న్యాయవ్యవస్థలోనూ ‘సగం’!

Sep 27 2021 @ 02:30AM

మహిళలకు 50% రిజర్వేషన్‌ కల్పించాలి

అది దానం కాదు.. వారి హక్కు

సమానత్వం కోసం మహిళ నినదించాలి

వారికి నా సంపూర్ణ మద్దతు: సీజేఐ రమణ


న్యూఢిల్లీ, సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి): న్యాయ వ్యవస్థలో మహిళలకు సమాన ప్రాతినిధ్యం కావాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ అన్నారు. న్యాయస్థానాల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్‌ లక్ష్యాన్ని చేరుకునేందుకు సమయం ఆసన్నమైందని చెప్పారు. తమకు 50 శాతం రిజర్వేషన్‌ కావాలని స్త్రీలు నినదించాలని సూచించారు. ఈ రిజర్వేషన్‌ ఎవరో ఇచ్చే దానం కాదని, అది వారి హక్కు అని తెలిపారు. ఈ విషయంలో తాను పూర్తి అండగా ఉంటానన్నారు. సుప్రీంకోర్టులో మహిళా న్యాయవాదులు ఆదివారం జస్టిస్‌ రమణకు, కొత్తగా బాధ్యతలు స్వీకరించిన న్యాయమూర్తులకు సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. దిగువ కోర్టుల్లో మహిళలు 30 శాతమే ఉన్నారని, హైకోర్టుల్లో కేవలం 11 శాతం ఉన్నారని తెలిపారు. సుప్రీంకోర్టులోని 33 మంది న్యాయమూర్తుల్లో ఇప్పుడు నలుగురు మహిళలు వచ్చారన్నారు.


కొలీజియంలో ప్రగతిశీల సహచరులు ఉండడం తనకెంతో సంతోషకరమని, వారి సహాయంతో ఉన్నత న్యాయ వ్యవస్థలో వ్యత్యాసాన్ని పూరించే ప్రయత్నం చేస్తామని తెలిపారు. దేశంలోని మొత్తం 1.70 లక్షల మంది న్యాయవాదుల్లో కేవలం 15 శాతమే మహిళలని, రాష్ట్ర బార్‌ కౌన్సిళ్లలో 2 శాతం మహిళలే ఎన్నికవుతున్నారని పేర్కొన్నారు. న్యాయ కళాశాలల్లో మహిళలకు రిజర్వేషన్‌ కల్పించాలన్న ప్రతిపాదనను తాను సమర్థిస్తానని జస్టిస్‌ రమణ చెప్పారు. కక్షిదారుల ప్రాధాన్యాలు, అసౌకర్యమైన వాతావారణం, మౌలిక సదుపాయాల లేమి వంటివి న్యాయవృత్తిలో మహిళలకు ఇబ్బందులు కలగజేస్తున్నాయని అభిప్రాయపడ్డారు. దేశంలో 60 వేల న్యాయస్థానాలు ఉండగా వాటిలో 22 శాతం కోర్టుల్లో మహిళలకు ప్రత్యేకంగా మరుగుదొడ్లు కూడా లేవని చెప్పారు. మహిళా అధికారులు కూడా ఈ సమస్యతో ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. ఇలాంటి సమస్యలను తక్షణమే పరిష్కరించాల్సి ఉందన్నారు. అందుకే తాను జ్యుడీషియల్‌ మౌలిక సదుపాయాల కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించానని చెప్పారు. 


దసరా తర్వాత భౌతిక విచారణలు!

న్యాయస్థానాల్లో భౌతిక విచారణ జరగాలన్న ప్రతిపాదనకు తాను మద్దతునిస్తానని జస్టిస్‌ రమణ చెప్పారు. యువకులు, ఇతర న్యాయవాదులు కోర్టులకు హాజరయ్యేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. కోర్టులను తెరిచేందుకు సమస్యేమీ లేదని, వైద్య శాఖ సూచనలను మీరి రిస్క్‌ చేయడం మంచిది కాదని పేర్కొన్నారు. కొవిడ్‌ సంక్షోభం నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలని తాను కూడా భావిస్తానని చెప్పారు. దసరా సెలవుల తర్వాత కోర్టులు భౌతికంగా విచారణ జరిపే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. సుప్రీంకోర్టుకు అక్టోబరు 11 నుంచి 16 వరకు దసరా సెలవులు ప్రకటించారు.

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.