ఆర్యన్‌కు క్లీన్‌చిట్‌

ABN , First Publish Date - 2022-05-28T07:31:59+05:30 IST

గత ఏడాది దేశంలో సంచలనం రేపిన ముంబై తీరంలోని క్రూయిజ్‌ నౌకలో డ్రగ్స్‌ వినియోగం కేసుకు సంబంధించి బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ షారుక్‌ ఖాన్‌ కుమారుడు, 23 ఏళ్ల ఆర్యన్‌ ఖాన్‌కు నార్కోటిక్‌ కంట్రోల్‌ బ్యూరో(ఎన్సీబీ) క్లీన్‌ చిట్‌ ఇచ్చింది.

ఆర్యన్‌కు క్లీన్‌చిట్‌

డ్రగ్స్‌ కేసులో షారుక్‌ కుమారుడి పాత్ర లేదన్న ఎన్సీబీ

మరో ఐదుగురికీ ఉపశమనం

వాంఖడే విచారణ లోపభూయిష్టం

ఆందోళన వ్యక్తం చేసిన ఎన్సీబీ చీఫ్‌

సమీర్‌ వాంఖడేపై కేంద్రం సీరియస్‌


డ్రగ్స్‌ కేసులో 

షారుక్‌ కుమారుడి పాత్ర ఎంతమాత్రం లేదన్న ఎన్సీబీ

మరో ఐదుగురికీ ఉపశమనం


ముంబై/న్యూఢిల్లీ, మే 27: గత ఏడాది దేశంలో సంచలనం రేపిన ముంబై తీరంలోని క్రూయిజ్‌ నౌకలో డ్రగ్స్‌ వినియోగం కేసుకు సంబంధించి బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ షారుక్‌ ఖాన్‌ కుమారుడు, 23 ఏళ్ల ఆర్యన్‌ ఖాన్‌కు నార్కోటిక్‌ కంట్రోల్‌ బ్యూరో(ఎన్సీబీ) క్లీన్‌ చిట్‌ ఇచ్చింది. ఆర్యన్‌తోపాటు మరో ఐదుగురికి కూడా ఈ కేసులో ప్రమేయం లేదని స్పష్టం చేసింది. వీరు మాదకద్రవ్యాలు వినియోగించినట్టు ఎలాంటి ఆధారాలు లేవని పేర్కొంది. ఈ మేరకు ముంబై కోర్టులో ఎన్సీబీ 6 వేల పేజీల చార్జ్‌షీట్‌ను దాఖలు చేసింది. అయితే, గత ఏడాది వెలుగు చూసిన ఈ కేసులో ఆర్యన్‌ను అరెస్టు చేసిన అధికారులు జైలుకు తరలించిన విషయం తెలిసిందే. మొత్తం 22 రోజుల పాటు ఆర్యన్‌ జైల్లో ఉన్నారు. తర్వాత బెయిల్‌పై వచ్చారు. చార్జిషీట్‌పై ఎన్సీబీ చీఫ్‌ ఎస్‌.ఎన్‌ ప్రధాన్‌ ఢిల్లీలో మాట్లాడుతూ.. ‘‘మొత్తం 14 మందిపై బలమైన ఆధారాలు సేకరించాం. ఆర్యన్‌ స హా ఆరుగురిపై ఎలాంటి ఆధారాలు లభించలేదు. ప్రాథమిక దర్యాప్తులో అన్ని విషయాలను పరిగణనలో కి తీసుకున్నాం’’ అని వివరించారు.


ఆర్యన్‌ తరఫు న్యాయవాది ముకుల్‌ రోహత్గీ మాట్లాడుతూ.. ‘‘నా క్లయింట్లకు ఉపశమనం లభించింది. సత్యమే గెలిచింది. ఆర్యన్‌ను అరెస్టు చేయడానికి, ప్రశ్నించడానికి కూడా ఎన్సీబీకి ఎలాంటి ఆధారాలు లభించలేదు’’ అని వివరించారు. ఎన్సీబీ తన తప్పును ఒప్పుకొందని.. ఆర్యన్‌కు వ్యతిరేకంగా ముందుకు వెళ్లేందుకు వారికి ఎలాంటి కారణాలు కనిపించలేదని చెప్పారు. ‘ఒక లక్ష్యం’ పెట్టుకునే కేసులు నమోదు చేశారని విమర్శించారు. కాగా, నిరుడు అక్టోబరు 2న ఎన్సీబీ ముంబై అధికారులు ఈ కేసుతో సంబంధం ఉందంటూ.. ఆర్యన్‌ సహా 8 మందిని అరెస్టు చేశారు. వీరిలో ఆర్యన్‌, మొహక్‌ జైస్వాల్‌ మినహా మిగిలివారి వద్ద మాదకద్రవ్యాలు ఉన్నట్టు అధికారులు చెప్పారు. దీంతో వారిని అరెస్టు చేసి జైలుకు తరలించారు. 26 రోజుల అనంతరం అక్టోబరు 30న ఆర్యన్‌ బెయిల్‌పై బయటకు వచ్చారు. ఈ క్రమంలో ఈ ఏడాది మార్చిలో ఎన్సీబీ చార్జిషీట్‌ దాఖలు చేసేందుకు మరో 60 రోజుల సమయం ఇస్తూ ప్రత్యేక కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, ఈ కేసును మొదట్లో ఎన్సీబీ ప్రాంతీయ కార్యాలయ ఐఆర్‌ఎస్‌ అధికారి సమీర్‌ వాంఖడే విచారించారు. కానీ, గత ఏడాది నవంబరు 6న ఈ కేసు విచారణ నుంచి వాంఖడేను తప్పిస్తూ ఎన్సీబీ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేయడంతోపాటు ఢిల్లీ సిట్‌కు ఈ కేసును అప్పగించారు. ఈ నేపథ్యంలో డిప్యూటీ డైరెక్టర్‌ జనరల్‌ సంజయ్‌ కుమార్‌ సింగ్‌ నేతృత్వంలోని బృందం ఈ కేసును విచారించింది. సిట్‌ అధికారులు ఈ కేసులో మొత్తం 6 వేల పేజీల చార్జిషీట్‌ను దాఖలు చేశారు. మొత్తం 14 మందిని నిందితులుగా పేర్కొన్నారు. ఆర్యన్‌ సహా ఆరుగురి పాత్ర లేదని తేల్చి చెప్పారు. 


