాయ మార్గాలను అనుసరించడానికి తగిన వనరులు వారి వద్ద ఉన్నాయా? అనే అంశాలను పరిశీలించడం లేదని పేర్కొన్నారు. ఏదైనా శాస్త్రీయ ప్ర్రక్రియ ఉంటే, దాని గురించి వారికి చెప్పాలన్నారు. ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం తరపున వాదనలు వినిపిస్తున్న సీనియర్ అడ్వకేట్ అభిషేక్ మను సింఘ్వి మాట్లాడుతూ, జస్టిస్ సూర్యకాంత్ వ్యాఖ్యలను సమర్థించారు. 


ఐఐటీ కాన్పూరు నిర్వహించిన అధ్యయనం ప్రకారం ఢిల్లీ గాలి కాలుష్యానికి ప్రధాన కారణం బాణసంచా కాదని సీజేఐ జస్టిస్ రమణ చెప్పారు. ఈ నివేదికను ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు సమర్పించిందన్నారు. ‘‘మీరు సమర్పించిన ఆన్‌లైన్ ఐఐటీ కాన్పూర్ స్టడీ నివేదికను నేను నా మొబైల్‌లో చూస్తున్నాను. బాణసంచా ఓ కారణం కాదని ఈ నివేదిక చెప్తోంది. అవి కూడా తాత్కాలికం మాత్రమేనని అంగీకరిస్తాం. బాణసంచాపై నిషేధం విధించినప్పటికీ గత పదిహేను రోజుల్లో పరిస్థితిని చూశారా? ఎంత బాణసంచా కాల్చారు?’’ అని ప్రశ్నించారు. 

Updated Date - 2021-11-17T19:55:31+05:30 IST