తలోదారి

ABN , First Publish Date - 2022-07-07T05:11:51+05:30 IST

తిరోగమన పాలన, అస్తవ్యస్త ఆర్థిక వ్యవస్థ, ప్రజా వ్యతిరేకత అంటూ మూడేళ్లలోనే అధికార పార్టీ ప్రజల్లో అపనమ్మకం మూట గట్టుకుంది. ప్రజానీకం టీడీపీ వైపు చూస్తోన్న తరుణంలో తమ్ముళ్లలోనూ నూతనో త్సాహం ఉరకలేస్తోంది.

తలోదారి

మూడు వర్గాలుగా స్థానిక నాయకులు 

సఖ్యత లేని ముద్దరబోయిన, కాపా 

ముఖం చాటేస్తోన్న అనుచర వర్గాలు

ఎవరికి వారే వేర్వేరుగా కార్యక్రమాలు 

పర్వతనేని రాకతో కార్యకర్తల్లో కదలిక


(ఏలూరు – ఆంధ్రజ్యోతి )

తిరోగమన పాలన, అస్తవ్యస్త ఆర్థిక వ్యవస్థ, ప్రజా వ్యతిరేకత అంటూ మూడేళ్లలోనే అధికార పార్టీ ప్రజల్లో అపనమ్మకం మూట గట్టుకుంది.  ప్రజానీకం టీడీపీ వైపు చూస్తోన్న తరుణంలో తమ్ముళ్లలోనూ నూతనో త్సాహం ఉరకలేస్తోంది. బయటకు రావడం లేదని విమర్శలు ఎదుర్కుంటోన్న నాయకులు సైతం వరుస కార్యక్రమాల్లో పాల్గొంటూ జగన్‌ పాలనలో లోపాల్ని చూపిస్తూ ప్రజల్లో తమపై నమ్మకాన్ని చూరగొంటున్నారు. నాయకుల కదలికలను ప్రజలు అనుక్షణం గమనిస్తోన్న ఈ కీలక తరుణంలో నూజివీడు నాయకత్వం మాత్రం తలో దిక్కుగా వెళుతోంది. ఇక్కడ నాయ కత్వంలో సఖ్యత కొరవడుతోంది. ఎవరికి వారు వేర్వేరుగా పార్టీ కార్యక్రమాలు చేపడుతున్నారు. నియోజకవర్గంలో ఉన్న సయోధ్య లేమికి తోడు కొత్త నాయకుడిగా పర్వతనేని రాక స్థానిక రాజకీయంలో కలకలం రేపుతోంది.  


రచ్చకెక్కుతోన్న నాయకులు

నియోజకవర్గంలో మొదలైన విభేదాలు చినికి చినికి గాలివానగా మారాయి. నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి ముద్దరబోయిన వెంకటేశ్వర్రావు అనుచరులు, మార్కెటింగ్‌ మాజీ కమిటీ చైర్మన్‌ కాపా శ్రీనివాసరావు అనుచరుల మధ్య రేగిన ఫేస్‌బుక్‌ వివాదం అప్పట్లో పోలీస్‌స్టేషన్‌ వరకు వెళ్లింది. ఒకరిపై మరొకరు నిందించుకోవడంతో పలు కేసులు కూడా నమోదయ్యాయి. దీంతో ఇటీవలి దాకా సఖ్యతతో ఉన్న ముద్దరబోయిన, కాపా మధ్యన ప్రస్తుతం మాటలు కూడా లేవు. ముద్దరబోయిన ఆధ్వర్యంలో కొనసాగుతోన్న పార్టీ కార్యాలయానికి కాపా వర్గం ఏ కార్యక్రమాలకు హాజరుకావడం లేదు. టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటుచేసిన రచ్చబండ, గుడివాడ నియోజక వర్గంలో ఇటీవల తలపెట్టిన కార్యక్రమానికి కూడా ఇన్‌చార్జి పట్టించుకోలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. కాగా స్థానిక నాయకత్వంపై బలమైన విమర్శలు చేస్తున్నారని కాపాపైనా పలువురు నాయకులు విమర్శిస్తున్నారు. ఇలా ఒకరిపై మరొకరు నిందించుకునే క్రమంలో ఏ వర్గం ఆర్థిక సాయం, కార్యక్రమాలు చేపట్టినా మరో వర్గం సోషల్‌ మీడియా వేదికగా వ్యతిరేక పోస్టింగులు పెట్టడం నియోజకవర్గంలో ఆనవాయితీగా మారింది. ఈ విషయాలపై నారా లోకేశ్‌ కూడా స్థానిక నాయకులను పలుమార్లు కార్యాలయానికి పిలిచి, ఫోన్ల ద్వారా హెచ్చరించారని తెలుస్తోంది. అయినా నియోజకవర్గంలో ఎలాంటి మార్పు లేదు. ఇటీవల ముగిసిన పంచాయతీ, జడ్పీటీసీ, మునిసిపల్‌ ఎన్నికల్లోనూ ఖర్చుకు వెనకాడి ఓ నాయకుడు పూర్తిగా చేతులెత్తేశారనే వాదనలు స్థానికంగా బలంగా వినిపిస్తున్నాయి. పెత్తనం కోసం తాపత్రయపడుతున్నారే తప్ప పోరాటంలో వెనకుంటున్నారనే విమర్శలు ఆయన్ను వెన్నాడుతున్నాయి. 