వాంఖడేకు బిగిస్తున్న ఉచ్చు!

ఆర్యన్‌ను నిర్దోషిగా ప్రకటిస్తూ ఎన్సీబీ చార్జిషీట్‌లో పేర్కొంది. అయితే.. ఈ కేసును మొదట్లో విచారించిన సమీర్‌ వాంఖడేకు ఇప్పుడు ఉచ్చు బిగిస్తోంది. కేసు విచారణను ఏకపక్షంగా నిర్వహించడం, నకిలీ కుల ధ్రువీకరణ పత్రం సమర్పించడం వంటివాటిపై విచారణ చేస్తామని ఎన్సీబీ చీఫ్‌ ఎస్‌ఎన్‌ ప్రధాన్‌ వెల్లడించారు. ఆర్యన్‌ మాదక ద్రవ్యాలు తీసుకున్నారని వైద్య పరీక్షల్లో నిరూపించలేక పోయారని, సెర్చ్‌ ఆపరేషన్లు జరిగినప్పుడు వీడియోలు చిత్రీకరించలేదని పేర్కొన్నా రు. ఆర్యన్‌ ఫోన్‌ స్వాధీనం చేసుకోవడంలో తప్పులు దొర్లాయన్నారు. తనతో ఖాళీ పత్రాలపై సంతకాలు చేయించుకున్నట్టు ఒకరు చెప్పడం, అసలు ఆ సమయంలో తాము క్రూయిజ్‌లో లేమని మరో ఇద్దరు వెల్లడించడం సహా అందరిపైనా ఒకే తరహా కేసులు నమోదు చేయడం వంటివి విచారణలో తీవ్ర లోపాలుగా పేర్కొన్నారు. సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని, ఇప్పటికే విచారణ బృందాన్ని నియమించామని ఆయన వెల్లడించారు. అదేసమయంలో కేవలం వాట్సాప్‌ సందేశాల ఆధారంగా ఆర్యన్‌పై డ్రగ్స్‌ వినియోగదారుడనే ముద్ర వేయడం సరికాదన్నారు. ‘‘ఇది చాలా తప్పు. కోర్టు ముందు చేతులు కట్టుకునే పరిస్థితి’’ అని వ్యాఖ్యానించారు. కాగా, ఐఆర్‌ఎస్‌ అధికారి వాంఖడేపై కేంద్రం సీరియ్‌స అయింది. డ్రగ్స్‌ కే సు విచారణను తప్పుదోవ పట్టించడం.. ప్రభుత్వ ఉద్యో గం పొందేందుకు నకిలీ కుల ధ్రువీకరణ పత్రం సమర్పించడం వంటివాటిని తీవ్రంగా పరిగణిస్తున్నట్టు అఽ దికారులు తెలిపారు. వాంఖడేపై విచారణకు కేంద్ర హోం, ఆర్థిక శాఖలను ఆదేశించినట్టు చెప్పారు. 


ఈ గాయానికి ఎవరు బాధ్యులు?: ఎన్సీపీ

ఆర్యన్‌కు ఎన్సీబీ క్లీన్‌చిట్‌ ఇవ్వడంపై మహారాష్ట్ర అధికార పక్షం ఎన్సీపీ పలు ప్రశ్నలు సంధించింది. ఆర్యన్‌కు జరిగిన గాయానికి ఎవరు బాధ్యులని నిలదీసింది. ఈ కేసుకు సంబంధించి ప్రజలకు వాంఖడే బదులివ్వాలని డిమాండ్‌ చేసింది. మహావికాస్‌ అఘాడీ నేతృత్వంలోని సర్కారుపై జరుగుతున్న భారీ కుట్రలో ఈ కేసు ఓ భాగమని ఆరోపించింది.  

Updated Date - 2022-05-28T07:31:59+05:30 IST