కొండలు, పచ్చని చెట్లే కాదు, తుపాకులు కూడా కనిపించాయి : సీజేఐ జస్టిస్ బాబ్డే

ABN , First Publish Date - 2021-04-23T20:53:40+05:30 IST

వర్చువల్ కాన్ఫరెన్స్ అనుభవాలను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ

కొండలు, పచ్చని చెట్లే కాదు, తుపాకులు కూడా కనిపించాయి : సీజేఐ జస్టిస్ బాబ్డే

న్యూఢిల్లీ : వర్చువల్ విధానంలో విచారణల అనుభవాలను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బాబ్డే శుక్రవారం పంచుకున్నారు. ఆయన పదవీ కాలంలో చివరి ప్రొసీడింగ్స్ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో వర్చువల్ విచారణలు నిర్వహించవలసి వచ్చిందన్నారు. ఈ పద్ధతిలో చాలా ఇబ్బందులు ఉన్నప్పటికీ, దీనిని అనుసరించక తప్పని పరిస్థితులు ఉన్నాయన్నారు. వర్చువల్ కోర్టు వల్ల లాయర్ల చాంబర్స్‌ను సందర్శించే యాత్రకు వెళ్ళిన అనుభూతి తనకు కలిగిందని చెప్పారు. సీజేఐగా తన 14 నెలల పదవీ కాలంలో ఎక్కువ సమయం వర్చువల్ విధానంలోనే విచారణలు జరిగినట్లు తెలిపారు. 


జస్టిస్ బాబ్డేకు వీడ్కోలు చెప్తూ జరిగిన సుప్రీంకోర్టు ప్రొసీడింగ్స్‌లో ఆయన మాట్లాడుతూ, ‘‘గౌరవనీయులైన నా సహచరులు మాత్రమే కాకుండా బార్ నుంచి, సంబంధిత ఇతరులందరి నుంచి న్యాయ సాధన లక్ష్యం కోసం గొప్ప చిత్తశుద్ధి, సత్ప్రవర్తన, అసాధారణమైన సమష్టి సహకారం అందడంతో, నేను ఈ న్యాయస్థానం నుంచి చాలా సంతోషంగా, సౌహార్దంతో, అద్భుతమైన వాదనల అత్యంత మధుర జ్ఞాపకాలతో సెలవు తీసుకుంటున్నానని మాత్రమే నేను చెప్పగలను’’ అని తెలిపారు. 


వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా విచారణలు జరపడంలో చాలా ప్రతికూలతలు ఉన్నాయని జస్టిస్ బాబ్డే చెప్పారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఈ విధానాన్ని అనుసరించక తప్పదన్నారు. మరోవైపు న్యాయవాదుల వాదనలను వర్చువల్ విధానంలో వినడం వల్ల, వారి ఛాంబర్లను సందర్శించే అవకాశం తనకు దక్కిందన్నారు. తాను వారి ఛాంబర్లకు యాత్రకు వెళ్లిన అనుభూతిని పొందానన్నారు. వ్యక్తిగతంగా తాను వెళ్ళకపోయినా వారి ఛాంబర్లలో ఉన్నవాటిని చూడగలిగానని చెప్పారు. అటార్నీ జనరల్ వెనుకనున్న విగ్రహాన్ని, వికాస్ సింగ్ జాగ్వార్ కుర్చీని, సొలిసిటర్ జనరల్ కార్యాలయంలోని గణేశుని ప్రతిమను చూశానన్నారు. గణేశుని ప్రతిమ ఈరోజు సొలిసిటర్ జనరల్ డెస్క్ మీద లేదన్నారు. కొందరు న్యాయవాదుల వెనుకనున్న కొండలను, మరికొందరి వెనుకగల కళాఖండాలు, చిత్రాలను, ఇంకొందరి వెనుకనున్న తుపాకులను తాను చూశానని చెప్పారు. 


‘‘దీనికి (వీడియో కాన్ఫరెన్సింగ్‌కు) తనవైన ప్రయోజనాలు ఉన్నాయి. మనమంతా కలిసి దానిలో ఉన్నందుకు, తిరిగి మనమంతా కలిసి బయటికొస్తున్నందుకు సంతోషం’’ అని చెప్పారు. ‘‘నేను సాధ్యమైనంత ఉత్తమంగా పని చేశాను. దాని ఫలితాలేమిటో నాకు తెలియదు కానీ నేను చేయగలిగినదానికి సంతోషిస్తున్నాను. అధికార దండాన్ని జస్టిస్ రమణకు అందిస్తున్నాను, ఆయన ఈ కోర్టుకు చాలా సమర్థవంతంగా నాయకత్వం వహించగలరు’’ అని తన ప్రసంగాన్ని జస్టిస్ బాబ్డే ముగించారు. 


కాబోయే సీజేఐ జస్టిస్ ఎన్‌వీ రమణ, జస్టిస్ ఏఎస్ బోపన్న, జస్టిస్ వీ రామసుబ్రహ్మణ్యంలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనంలో సీజేఐ శుక్రవారం ఈ వ్యాఖ్యలు చేశారు. 


కోవిడ్-19 మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా అష్ట దిగ్బంధనం అమలు చేయడంతో గత ఏడాది మార్చి నుంచి సుప్రీంకోర్టులో వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా విచారణలు ప్రారంభమయ్యాయి. జస్టిస్ బాబ్డేకు వీడ్కోలు పలికేందుకు జరిగిన ప్రొసీడింగ్స్‌లో అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్, సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు వికాస్ సింగ్, సుప్రీంకోర్టు అడ్వకేట్స్-ఆన్-రికార్డ్ అసోసియేషన్ అధ్యక్షుడు శివాజీ ఎం జాదవ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 


‘తెలుగు తేజం’ జస్టిస్ ఎన్‌వీ రమణ ఈ నెల 24న తదుపరి భారత ప్రధాన న్యాయమూర్తిగా  బాధ్యతలు స్వీకరిస్తారనే విషయం తెలిసిందే. 


Updated Date - 2021-04-23T20:53:40+05:30 IST