స్థానిక సంస్థల స్వచ్ఛ పరికరాలను జీఎస్టీ నుంచి మినహాయించాలి

ABN , First Publish Date - 2022-06-30T10:42:08+05:30 IST

హైదరాబాద్‌, జూన్‌ 29 (ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల విధుల కోసం అందించే స్వచ్ఛ పరికరాలను వస్తు సేవల పన్ను (జీఎస్టీ) నుంచి

స్థానిక సంస్థల స్వచ్ఛ పరికరాలను  జీఎస్టీ నుంచి మినహాయించాలి

 చండీగఢ్‌ జీఎస్టీ మండలి భేటీలో మంత్రి హరీశ్‌రావు డిమాండ్‌

హైదరాబాద్‌, జూన్‌ 29 (ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల విధుల కోసం అందించే స్వచ్ఛ పరికరాలను వస్తు సేవల పన్ను (జీఎస్టీ) నుంచి మినహాయించాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి టి.హరీశ్‌రావు జీఎస్టీ మండలిని కోరారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ అధ్యక్షత ఈ నెల 28, 29 తేదీల్లో చండీగఢ్‌లో జరిగిన జీఎస్టీ మండలి సమావేశంలో అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రులతోపాటు హరీశ్‌రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన పలు అంశాలను కౌన్సిల్‌ దృష్టికి తెచ్చారు. పంచాయతీలు, మునిసిపాలిటీలు, కార్పొరేషన్లకు అందించే స్వచ్ఛ పరికరాలపై జీఎస్టీ విధిస్తుండడంతో స్థానిక సంస్థలపై పెనుభారం పడుతుందన్నారు. ఇప్పటికే స్థానిక సంస్థలు ఆర్థిక స మస్యలతో సతమతమవుతున్నాయని, జీఎస్టీ భారంతో మరింత కుంగిపోతాయని తెలిపారు. స్వచ్ఛ పరికరాలకు మినహాయింపుపై వివరణాత్మక అధ్యయనం కోసం ఫిట్‌మెంట్‌ కమిటీకి పంపి కొత్త ప్రతిపాదనను రూపొందించాలని కోరారు. క్యాసినోలు, గుర్రపు పందాలు, ఆన్‌లైన్‌ గేమింగ్‌లపై మంత్రుల బృందం (జీవోఎం) ప్రతిపాదనలను గోవా అభ్యర్థన మేరకు అంగీకరించినా.. గుర్రపు పందాల అంశాన్ని మళ్లీ జీవోఎంకు పంపాలని కోరారు. ఇందుకు నిర్మలా సీతారామన్‌ అంగీకరించారని హరీశ్‌రావు ఓ ప్రకటనలో తెలిపారు. దీనిపై జూలై 15లోగా నివేదిక ఇవ్వాలని ఆదేశించినట్టు చెప్పారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో పన్ను చెల్లింపుదారుల చిరునామాలను అప్‌డేట్‌ చేయకపోవడం వల్ల తెలంగాణకు రావాల్సిన ఆదాయం నష్టపోవాల్సి వస్తోందని తెలిపారు. కొంతమంది పన్ను చెల్లింపుదారుల రికార్డుల్లోని కస్టమర్‌ చిరునామాలు తెలంగాణలో ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్‌ చిరునామాతోనే కొనసాగుతున్నాయని, ఫలితంగా తాము పన్ను రాబడిని కోల్పోతున్నామని కౌన్సిల్‌కు వివరించారు. ఈ విషయంలో ప్రతిపాదిత కొత్త 3బీ ఫారంలో ప్రతికూల విలువల (నెగెటివ్‌ వాల్యూ)ను అనుమతిస్తున్నందుకు హరీశ్‌ కౌన్సిల్‌కు ధన్యవాదాలు తెలిపారు. ఐజీఎస్టీని రికవరీ చేయడం, రాష్ట్రం వెలుపల ఉన్న పన్ను చెల్లింపుదారుల టాక్స్‌ జురిస్డిక్షన్‌ విషయంలో మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఢిల్లీ రాష్ట్రాల అధికారుల సహకారం కావాలని కోరారు. ఈ విషయంలో ఏపీ, మహారాష్ట్ర, కర్ణాటక అధికారులతో సమావేశం నిర్వహించి సమస్యను పరిష్కరించాలన్నారు. జీఎస్టీ అప్పిలేట్‌ ప్రతిపాదిత నిబంధనలు గజిబిజిగా ఉన్నాయని, ఆచరణాత్మకంగా లేవని చెప్పారు. దీంతో అంగీకరించిన చైర్‌పర్సన్‌ పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. 

1న ‘జీఎస్టీ డే’ బహిష్కరణ

తమ సమస్యలను పరిష్కరించాలన్న డిమాండ్‌తో జూలై 1న దేశవ్యాప్తంగా నిర్వహించనున్న ‘జీఎస్టీ డే’ను బహిష్కరిస్తున్నట్లు ఆల్‌ ఇండియా అసోసియేషన్‌ ఆఫ్‌ సూపరింటెండెంట్స్‌ ఆఫ్‌ సెంట్రల్‌ ట్యాక్స్‌ అధ్యక్షుడు హెచ్‌ఎస్‌ బజాజ్‌, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ బి.పవన్‌కుమార్‌రెడ్డి, సెక్రటరీ జనరల్‌ ఎంఏ జితేంద్ర ఓ ప్రకటనలో తెలిపారు. జీఎస్టీ రాకతో అధికారులపై పనిభారం పెరిగిందని, ఐదేళ్ల నుంచి ఎలాంటి ప్రమోషన్లు కల్పించడంలేదన్నారు. ఒక్కో అధికారి ఒక్క ప్రమోషన్‌తోనే 35 ఏళ్ల సర్వీసును పూర్తి చేసి రిటైర్‌ అవుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. 

Updated Date - 2022-06-30T10:42:08+05:30 IST