అంతా నా ఇష్టం..!

ABN , First Publish Date - 2021-05-07T05:25:18+05:30 IST

జిల్లా కో-ఆపరేటివ్‌ మార్కెటింగ్‌ సొసైటీ (డీసీఎంఎస్‌) అధికారి ఒకరు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. సంస్థ ఆదాయం కంటే.. సొంత లాభాలకే ప్రాధాన్యతనిస్తున్నారనీ తెలుస్తోంది.

అంతా నా ఇష్టం..!
కడప నగరంలోని డీసీఎంఎస్‌ కార్యాలయం

ఉద్యోగ నియామకాల్లో నిబంధనలకు తూట్లు

అజెండాలో పెట్టకుండా.. తీర్మానం చేసినట్లు రాసేసి పుత్రునికి ఉద్యోగం

ధాన్యం సేకరణలో జీతం, కమీషన.. రెండూ డ్రా 

జాయింట్‌ కలెక్టర్‌ అనుమతి లేకుండా జీతాలు, మెటీరియల్‌ సరఫరా, చెల్లింపులు

డీసీఎంఎ్‌సలో ఓ అధికారి భాగోతం 

సమగ్ర విచారణ చేస్తే భారీ అక్రమాలు వెలుగు చూసే అవకాశం 

(కడప-ఆంధ్రజ్యోతి): జిల్లా కో-ఆపరేటివ్‌ మార్కెటింగ్‌ సొసైటీ (డీసీఎంఎస్‌) అధికారి ఒకరు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. సంస్థ ఆదాయం కంటే.. సొంత లాభాలకే ప్రాధాన్యతనిస్తున్నారనీ తెలుస్తోంది. ఇదేమిటని కింద స్థాయి సిబ్బంది ప్రశ్నిస్తే.. తన అధికారం అడ్డుపెట్టుకుని వేధింపులకు గురి చేస్తున్నారని.. ఆయన చెప్పినట్లు వింటే అందలమెక్కిస్తాడనే ఆరోపణలు ఉన్నాయి. 2020 ఆగస్టులో డీసీఎంఎస్‌ బోర్డు సమావేశంలో అజెండాలో పెట్టకుండా, బోర్డు సభ్యులకు సమాచారం ఇవ్వకుండా ఏకంగా మినిట్స్‌ పుస్తకంలో తీర్మానం చేసినట్లు స్వయంగా రాసుకుని కొడుకుకు ఉద్యోగం ఇచ్చుకున్నాడు.


నోటిఫికేషన ఇవ్వకుండా..

డీసీఎంఎ్‌సలో ఉద్యోగాలు ఖాళీగా ఉంటే.. పై అధికారి (కాంపిటెంట్‌ అథారిటీ), బోర్డు చైర్మన లేదా పర్సన ఇనచార్జి అనుమతి తీసుకుని నియామకాలు చేపట్టాలి. ముందుగా పేపర్‌ నోటిఫికేషన ఇవ్వాలి. నిరుద్యోగుల నుంచి దరఖాస్తులు స్వీకరించి జిల్లా కలెక్టర్‌, పర్సన ఇనచార్జి ఆదేశాలతో చైర్మన, డీసీవో, మేనేజర్‌ త్రీసభ్య కమిటీ ఇంటర్వ్యూలు చేయాలి. మెరిట్‌ జాబితాను తయారు చేసి కలెక్టర్‌, బోర్డు అనుమతితో అర్హులైన అభ్యర్థులకు ఉద్యోగాలు ఇవ్వాలి. అదే క్రమంలో ఖాళీలు భర్తీ చేసే సమయంలో సంస్థ ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకోవాలి. ఈ నిబంధనలేవీ పాటించకుండా బోర్డు సభ్యులు, చైర్మనకు కనీస సమాచారం ఇవ్వకుండా గడిచిన సమావేశం మినిట్స్‌ పుస్తకంలో తీర్మానం చేసి కొడుకుకు ఉద్యోగం ఇచ్చినట్లు తెలుస్తోంది. గతేడాది ఆగస్టులో ఉద్యోగం ఇస్తే.. నవంబరులో ఏకంగా 4 నెలల జీతం డ్రా చేసినట్లు సమాచారం. ఆ సమయంలో సదురు అధికారి కొడుకు ఆఫీసులో లేడని విశ్వసనీయ సమాచారం. 