కీలక సమయంలో గందరగోళం

అధికార పార్టీ స్థానిక ప్రజాప్రతినిధిపై మూడేళ్లలో అనేక అవినీతి ఆరోపణలు మిన్నంటుతున్నాయి. అనుచరులకు మైనింగ్‌లు కట్టబెట్టారని, స్థానికుల భూము లను తక్కువ ధరలకు కొనుగోలు చేసి, అధిక ధరలకు ప్రభుత్వం నుంచి వసూలు చేయడంతో పాటు స్థానిక అధికారులను ప్రలోభ పరుస్తూ పలు అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారని తెలుస్తోంది. ఈ క్రమంలో రాబోయే ఎన్నికల్లో ఆయన పోటీ చేస్తే ప్రతికూల ఫలితాలు వస్తాయని భావిస్తోన్న నాయ కత్వం తన వారసుడ్ని రంగంలోకి దించాలని ప్రయత్నిస్తోంది. అయితే ఆ నాయకుడు చేసే ప్రతీ వ్యవహారం వెనుక పంచాయతీలు చేసి, ఆర్థిక వ్యవహారాలన్నీ నడిపించేది ఆ కుమారుడేనన్న విమర్శలు గడిచిన మూడేళ్లుగా నియోజకవర్గంలో వినిపిస్తున్నాయి. ఆగిరిపల్లిలో చంద్రబాబు తాజాగా పర్యటించిన సమయంలోనూ ఎమ్మెల్యే, ఆయన కుమారుడిపై స్థానిక వైసీపీ నాయకుడే ప్రజా సమక్షంలో చేసిన ఆరోపణలు అందరికీ తెలిసిందే. ఈ క్రమంలో అధికార పార్టీ ఆగడాలపై కన్నెర్న చేస్తోన్న ప్రజానీకం టీడీపీ వైపు చూస్తోంది. కానీ ప్రజా మద్దతును కూడగట్టాల్సిన సమయంలో స్థానిక నాయకత్వం ప్రజల్లో గందరగోళ పరిస్థితుల్ని సృష్టిస్తోంది.  


మూడో నాయకుడి ఆగమనం

ఈ సమయంలో నియోజకవర్గానికి చెందిన మరో నాయకుడు టీడీపీలో చొరవగా పనిచేస్తున్నారు. ముసునూరు మండలానికి చెందిన పర్వతనేని గంగాధరరావు అనే వ్యక్తి చురుగ్గా వ్యవహరిస్తున్నారు. ఇబ్బందులున్న కార్యకర్తలకు తనవంతు సాయం చేస్తున్నారు. దీంతో స్థానికంగా రెండుగా విడిపోయిన నాయకులు కూడా తమ వంతు ఆర్థిక సాయాలు విడివిడిగా మొదలుపెట్టారు. ఇటీవలే ప్రమాదం బారిన పడ్డ నెక్కలం గొల్లగూడెం వాసి అయిన మాదు గోపీతో పాటు అదే గ్రామంలో అనారోగ్యంతో బాధపడుతోన్న మరో కార్యకర్తను కలిసిన ముద్దరబోయిన ఆర్ధిక సాయం చేశారు. అలాగే చాట్రాయి మండలంలోని గొల్లగూడెంలో అనారోగ్యంతో బాధపడుతోన్న సత్యనారాయణను పరామర్శించిన గంగాధరరావు ఆర్థిక సాయం చేశారు. పలు గ్రామాల్లో ఆనారోగ్యంతో బాధపడుతోన్న వారినీ కలిసి సాయం చేశారు. వెలుగులోకి వస్తోన్న గంగాధరరావుకు స్థానిక మండల పార్టీ నాయకులతో పాటు అధికార ప్రతినిధులు కూడా మద్దతు పలుకుతున్నారు. ఆయన స్థానిక టికెట్‌ ఆశిస్తున్నారనే వాదనలు తెరపైకి వచ్చాయి. నూజివీడుపై టీడీపీపై అధిష్ఠానం దృష్టి సారించి పరిస్థితులను చక్కదిద్దాలని నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు కోరుకుంటున్నారు. 


Updated Date - 2022-07-07T05:11:51+05:30 IST