సీజేఐకి ఆ అధికారం ఉండకూడదు

ABN , First Publish Date - 2022-08-12T09:30:07+05:30 IST

సుప్రీంకోర్టు బెంచ్‌లకు కేసులను అప్పగించే అధికారం ప్రధాన న్యాయమూర్తికి ఉండకూడదని సీనియర్‌ న్యాయవాది దుష్యంత్‌ దవే అభిప్రాయం వ్యక్తం చేశారు.

సీజేఐకి ఆ అధికారం ఉండకూడదు

బెంచ్‌లకు ఆటోమేటెడ్‌గా కేసుల కేటాయింపు 

ఇందులో రిజిస్ట్రీ, సీజేఐ జోక్యం ఇబ్బందికరం

సీనియర్‌ న్యాయవాది దుష్యంత్‌ దవే వ్యాఖ్యలు 


న్యూఢిల్లీ, ఆగస్టు 11: సుప్రీంకోర్టు బెంచ్‌లకు కేసులను అప్పగించే అధికారం ప్రధాన న్యాయమూర్తికి ఉండకూడదని సీనియర్‌ న్యాయవాది దుష్యంత్‌ దవే అభిప్రాయం వ్యక్తం చేశారు. మానవ ప్రమేయం ఏమాత్రం లేకుండా ఈ ప్రక్రియ పూర్తి ఆటోమేటెడ్‌గా, కంప్యూటరైజేషన్‌ ద్వారా కొనసాగాలన్నారు. బెంచ్‌లకు సబ్జెక్టుల కేటాయింపును ప్రధాన న్యాయమూర్తి నిర్ణయించవచ్చని, ఆ తర్వాత కేసుల కేటాయింపు మాత్రం కంప్యూటర్‌ ద్వారా జరగాలన్నారు. ఈ విషయంలో రిజిస్ట్రీ, సీజేఐ జోక్యం ఇబ్బందికరంగా ఉంటోందన్నారు. దీనికి ఉదాహరణగా గతంలో ఒక కార్పొరేట్‌ సంస్థ కేసులను ఒక నిర్దిష్ట బెంచ్‌కు మాత్రమే కేటాయించేవారన్నారు. ‘‘జస్టిస్‌ అరుణ్‌ మిశ్రా నేతృత్వంలోని బెంచ్‌ ద్వారా ఒక అతిపెద్ద కార్పొరేట్‌ సంస్థకు సంబంధించిన తొమ్మిది తీర్పులు వెలువడటాన్ని ఎలా సమర్థించుకుంటారు? దీనిపై 2019లో నేను లేఖ రాసే సమయానికే నాలుగు తీర్పులు వచ్చేశాయి. ఆ తర్వాత సీజేఐ గొగోయ్‌ మరో ఐదు తీర్పులు ఇచ్చారు. ఆ తర్వాత జస్టిస్‌ గొగోయ్‌ తన పుస్తకావిష్కరణ కార్యక్రమానికి ఆ కార్పొరేట్‌ సంస్థ అధినేతను కుటుంబంతో సహా ఆహ్వానించడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఇటువంటి ఘటనలు జరుగుతున్నా సుప్రీంకోర్టులో అందరూ కళ్లు మూసుకోవాలి అనుకోవడం చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. చాలాకాలంగా ఇదే విధానం కొనసాగుతోంది. జడ్జిలంతా ఏం చేస్తున్నారు? ఆ బెంచ్‌ను సదరు కార్పొరేట్‌ సంస్థ కోసమే ఉద్దేశించారా?’’ అని దవే ప్రశ్నించారు. ‘‘సుప్రీంకోర్టుకు వచ్చిన కార్పొరేట్‌ సంస్థల కేసుల్లో వారి సక్సెస్‌ రేటు 90శాతం పైగానే ఉంది. ఇది దేనికి సంకేతం? అత్యున్నత న్యాయస్థానం ప్రతిష్ఠను, గౌరవాన్ని వారి సహచర జడ్జిలు ఎలా దెబ్బతీస్తున్నారో ఇతర న్యాయమూర్తులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. నిష్పక్షపాతంగా న్యాయం చేయడంలో సుప్రీంకోర్టు వైఫల్యాల గురించి దేశ వ్యాప్తంగా ప్రజలు మాట్లాడుతున్నారు. కేసుల లిస్టింగ్‌ వ్యవస్థ హైకోర్టులో సక్రమంగా పనిచేస్తున్నప్పుడు సుప్రీంకోర్టులో ఎందుకు పనిచేయదు? ఈ అంశంపై జడ్జిలు ఆత్మపరిశీలన చేసుకోవాలి. లేకపోతే సుప్రీం మరిన్ని విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇది దేశ న్యాయవ్యవస్థకు మంచిది కాదు’’ అని దవే పేర్కొన్నారు.


పారదర్శకంగా లేని రిజిస్ట్రీ పనితీరు

‘‘తమ కేసులు నెలల తరబడి లిస్టింగ్‌ చేయడం లేదనే భావన చాలామంది యువ న్యాయవాదుల్లో పెరుగుతోంది. కొందరు శక్తిమంతమైన లాయర్లకు మాత్రం వారికి అనుకూలమైన స్లాట్‌ను, వేగంగా పొందుతున్నారు. రిజిస్ట్రీ పనితీరు ఏమాత్రం పారదర్శకంగా లేదు. ఇటువంటి అంశాలు తప్పుడు సంకేతాలు పంపిస్తాయి. ఫిర్యాదుల పరిష్కారానికి ఒక వ్యవస్థ ఉండాలి. బార్‌ ఫిర్యాదులను జడ్జిలు వినిపించుకోవాలి. ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు సీజేఐ ఎన్వీ రమణ ప్రయత్నిస్తారని భావించాను. బెంచ్‌లకు కేసుల కేటాయింపులో ఆయన పెద్దగా ఏమీ చేయలేకపోయారనే చెప్పాలి. అయితే ఈ దేశాన్ని, ప్రజలను ఓడించిన నలుగురు సీజేఐల తర్వాత వచ్చిన జస్టిస్‌ రమణ కచ్చితంగా చాలా మెరుగ్గా వ్యవహరించారు. ఆయన తర్వాత వచ్చే సీజేఐలు మరింత మెరుగ్గా వ్యవహరించాలని ప్రార్థిస్తున్నాను’’ అని దవే వ్యాఖ్యానించారు.

Updated Date - 2022-08-12T09:30:07+05:30 IST