పాటియాలాలో శివసేన, సిక్కు వర్గాల ఘర్షణ

ABN , First Publish Date - 2022-04-29T20:27:44+05:30 IST

పంజాబ్‌లోని పాటియాలాలో ఉన్న కాళీ మాత

పాటియాలాలో శివసేన, సిక్కు వర్గాల ఘర్షణ

చండీగఢ్ : పంజాబ్‌లోని పాటియాలాలో ఉన్న కాళీ మాత దేవాలయం వద్ద శివసేన కార్యకర్తలు, సిక్కు వర్గాల మధ్య శుక్రవారం అకస్మాత్తుగా ఘర్షణలు జరిగాయి. ఖలిస్థానీ గ్రూపులకు వ్యతిరేకంగా శివసేన పంజాబ్ శాఖ వర్కింగ్ ప్రెసిడెంట్ హరీశ్ సింగ్లా నేతృత్వంలో ప్రదర్శన నిర్వహించడంతో ఈ సంఘటన జరిగింది. 


ఇరు వర్గాలు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ, కత్తులను ఝళిపిస్తూ ఘర్షణలకు దిగాయి. ఇరు వర్గాలు రాళ్ళ దాడులతో పరస్పరం విరుచుకుపడ్డాయి. హరీశ్ సింగ్లా మాట్లాడుతూ, పంజాబ్‌లో ఖలిస్థానీ గ్రూపులు ఏర్పడటానికి శివసేన అవకాశం ఇవ్వబోదని చెప్పారు. పాటియాలా డిప్యూటీ కమిషనర్ సాక్షి సాహ్నీ మాట్లాడుతూ, ప్రజలు శాంతియుతంగా ఉండాలని, వదంతులను నమ్మవద్దని కోరారు. పాటియాలతోపాటు పంజాబ్ ప్రజలంతా సోదరభావంతో మెలగాలని కోరారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందన్నారు. పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. శాంతి, సామరస్యాలను కాపాడేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. 


ఈ నేపథ్యంలో పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ఇచ్చిన ట్వీట్‌లో, పాటియాలాలో జరిగిన ఘర్షణలు దురదృష్టకరమని పేర్కొన్నారు. దీనిపై తాను డీజీపీతో మాట్లాడానని చెప్పారు. ఆ ప్రాంతంలో శాంతియుత పరిస్థితులను పునరుద్ధరించినట్లు తెలిపారు. పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తున్నామని, రాష్ట్రంలో అలజడి సృష్టించేందుకు ఎవరికీ అవకాశం ఇవ్వబోమని అన్నారు. పంజాబ్‌లో ప్రశాంతత, సామరస్యం కొనసాగడానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు వివరించారు. 


Updated Date - 2022-04-29T20:27:44+05:30 IST