సత్తా లేదనడానికి ఇదే నిదర్శనం : రాహుల్ గాంధీ

ABN , First Publish Date - 2021-07-24T18:15:04+05:30 IST

కోవిడ్-19 వ్యాక్సినేషన్ గడువుపై ప్రధాన మంత్రి

సత్తా లేదనడానికి ఇదే నిదర్శనం : రాహుల్ గాంధీ

న్యూఢిల్లీ : కోవిడ్-19 వ్యాక్సినేషన్ గడువుపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వ స్పందనను కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్రంగా దుయ్యబట్టారు. మోదీ ప్రభుత్వానికి సత్తా లేదనడానికి, వెన్నెముక లేదనడానికి ఇదే నిదర్శనమని చెప్పారు. దేశంలో టీకాకరణ కార్యక్రమం పూర్తి కావడంపై కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో స్పందించిన తీరును తప్పుబట్టారు. 


రాహుల్ గాంధీ శనివారం ఇచ్చిన ఓ ట్వీట్‌లో, ప్రజల జీవితాలు ప్రమాదకర స్థితిలో ఉన్నాయన్నారు. భారత ప్రభుత్వం ప్రజలకు టీకాలు ఇవ్వడానికి గడువు ఏమీ లేదని చెప్తోందన్నారు. సత్తా, వెన్నెముక లేవనడానికి ఇదే నిదర్శనమని పేర్కొన్నారు. వ్యాక్సిన్లు ఎక్కడ? అని నిలదీశారు. ఈ ట్వీట్‌కు ఓ వార్తా కథనాన్ని జత చేశారు.  దేశవ్యాప్తంగా కోవిడ్-19 వ్యాక్సినేషన్ పూర్తికావడానికి నిర్దిష్టమైన గడువు ఏదీ లేదని కేంద్ర ప్రభుత్వం పార్లమెంటుకు చెప్పినట్లు ఈ కథనంలో ఉంది. 


కోవిడ్-19 టీకాకరణ పూర్తి కావడానికి సంబంధించిన వివరాలను మోదీ ప్రభుత్వం శుక్రవారం లోక్‌సభకు తెలిపింది. ఈ మహమ్మారి స్వభావం మారుతోందని, అందువల్ల టీకాకరణ కార్యక్రమం పూర్తయ్యే గడువును నిర్దిష్టంగా సూచించడం సాధ్యం కాదని తెలిపింది. అయితే 18 సంవత్సరాలు లేదా అంతకన్నా ఎక్కువ వయసుగలవారికి ఈ ఏడాది డిసెంబరునాటికి వ్యాక్సినేషన్ పూర్తవుతుందని ఆశిస్తున్నట్లు తెలిపింది. కోవిడ్ వ్యాక్సినేషన్ వేగంగా జరుగుతున్న దేశాల్లో భారత దేశం కూడా ఉందని తెలిపింది. 


Updated Date - 2021-07-24T18:15:04+05:30 IST