Next CJI : జస్టిస్ రమణ వారసుడు జస్టిస్ యూయూ లలిత్‌!

ABN , First Publish Date - 2022-08-04T23:50:27+05:30 IST

భారత దేశ 49వ ప్రధాన న్యాయమూర్తి (CJI)గా జస్టిస్ ఉదయ్ యూ లలిత్ బాధ్యతలు

Next CJI : జస్టిస్ రమణ వారసుడు జస్టిస్ యూయూ లలిత్‌!

న్యూఢిల్లీ : భారత దేశ 49వ ప్రధాన న్యాయమూర్తి (CJI)గా జస్టిస్ ఉదయ్ యూ లలిత్ బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఆయనను తన వారసునిగా ప్రస్తుత సీజేఐ జస్టిస్ ఎన్‌వీ రమణ (Justice NV Ramana) సిఫారసు చేశారు. కేంద్ర ప్రభుత్వ ఆమోదం తర్వాత ఆయన ఆగస్టు 27న సీజేఐగా ప్రమాణ స్వీకారం చేస్తారు. 


తదుపరి సీజేఐగా ఎవరిని నియమించాలో సిఫారసు చేయాలని కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ బుధవారం కోరింది. దీనిపై జస్టిస్ ఎన్‌వీ రమణ స్పందిస్తూ జస్టిస్ యూయూ లలిత్‌ను గురువారం సిఫారసు చేశారు. ప్రభుత్వ ఆమోదం తర్వాత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రధాన న్యాయమూర్తిగా లలిత్‌ను నియమిస్తారు. సీజేఐగా లలిత్ పదవీ కాలం సుమారు మూడు నెలలు ఉంటుంది. 


బార్ నుంచి సీజేఐగా ఎదిగినవారిలో రెండోవారు

బార్ నుంచి సీజేఐగా ఎదిగిన మొదటి  న్యాయ కోవిదుడు జస్టిస్ ఎస్ఎం సిక్రి, ఆయన తర్వాత ఆ ఘనతను దక్కించుకోబోతున్నవారు జస్టిస్ లలిత్. 1971 నుంచి 1973 వరకు జస్టిస్ సిక్రి సీజేఐగా చేశారు. లలిత్ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా 2014 ఆగస్టులో నియమితులయ్యారు. 


సంప్రదాయం ప్రకారం, సీజేఐ పదవీ విరమణ చేసే రోజుకు సుమారు ఓ నెల రోజుల ముందు కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ ఆ సీజేఐకి లేఖ రాస్తుంది. వారసుడి నియామకం కోసం ఓ న్యాయమూర్తి పేరును సిఫారసు చేయాలని కోరుతుంది. సీజేఐ తన వారసుని పేరును ప్రభుత్వానికి సిఫారసు చేస్తారు. సాధారణంగా సీనియర్ మోస్ట్ జడ్జిని సీజేఐగా సిఫారసు చేస్తారు. 


సుప్రీంకోర్టు తీర్పుతో...

1993లో సెకండ్ జడ్జస్ కేసులో అత్యున్నత న్యాయస్థానం తీర్పు చెప్తూ, సుప్రీంకోర్టులో మోస్ట్ సీనియర్ జడ్జిని సీజేఐగా నియమించాలని, అయితే ఆయన ఆ పదవిని నిర్వహించడానికి యోగ్యమైన స్థితిలో ఉన్నారా? లేదా? అనే అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాలని తెలిపింది. తదనంతరం రాజ్యాంగ న్యాయస్థానాల్లో న్యాయమూర్తుల నియామకాలు, బదిలీలకు మార్గదర్శనం చేసేందుకు ఓ మెమొరాండం ఆఫ్ ప్రొసీజర్‌ను రూపొందించారు. దీని ప్రకారం, తదుపరి సీజేఐగా ఎవరిని నియమించాలో సిఫారసు చేయాలని పదవీ విరమణ చేయబోతున్న సీజేఐని కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ కోరుతుంది. సీజేఐ సిఫారసును స్వీకరించిన తర్వాత దానిని ఈ మంత్రిత్వ శాఖ ప్రధాన మంత్రికి పంపిస్తుంది. అనంతరం సీజేఐ నియామకంపై రాష్ట్రపతికి ప్రధాన మంత్రి సలహా ఇస్తారు. 


ఈసారి ఆలస్యం...

అయితే ఈసారి ఈ సిఫారసును కోరడంలో న్యాయ మంత్రిత్వ శాఖ ఆలస్యం చేసింది. ఫలితంగా జస్టిస్ రమణ తన వారసుని పేరును సిఫారసు చేయడం ఆలస్యమైంది. ఈ ప్రభావం బుధవారం జరిగిన కొలీజియం సమావేశంపై కూడా పడింది. ఈ సమావేశం ప్రతిష్టంభనతో ముగిసింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తులను, కొన్ని హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులను నియమించడంపై కీలకమైన నిర్ణయాలను తీసుకునే బాధ్యతను రాబోయే తన వారసునికి జస్టిస్ రమణ వదిలిపెట్టవలసి వచ్చింది. సుప్రీంకోర్టులో 34 మంది న్యాయమూర్తుల నియామకానికి అనుమతి ఉంది. జస్టిస్ రమణ పదవీ విరమణ చేస్తే 30 మంది న్యాయమూర్తులు ఉంటారు. 


తదుపరి సీజేఐగా నియమించేందుకు సిఫారసు లేఖను జస్టిస్ లలిత్‌కు జస్టిస్ రమణ గురువారం ఉదయం అందజేశారు. జస్టిస్ రమణ ఆగస్టు 26న పదవీ విరమణ చేస్తారు. సీజేఐగా జస్టిస్ లలిత్ (Justice Lalit) పదవీ కాలం 74 రోజులు మాత్రమే. ఆయన నవంబరు 8న పదవీ విరమణ చేస్తారు. ఆయన తర్వాత 50వ సీజేఐగా నియమితులయ్యేందుకు తదుపరి సీనియర్ మోస్ట్ జడ్జి జస్టిస్ డీవై చంద్రచూడ్ (Justice DY Chandrachud). 


జస్టిస్ లలిత్ 2014 ఆగస్టు 13న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు ఆయన సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్‌గా పని చేశారు. ఆయన తండ్రి జస్టిస్ యూఆర్ లలిత్ కూడా సీనియర్ అడ్వకేట్, ఢిల్లీ హైకోర్టు జడ్జిగా పని చేశారు. 


ట్రిపుల్ తలాక్ జడ్జిమెంట్

ట్రిపుల్ తలాక్‌  (Tripple Talaq) రాజ్యాంగ విరుద్ధమని మెజారిటీ తీర్పునిచ్చిన ధర్మాసనంలో జస్టిస్ యూయూ లలిత్ ఉన్నారు. అయోధ్య రామజన్మభూమి (Ayodhya Ramjanmabhoomi) కేసులో ధర్మాసనం నుంచి ఆయన వైదొలగారు. బాబ్రీ మసీదు కూల్చివేతకు సంబంధించిన కోర్టు ధిక్కారం కేసులో కల్యాణ్ సింగ్ (Kalyan Singh) తరపున వాదనలు వినిపించినందువల్ల ఈ నిర్ణయం తీసుకున్నారు. 


Updated Date - 2022-08-04T23:50:27+05:30 IST