హైకోర్టు పరిధి దాటింది

Published: Fri, 25 Mar 2022 02:43:58 ISTfb-iconwhatsapp-icontwitter-icon
హైకోర్టు పరిధి దాటింది

  • చట్టాలు చేసే అధికారం అసెంబ్లీకి లేదంటే ఎలా?
  • ఒక వ్యవస్థ మరో వ్యవస్థలోకి చొరబడేందుకు వీల్లేదు
  • చట్టాలు చేసే సర్వాధికారాలూ శాసనసభకే ఉన్నాయి
  • అసెంబ్లీ గౌరవాన్ని కాపాడుకుంటాం.. వికేంద్రీకరణ వైపే మా అడుగులు 
  • న్యాయ సలహా తీసుకుని ప్రత్యామ్నాయాలు ఆలోచిస్తాం
  • అమరావతిపై ప్రేమ ఉంది కాబట్టే ఇక్కడ ఇల్లు కట్టుకున్నాను
  • 6 నెలల్లో అభివృద్ధి పనులు కుదరవు.. అక్కడ అన్ని కోట్లు ఖర్చుచేయలేం
  • హైకోర్టు తీర్పు అమలు అసాధ్యం..
  • అసెంబ్లీలో సీఎం జగన్‌ స్పష్టీకరణ


ప్రస్తుతం మూడు రాజధానుల చట్టం అమల్లో లేదు. అమరావతి రాజధానిగానే ఉంది. కానీ భవిష్యత్‌లో వికేంద్రీకరణ చట్టాన్ని చేస్తామని ఊహిస్తూ.. వికేంద్రీకరణ చట్టాన్ని, తీర్మానాన్ని చేసే అధికారం శాసనసభకు లేదని హైకోర్టు తీర్పు ఎలా ఇస్తుంది?

శాసన, న్యాయ, కార్యనిర్వాహక వ్యవస్థలు మూడూ ఒక దానిపై మరొకటి అజమాయిషీ చేసేందుకు వీల్లేదు. చట్టసభలకు శాసనాలను చేసే అధికారంలేదని హైకోర్టు ఎలా చెబుతుంది? మూడు రాజధానుల చట్టాన్ని తీసుకురాకుండా కోర్టులు నిరోధించజాలవు.


                                                                                            సీఎం జగన్మోహన్‌రెడ్డి


అమరావతి, మార్చి 24 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర హైకోర్టు తన పరిధి దాటిందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ఆక్షేపించారు. పరిపాలనా వికేంద్రీకరణ దిశగా అడుగులు వేసి తీరతామని స్పష్టం చేశారు. మూడు రాజధానుల అంశానికి సంబంధించి కోర్టు ఇచ్చిన తీర్పుపై న్యాయసలహా తీసుకుని ప్రత్యామ్నాయాలు ఆలోచిస్తామని తేల్చిచెప్పారు. మూడు రాజధానులు, సీఆర్‌డీఏ చట్టాలను వాపసు తీసుకున్నాక.. ఇక ఆ అంశానికి తావెక్కడిదని ప్రశ్నించారు. ప్రస్తుతం 3 రాజధానుల చట్టం అమలులో లేదని.. అమరావతి రాజధానిగానే ఉందని అన్నారు. కానీ భవిష్యత్‌లో వికేంద్రీకరణ చట్టాన్ని చేస్తామని ఊహిస్తూ.. వికేంద్రీకరణ చట్టాన్ని.. తీర్మానాన్ని చేసే అధికారం శాసనసభకు లేదని హైకోర్టు తీర్పు ఎలా ఇస్తుందని నిలదీశారు. చట్టసభలకు శాసనాలను చేసే అధికారం లేదని హైకోర్టు ఎలా చెబుతుందని ప్రశ్నించారు. మూడు రాజధానుల చట్టాన్ని తీసుకురాకుండా కోర్టులు నిరోధించజాలవని స్పష్టం చేశారు. పరిపాలన వికేంద్రీకరణ అంశంపై గురువారం అసెంబ్లీలో చేపట్టిన లఘు చర్చ సందర్భంగా ఆయన ప్రసంగించారు.


