శాన్ ప్రాన్సిస్కో‌లో అడుగుపెట్టిన భారత ప్రధాన న్యాయమూర్తి.. స్వాగతం పలికిన ఏఐఏ అధ్యక్షుడు

ABN , First Publish Date - 2022-06-30T01:16:42+05:30 IST

భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ.. సతీ సమేతంగా అగ్రరాజ్యం అమెరికాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. అసోసియేషన్ ఆఫ్ ఇండో అమెరికన్స్ (40 భారతీయ సంఘాల కూటమి) ఆహ్వానం మేరకు యూఎస్‌లో పర్యటిస్తున్న సీజేఐ ఎన్వీ రమణ

శాన్ ప్రాన్సిస్కో‌లో అడుగుపెట్టిన భారత ప్రధాన న్యాయమూర్తి.. స్వాగతం పలికిన ఏఐఏ అధ్యక్షుడు

ఎన్నారై డెస్క్: భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ.. సతీ సమేతంగా అగ్రరాజ్యం అమెరికాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. అసోసియేషన్ ఆఫ్ ఇండో అమెరికన్స్ (40 భారతీయ సంఘాల కూటమి) ఆహ్వానం మేరకు యూఎస్‌లో పర్యటిస్తున్న సీజేఐ ఎన్వీ రమణ... ఈ రోజు శాన్ ఫ్రాన్సిస్కో చేరుకున్నారు. ఈ సందర్భంగా అసోసియేషన్ ఆఫ్ ఇండో అమెరికన్స్(ఏఐఏ) అధ్యక్షుడు జయరాం కోమటి.. తన కార్యవర్గంతో కలిసి విమానాశ్రయానికి చేరుకుని సీజేఐకి స్వాగతం పలికారు. స్థానిక భారత కాన్సులేట్ సిబ్బంది కూడా ఏయిర్‌పోర్ట్‌కు చేరుకుని.. భారత ప్రభుత్వం తరఫున ఆయనకు ఆహ్వానం పలికారు. ఈ కార్యక్రమంలో భారత్ బయోటెక్ అధినేత్రి సుచిత్ర యెల్ల, ఏఐఏ కార్యవర్గ సభ్యులతోపాటు స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు. 



అంతకుముందు.. అమెరికాలోని వాషింగ్టన్‌లో తెలుగు సమాజం సీజేఐకి సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘‘భారతదేశ స్వాతంత్య్రం కోసం మన పూర్వీకులు ఎంతగానో పోరాడినా ఆ ఫలాలు అందరికీ అందలేదన్న విషయాన్ని మరవరాదు. సొంత మనుషులను, ఆహారాన్ని, భాషను, సంస్కృతిని వదులుకొని వచ్చినా మీరు (ప్రవాసీలు) సుఖసంతోషాలతో ఉన్నారు. మీరు ఆర్థికంగా ఎదగడమే కాకుండా మీ కుటుంబాలు, మీ ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందాయి’’ అని ఆయన వ్యాఖ్యానించారు.


Updated Date - 2022-06-30T01:16:42+05:30 IST