జీతంతో పాటు కమీషన కూడా డ్రా

అధికారి కొడుకును ధాన్యం కొనుగోలు కేంద్రం (ప్రొక్యూర్మెంట్‌ సెంటర్‌) ఇనచార్జిగా నియమించి 2019-20 రబీలో రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేశారు. సంస్థ ఉద్యోగి కొనుగోలు కేంద్రం ఇనచార్జిగా ధాన్యం సేకరిస్తే జీతం మాత్రమే ఇవ్వాలి. ప్రైవేటు ఏజెన్సీలు సేకరణ చేపడితే.. సంస్థకు వచ్చే కమిషనలో 50 శాతం కమిషన మాత్రమే ఇవ్వాలి. ఇందుకు విరుద్ధంగా ఉద్యోగిగా ధాన్యం సేకరించిన కొడుకు పేరుతో జీతం, కమిషన రెండూ డ్రా చేసి సంస్థ ఆదాయానికి గండి కొట్టారనే ఆరోపణలు ఉన్నాయి. అంతేకాదు.. నెల నెలా సంస్థలో పనిచేస్తున్న సిబ్బంది జీతాలు డ్రా చేయాలంటే.. పర్సన ఇనచార్జిగా ఉన్న జాయింట్‌ కలెక్టర్‌ అనుమతి (నోట్‌ ఆర్డర్‌) తప్పనిసరిగా ఉండాలి. సంస్థలో పనిచేస్తున్న మిగిలిన ఉద్యోగులందరికీ జేసీ నోట్‌ ఆర్డర్‌తో జీతాలు చెల్లిస్తే.. తన కొడుకుకు మాత్రం జేసీ నోట్‌ ఆర్డర్‌ లేకుండానే స్వయంగా జీతం డ్రా చేస్తున్నారని విశ్వసనీయ సమాచారం. అంతేకాదు.. ప్రభుత్వ సంస్థలకు అవసరమైన సరుకులు, మెటీరియల్‌ సరఫరా చేస్తే అక్కడి నుంచి వచ్చే బిల్లుల మొత్తాన్ని అమ్మకపు ఏజెన్సీలకు చెల్లించాలంటే.. పర్సన ఇనచార్జి అనుమతి తప్పనిసరి. ఇదేమీ లేకుండా సొంతంగానే చెల్లింపులు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదేమిటని ప్రశ్నిస్తే.. పర్సన ఇనచార్జి అనుమతి లేకుండా రూ.20 వేల వరకు తానే చెల్లింపులు చేయవచ్చని అంటున్నట్లు సమాచారం.


జేసీకి పలు ఫిర్యాదులు

డీసీఎంఎస్‌ సదురు అధికారిపై పర్సన ఇనచార్జిగా ఉన్న జాయింట్‌ కలెక్టర్‌కు పలు ఫిర్యాదులు వెళ్లినట్లు తెలుస్తోంది. 2019-20 ఖరీఫ్‌, 2020-21 రబీలో జిల్లాలో ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరకు వరి ధాన్యం సేకరణకు డీసీఎంఎస్‌ 9 మందిని ప్రైవేటు ఏజెన్సీలుగా నియమించింది. వారి ద్వారా ధాన్యం సేకరించింది. సేకరించిన ధాన్యం మద్దతు ధరపై ఒక్క శాతం సంస్థకు కమిషన వస్తుంది. అందులో సగం అంటే.. 0.5 శాతం ప్రైవేటు ఏజెన్సీలకు చెల్లించాలి. ఆ డబ్బులు ఇవ్వకుండా వేధిస్తున్నాడని ప్రైవేటు ఏజెన్సీలు జాయింట్‌ కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. దీనిపై జేసీ ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఎట్టకేలకు చెల్లింపులు చేశాడని సమాచారం. అలాగే ప్రైవేటు ఏజెన్సీల నియామకాల్లోనూ, గతేడాది 2020 ఏప్రిల్‌, మే నెలలో పసుపు సేకరణ, రవాణాలోనూ అక్రమాలు జరిగాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా సంస్థ అవసరాల కోసం వెచ్చించే కంటింజెంట్‌ ఫండ్స్‌ వ్యయంలోనూ అక్రమాలు జరిగినట్లు తెలుస్తోంది. సమగ్ర విచారణ చేస్తే భారీ అక్రమాలు వెలుగు చూసే అవకాశం ఉందని పలువురు పేర్కొంటున్నారు.


సమగ్ర విచారణ చేసి చర్యలు తీసకుంటా 

- గౌతమి, జేసీ, డీసీఎంస్‌ పర్సన ఇనచార్జి

డీసీఎంఎస్‌ అధికారి తన కుమారుడికి నిబంధనలకు విరుద్ధంగా ఉద్యోగంలో తీసుకోవడం, నోట్‌ ఆర్డర్‌ లేకుండా జీతాలు ఇవ్వడం, ఇతర ఆరోపణలపై ప్రత్యేక అధికారితో సమగ్ర విచారణ చేయిస్తాను. ఆరోపణలు వాస్తవమని తేలితే సంస్థ నిబంధనల మేరకు క్రమశిక్షణ, చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. సంస్థ నిబంధనలు ఉల్లంఘిస్తే ఎంతటి స్థాయి అధికారినైనా ఉపేక్షించేది లేదు.

Updated Date - 2021-05-07T05:25:18+05:30 IST