గత ప్రభుత్వం చేసిన చట్టాలూ, పాలనా నచ్చలేదనే 151 స్థానాలతో వైసీపీకి అఽధికారమిచ్చారని.. ప్రభుత్వ నిర్ణయాలు.. పాలనా వ్యవహారాలు.. చట్టాలు నచ్చకపోతే ఐదేళ్లలో ప్రజలు ఇంటికి పంపేస్తారని.. ఇదే ప్రజాస్వామ్యంలో ఉన్న సౌందర్యమని తెలిపారు. కోర్టులు పాలనా వ్యవస్థల్లో జొరబడలేవన్నారు. తెలంగాణ ఉద్యమం మొదట అభివృద్ధి జరగనందుకు వచ్చిందని, తర్వాత ఉద్యమం.. అభివృద్ధి అంతా హైదరాబాద్‌కే కేంద్రీకృతం కావడం వల్ల వచ్చిందన్నారు. వికేంద్రీకరణ వల్లే ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి జరుగుతుందని జస్టిస్‌ శ్రీకృష్ణ కమిటీ..  రాజధాని ఏర్పాటుపై అధ్యయనం చేసిన శివరామకృష్ణన్‌ కమిటీ వెల్లడించాయని చెప్పారు. మూడు రాజధానుల బిల్లు సభలో ప్రవేశపెట్టినప్పుడు.. రాష్ట్రంలో న్యాయ, కార్యనిర్వాహక, శాసన రాజధానులకు కట్టుబడి పాలనా వికేంద్రీకరణ చేస్తామని స్పష్టంగా చెప్పామన్నారు. రాజ్యాంగానికే కాకుండా శాసనసభ అధికారాలనూ హరించే విధంగా హైకోర్టు తీర్పు ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైకోర్టు తమ పరిధిని దాటిందని అనిపిస్తోంది కాబట్టి శాసనసభలో ఇవాళ సభ అధికారాలపై చర్చ జరుగుతోందన్నారు. 2014 రాష్ట్ర విభజన చట్టం ప్రకారం రాజధాని నిర్ణయం కేంద్ర పరిధిలోనిదని హైకోర్టు పేర్కొనడాన్ని తప్పుబట్టారు.


దేశ సమాఖ్య స్ఫూర్తిని.. శాసనసభ అధికారాలనూ హరించేలా ఈ తీర్పు ఉందన్నారు. రాజధానిపై కేంద్రానికి ఎలాంటి అధికారమూ ఉండదని.. కేంద్రం పాత్ర కూడా ఉండదని చెప్పారు. ఇదే విషయాన్ని అదనపు అఫిడవిట్‌లో కేంద్రం కూడా పేర్కొందన్నారు. రాజధాని అంశం పూర్తిగా రాష్ట్రం పరిధిలోనిదని.. లోక్‌సభలో తెలుగుదేశం ఎంపీ కేశినేని నాని వేసిన ప్రశ్నకు కేంద్రం క్రిస్టల్‌ క్లియర్‌గా తేల్చిచెప్పిందని తెలిపారు. 


హైకోర్టుపై గౌరవం ఉంది..

