కరోనా రోగులకు చికిత్సపై స్పష్టత కరువు

ABN , First Publish Date - 2020-07-07T07:37:17+05:30 IST

కరోనా రోగులకు చికిత్సపై స్పష్టత కరువు

కరోనా రోగులకు చికిత్సపై స్పష్టత కరువు

హైదరాబాద్‌, జూలై 6 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని కరోనా రోగులకు సేవలందించేందుకు ముందుకొచ్చిన 21 ప్రైవేటు మెడికల్‌ కాలేజీల్లో కొన్ని మాత్రమే పాజిటివ్‌ వచ్చిన వారిని చేర్చుకునేందుకు ముందుకొచ్చాయి. కార్పొరేట్‌ ఆస్పత్రులకు అనుబంధంగా ఉన్న మెడికల్‌ కాలేజీలు కరోనా రోగులకు చికిత్స అందించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేశాయి. ప్రస్తుతం హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లోని నాలుగైదు మెడికల్‌ కాలేజీలే తమ దగ్గర ఏర్పాట్లు చేయగా, మిగిలినవి మాత్రం నిర్వహణ వ్యయం భరించలేమంటున్నాయి. ఈ విషయంలో సర్కారు నుంచి స్పష్టత కోసం ఎదురు చూస్తున్నాయి. ప్రభుత్వం మాత్రం పీపీఈ కిట్లు, డ్రగ్స్‌, రోగికి భోజన సౌకర్యంతో పాటు ఒక్కో బెడ్‌కు రోజుకు రూ.1000 చొప్పున ఇస్తామని  తెలిపింది. జూలై 6 నుంచి రోగులను వైద్య కళాశాలలకు పంపుతామని ప్రకటించిన వైద్య ఆరోగ్యశాఖ.. సోమవారం ఎంతమందిని పంపారనే విషయంపై స్పష్టత ఇవ్వలేదు. ఇదిలావుంటే ఎల్బీ నగర్‌లోని కామినేని మెడికల్‌ కాలేజీలో కరోనా రోగులకు చికిత్స ప్రారంభించారు. అక్కడ ఇప్పటికే 500 పడకలు సిద్ధం చేశారు. కరోనా బారిన పడిన కోర్టు ఉద్యోగులకు అక్కడ ఉచితంగా సేవలందిస్తున్నట్లు ఆస్పత్రి ప్రతినిధులు తెలిపారు. కరోనా రోగులకు చికిత్స అందించే విషయంలో ప్రభుత్వం నుంచి ఇంకా పూర్తి స్థాయిలో మార్గదర్శకాలు తమకు అందలేదని ఆ ఆస్పత్రి ప్రతినిధులు చెప్పారు.

Updated Date - 2020-07-07T07:37:17+05:30 IST