పోలవరంలో.. ఎట్టకేలకు స్పిల్‌వే గేట్ల బిగింపు

ABN , First Publish Date - 2022-05-21T09:01:40+05:30 IST

ఎట్టకేలకు పోలవరం ప్రాజె క్టు స్పిల్‌వే గేట్ల బిగింపు పూర్తయింది. టీడీ పీ హయాంలోనే నాటి సీఎం చంద్రబాబు ఈ గేట్ల ఏర్పాటుకు శ్రీకారం

పోలవరంలో.. ఎట్టకేలకు స్పిల్‌వే గేట్ల బిగింపు

96 హైడ్రాలిక్‌ సిలిండర్ల అమరిక, 24 పవర్‌ ప్యాక్‌ సెట్ల ఏర్పాటు పూర్తి

విద్యుత్‌ ప్రాజెక్టు ప్రెషర్‌ టన్నెల్స్‌లో ఫరల్స్‌ అమరిక పనులు మొదలు


రాజమహేంద్రవరం/పోలవరం, మే 20 (ఆంధ్రజ్యోతి): ఎట్టకేలకు పోలవరం ప్రాజె క్టు స్పిల్‌వే గేట్ల బిగింపు పూర్తయింది. టీడీ పీ హయాంలోనే నాటి సీఎం చంద్రబాబు ఈ గేట్ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టగా.. జగన్‌ గద్దెనెక్కిన మూడేళ్లకు వాటి అమరికను శుక్రవారం పూర్తి చేసింది. స్పిల్‌వేలో 48 రేడియల్‌ గేట్ల బిగింపు, గేట్లను పైకి కిందకి కదిలించడానికి అవసరమయ్యే 96 హైడ్రాలిక్‌ సిలిండర్ల అమరిక, వాటికి విద్యుత్‌ సరఫరా అందించే 24 పవర్‌ ప్యాక్‌ సెట్ల ఏర్పాటు శుక్రవారం తో పూర్తయ్యాయి. గోదావరి జలాలను స్పిల్‌వే గుం డా బయటకు పంపించే క్రమంలో ఉపయోగించే రివర్‌ స్లూయిజ్‌ గేట్ల ఏర్పాటుతోపాటు పది రివర్‌ స్లూయిజ్‌ గేట్లను ఎత్తి దించడానికి 20 హైడ్రాలిక్‌ సిలిండర్ల అమరిక వాటికి విద్యుత్‌ సరఫరా కోసం పది పవర్‌ప్యాక్‌ సెట్ల అమరిక పనులు పూర్తయ్యాయి.  10 రివర్‌ స్లూయిజ్‌ గేట్ల ఏర్పాటుతో పా టు వీటికి ఒక్కోదానికి రెండు వంతున 10 గేట్లకు 20 హైడ్రాలిక్‌ సిలిండర్లను అమర్చారు. కానీ ప్రాజెక్టులో ముఖ్యమైన ఎర్త్‌ కమ్‌ రాక్‌ఫిల్‌ డ్యాం డిజైన్లపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. డయాఫ్రం వాల్‌ వద్ద గోతులు పూడ్చే విషయంలోనూ నిర్ణయం తీసుకోవలసి ఉంది. ఎగువ కాఫర్‌ డ్యాంతో పాటు స్పిల్‌వే కూడా పూర్తి కావడంతో రానున్న వరదల కాలంలో స్పిల్‌వే వద్ద కొంత మేర నీటిని నిల్వ ఉంచవచ్చు. కానీ దీనివల్ల ఏజెన్సీ గ్రామాలు మునిగిపోతాయి. అక్కడి ప్రజలకు పునరావాసం ఇంకా పూర్తి చేయలేదు. ఇంకోవైపు పోలవరం విద్యుత్కేంద్రం పనులు కూడా జరుగుతున్నాయి. కొండను తవ్వి 12 ప్రెషర్‌ టన్నెల్స్‌ తవ్వారు. వాటిలో ఫెరల్స్‌ అమర్చే పనులు శుక్రవారం మొదలెట్టారు.

నేడు ప్రాజెక్టు ప్రాంతానికి శ్రీరామ్‌ బృందం

కేంద్ర జలశ క్తి శాఖ సలహాదారు శ్రీరామ్‌ వెదిరె, పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) సీఈవో చంద్రశేఖర్‌ అయ్యర్‌లతో కూడిన బృందాలు శనివారం పోలవరం ప్రాజెక్టు ప్రాంతానికి వస్తున్నాయి. శని, ఆదివారాల్లో పనుల పురోగతిని పరిశీలిస్తాయి. డయాఫ్రం వాల్‌ మరమ్మతులు, ఈసీఆర్‌ఎఫ్‌ డ్యాం నిర్మాణాలపై ఆరా తీస్తాయి. ఈ బృందాల్లో డీడీఆర్‌పీ చైర్మన్‌ ఏబీ పాండ్యా, పీపీఏ డైరెక్టర్‌ దేవేంద్రరావు, డీడీ కుచేల్‌, సభ్యుడు ఎంకే శ్రీనివాస్‌, డీడీఆర్‌పీ కోఆప్టెడ్‌ సభ్యులు గోపాలకృష్ణ, వైకే హాడా, డీపీ భార్గవ, కేంద్ర మట్టి, రాతి నాణ్యతా పరిశీలన డైరెక్టర్‌ చిత్ర, కేంద్ర జలసంఘం డైరెక్టర్‌ మహమ్మద్‌ ఖయ్యూం, డీడీ అశ్విన్‌కుమార్‌ వర్మ  ఉంటారు.

Updated Date - 2022-05-21T09:01:40+05:30 IST