హైకోర్టునూ, దాని అధికారాలనూ అగౌరవపరచడానికి ఈ చర్చ పెట్టలేదని.. రాష్ట్ర హైకోర్టుపై తమకు అత్యంత గౌరవం ఉందని ముఖ్యమంత్రి అన్నారు. అలాగే రాష్ట్ర అసెంబ్లీ.. దాని గౌరవాన్ని కాపాడుకోవలసిన  బాధ్యత తమపై ఉందని చెప్పారు. రాజధాని వికేంద్రీకరణపై గౌరవ చట్ట సభకు తీర్మానం చేసే అధికారమూ లేదని కోర్టు తీర్పు ఇవ్వడం శాసన వ్యవస్థలోనికి న్యాయవ్యవస్థ చొరబడడడమేనని.. ఇది అవాంఛనీయ ఘటనగా పేర్కొన్నారు. రాజధానితో పాటు.. ఆ ప్రాంతంలో 3 నెలల్లోపు లక్ష కోట్ల రూపాయల విలువైన కాలువలు, రోడ్లు, నీటి సరఫరా పనులు చేయాలని.. ఆరు నెలల్లో రూ.5 లక్షల కోట్ల పనులు చేయాలంటూ కోర్టు ఇచ్చిన ఆదేశాలు అమలు చేయడం అసాధ్యమన్నారు. అసాధ్యమైన పనులు ఆరు నెలల్లో చేయాలనడం కరెక్టు కాదని చెప్పారు. ఇలాంటి తీర్పులు ఇవ్వడం సుప్రీంకోర్టు ఆదేశాలకు పూర్తి భిన్నమని తెలిపారు. రాజధాని మాస్టర్‌ ప్లాన్‌ పూర్తిగా గ్రాఫిక్స్‌లో ఉందని.. పేపర్‌కే పరిమితమై ఉందన్నారు.


మౌలిక సదుపాయాలైన రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్‌ వంటివేవీ లేని ఈ ప్రాంతంలో ఆరు నెలల్లో అభివృద్ధి చేయడం అసాధ్యమని స్పష్టం చేశారు. నాటి ప్రభుత్వం పేర్కొన్నట్లుగా 54 వేల ఎకరాల్లో.. ఎకరాకు రెండు కోట్ల రూపాయల చొప్పున లక్షా తొమ్మిది  వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉందన్నారు. 54 వేల ఎకరాల్లో నిర్మాణం చేపట్టేందుకు అన్ని కోట్లు వ్యయం చేసినా.. కనీసం నలభై ఏళ్లు పడుతుందని చెప్పారు.
అమరావతిపై నాకు ప్రేమ ఉంది..

ఈ ప్రాంతం (అమరావతి)పై తనకు ప్రేమ ఉంది కాబట్టే .. ఇక్కడే ఇంటిని నిర్మించుకున్నానని జగన్‌ తెలిపారు. అందుకే లెజిస్లేచర్‌ రాజధాని ఇక్కడే ఉంటుందని ప్రకటించానన్నారు. చంద్రబాబుకు ప్రేమ లేదు కాబట్టే ఇక్కడ ఇల్లు కట్టుకోకుండా హైదరాబాద్‌లో నిర్మించుకున్నాడని ఆరోపించారు. ఈ ప్రాంతంపై చంద్రబాబుకు ప్రేమ ఉంటే.. ఇక్కడే విజయవాడలోనో.. గుంటూరులోనో రాజధానిని నిర్మిస్తే ఆటోమేటిగ్గా అభివృద్ధి చెందేదన్నారు. తన బినామీలు 4వేల ఎకరాలు కొనుగోలు చేశాక.. ఇక్కడ రాజధానిని ప్రకటించాడని చెప్పారు. సాధ్యం కానిది సాధ్యం చేయాలని న్యాయస్థానాలు ఆదేశిస్తే ఎలాగని ప్రశ్నించారు. కోర్టుతీర్పుపై న్యాయసలహాలు తీసుకుంటామని.. ప్రత్యామ్నాయాలు ఆలోచిస్తామని వెల్లడించారు. అన్ని ప్రాంతాల అభివృద్ధి చెందేలా పరిపాలనా వికేంద్రీకరణను కొలిక్కి తీసుకొస్తామని..ఆ దిశగానే అడుగులు వేస్తామని స్పష్టం చేశారు.


ప్రేమంటే ఇదేనా?

అమరావతిలోని శాశ్వత హైకోర్టు నిర్మాణం జరపాల్సిన ప్రాంతం. పునాదుల్లో నిలిచిన నీటి కింద పిల్లర్లు, వాటి కోసం వినియోగించిన ఇనుప చువ్వలు పనికిరాకుండా పోయాయి.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.