మట్టి గణపతుల తయారీపై ఫలిస్తున్న ప్రభుత్వ ప్రయత్నాలు

ABN , First Publish Date - 2022-06-21T01:55:08+05:30 IST

మహా నగరంలో అతిపెద్ద ఆధ్యాత్మిక, సాంస్కృతిక ఉత్సవం గణేష్ నిమజ్జన కార్యక్రమం. నగర సంస్కృతిలో భాగంగా ఉన్న ఈ గణేష్ నిమజ్జనాన్ని పర్యావరణ హితంగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. ఇప్పటికే, హైదరాబాద్ నగరంలో మట్టి విగ్రహాల తయారీని ప్రోత్సహిస్తోంది.

మట్టి గణపతుల తయారీపై ఫలిస్తున్న ప్రభుత్వ ప్రయత్నాలు

హైదరాబాద్: మహా నగరంలో అతిపెద్ద ఆధ్యాత్మిక, సాంస్కృతిక ఉత్సవం గణేష్ నిమజ్జన కార్యక్రమం. నగర సంస్కృతిలో భాగంగా ఉన్న ఈ గణేష్ నిమజ్జనాన్ని పర్యావరణ హితంగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. ఇప్పటికే, హైదరాబాద్ నగరంలో మట్టి విగ్రహాల తయారీని ప్రోత్సహిస్తోంది.నగరంలోని హుస్సేన్ సాగర్ తోసహా ఏ చెరువులోనూ ప్లాస్టర్ ఆఫ్ పారీస్ తో రూపొందించిన వినాయక విగ్రహాలను నిమజ్జనం చేసేందుకు అనుమతించేది లేదని హై కోర్ట్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. వాస్తవానికి హై కోర్టు ఈ ఆదేశాలు గత సంవత్సరమే ఇచ్చింది. అయితే, అతితక్కువ సమయంలో పీఓపి తో తయారు చేసిన విగ్రహాల నిమజ్జనానికి ఏర్పాట్లు చేయలేమని, ఈ సారికి అనుమతించాలని రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం కోరడంతో గత సంవత్సరం మాత్రమే చివరి నిమిషంలో హైకోర్టు అనుమతించింది.

         

హైదరాబాద్ మహానగరంలో ప్రతీ సంవత్సరం కనీసం 3 లక్షలకు పైగా గణేష్ మండపాలు పెడుతున్నారు. ఈ విగ్రహాల్లో దాదాపు 90 శాతం ప్లాస్టర్ ఆఫ్ పారీస్ తోనే తయారీ చేసినవి ఉంటున్నాయి. ఈ విగ్రహాలను ట్యాంక్ బండ్ తోసహా ఇతర చెరువుల్లో నిమజ్జనం చేయడం ద్వారా ఈ విగ్రహాల తయారీలో ఉపయోగించే జిప్సం, రసాయన కలర్లు నీటిలోని టాక్సిస్ స్థాయిలను పెంచడం ద్వారా చేపలతో సహా ఏ ఒక్క జీవాలు కూడా మనుగడ సాధించలేని పరిస్థితి నెలకొంది. పీఓపీతో తయారీని నియంత్రించేందుకు ప్రభుత్వం పెద్ద ఎత్తున చైతన్య కార్యక్రమాలను చేపట్టింది.ఈ విషయంలో హైదరాబాద్ మహా నగరంలో అతిపెద్దదైన ఖైరతాబాద్ గణేష్ ను ఈ సారి 50 అడుగుల ఎత్తులో మట్టితో తయారు చేయనున్నట్టు నిర్వాహకులు ప్రకటించడం ప్రభుత్వ కృషికి తొలి ఫలితమని చెప్పవచ్చు. 


ఇదే స్థాయిలో నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న గణేష్ విగ్రహ తయారీ దార్లను కూడా చైతన్య పర్చడంతోపాటు మట్టి వినాయక విగ్రహాల మార్కెటింగ్ కు కూడా ప్రోత్సాహం కల్పించేందుకు జీహెచ్ ఎంసీ, హెచ్ఎండీఏ, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి, బీసీ సంక్షేమ శాఖ లు తోడ్పడుతున్నాయి.అయితే, 2022 సెప్టెంబర్ మాసంలో జరిగే గణేష్ నిమజ్జన కార్యక్రమంపై రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు ఇటీవల ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించి పీఓపి తో విగ్రహాలు తయారు చేయకుండా తయారీ దారులను చైతన్య పర్చాలని, అదేవిధంగా గణేష్ పండగ నిర్వాహకులకు కూడా అవగాహన, చైతన్యం కల్పించాలని నిర్ణయించారు. దీనికి ప్రతిఫలంగా ఇప్పటికే పలువురు తయారీదారులు తాము పీఓపి తో కాకుండా మట్టితోనే విగ్రహాలు తయారుచేస్తున్నట్టు ప్రకటించారు. వినాయక ప్రతిమలను  ప్లాస్టర్ ఆఫ్ పారిస్ ప్రతిమల కన్నా మట్టి వినాయకులను కొనే వారే ఇటీవల ఎక్కువైంది.  

             

హైదరాబాద్ నగరంలో ప్రతీ సంవత్సరం దాదాపు మూడు లక్షలకు పైగా వినాయక విగ్రహాల నిమజ్జనాలు జరుగుతాయి. ప్లాస్టర్ ఆఫ్ పారీస్ తో తయారు చేసిన విగ్రహాల వల్ల జల కాలుష్యం ఏర్పడుతోందని గత కాలంగా పర్యావరణ వేత్తలు తీవ్ర ఆందోళన చేస్తున్న నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో జీహెచ్ ఎంసీ దాదాపు 30 గణేష్ నిమజ్జన కొలనులు నిర్మించింది. ఈ నిమజ్జన కొలనుల్లో గత 2021 సంవత్సరంలో 70 వేల గణేష్ విగ్రహాల నిమజ్జనం చేశారు. దీనితో, నగరంలోని చెరువుల్లో కాలుష్యం తగ్గేందుకు దోహదపడ్డాయి. కాగా, గణేష్ నిమజ్జనం ముగియగానే ఒక్క హుస్సేన్ సాగర్ చెరువులోనుండే 5800 టన్నుల పీఓపీ,ఇతర నిమజ్జన వ్యర్థాలను తొలగించారు.ఈ నిమజ్జన కొలనులు నిర్మాణం బెంగుళూరు తర్వాత కేవలం హైదరాబాద్ నగరంలోనే నిర్మించారు. 



గత నాలుగేళ్లుగా ఈ కొలనులో స్థానిక చిన్న విగ్రహాల నిమజ్జనం చేస్తూ, స్థానిక  చెరువులలో చెయ్యకపోవడం గణనీయంగా కాలుష్య నివారణకు తోడ్పడుతున్నాయి. వీటికితోడు, నగరంలోని ప్రతీ మున్సిపల్ సర్కిల్ లో ఉన్న చెరువులు, కుంటల వద్ద అదే విధమైన నిమజ్జన కొలనులు (బేబీ పాండ్స్ ) పెద్ద ఎత్తున నిర్మించాల్సి ఉంది. హైదరాబాద్ నగరంలో ఒక్క ధూల్ పేట్ మినహా మిగిలిన ప్రాంతాల్లో పీఓపీ తో గణేష్ విగ్రహాల తయారీ దారుల్లో ఒక్క రాజస్థాన్ రాష్ట్రం నుండే మెజారిటీ తయారీదారులున్నారు. హైదరాబాద్ నగరం లో 1975 నుండి గణేష్ విగ్రహాల తయారీ పీఓపీ తో తయారు చెయడం మొదలైంది.

            

అయితే, ఇన్నేళ్ళనుండి వస్తున్నా ఈ తయారీని ఒక్కసారిగా తగ్గించేందుకు కష్టతరమైనా ఈ ప్రయత్నంలో అన్ని ప్రభుత్వ శాఖలు, స్వచ్ఛంద సంస్థలను ఇన్వాల్వ్ చేస్తున్నారు.  దీనికి గణేష్ ఉత్సవ సమితి కూడా పూర్తి స్థాయిలో సహకరించాలి. గత 2021  సంవత్సరం, కోవిద్ మహమ్మారి భయం వల్ల గణేష్ విగ్రహాల ప్రతిష్ట చాలా తక్కువ అయ్యాయి. ఈ సంవత్సరం ఈ సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే,  నగరంలోని పలు కాలనీలు, అపార్ట్ మెంట్ లలో ఇప్పటికే మట్టి గణపతులను తయారు చేయడం ప్రారంభమైంది.  ఇళ్లలో కూడా ఈ సంస్కృతీ ప్రారంభమైంది. కాగా, రాష్ట్రంలోనే అతిపెద్దదైన ఖైరతాబాద్ వినాయకుడిని మట్టితోనే తయారు చేసి, నిమజ్జనం కూడా  ప్రతిష్టాపన ప్రదేశంలోనే నిమజ్జనానికి ఏర్పాట్లు చేస్తామని ఖైరతాబాద్  గణేష్ ఉత్సవ కమిటీ గత సంవత్సరమే ప్రకటించింది. 


ఈసారి జీహెచ్ ఎంసీ ద్వారా మట్టి వినాయకులు, హెచ్ఎండీఏ ద్వారా ఐదు లక్షలు, కాలుష్య నియంత్రణ మండలి ద్వారా రెండు లక్షల మట్టి విగ్రహాల తయారీ చేసి హైదరాబాద్ నగర పౌరులకు ఉచితంగా పంచేందుకై చర్యలు తీసు కుంటున్నాయి. ఇప్పటికే జీహెచ్ ఎంసీ  అధికారులు సర్కిళ్ల స్థాయిలో ఈ మట్టి విగ్రహాల తయారీని ఇప్పటికే ప్రారంభించారు. హుస్సేన్ సాగర్ ను పూర్తిగా శుద్ధి చేసి తిరిగి పూర్వవైభవం తేవాలని రాష్ట్ర ప్రభుత్వం గతంలోనే ప్రకటించింది. దీనికనుగుణంగా హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో కాలుష్య నివావన చర్యలను చేపడుతోంది. 

    

Updated Date - 2022-06-21T01:55:08+05:30 IST