కొండెక్కిన టమోటా

ABN , First Publish Date - 2021-11-19T06:20:15+05:30 IST

రైతులకు టమోటా పంట సిరులు కురిపిస్తోంది. గత కొన్ని రోజులుగా ఎడతెరిపిలేని భారీ వర్షాల వల్ల మార్కెట్‌లో టమోటా దొరకడం కూడా కష్టమైపోయింది.

కొండెక్కిన టమోటా
మార్కెట్‌కు వచ్చిన టమోటాలు

భారీగా పెరిగిన ధరలు

మొదటి రకం 15 కిలోల బాక్స్‌ రూ.1000

రైతు మోములో వెల్లివిరుస్తోన్న సంతోషం

భారీ వర్షాలకు ఉత్పత్తులు తగ్గటమే కారణం 

అనంతపురంరూరల్‌, నవంబరు18: రైతులకు టమోటా పంట సిరులు కురిపిస్తోంది. గత కొన్ని రోజులుగా ఎడతెరిపిలేని భారీ వర్షాల వల్ల మార్కెట్‌లో టమోటా దొరకడం కూడా కష్టమైపోయింది. దీంతో వాటి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. గత మూడు నాలుగేళ్లుగా టమోటా రైతులు నిలకడలేని ధరలతో కుదేలయ్యారు. వేలాది రూపాయలు పెట్టుబడులు పెట్టి నష్టపోయారు. కూలీల ఖర్చులకు కూడా గిట్టుబాటు కాక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. చాలా సందర్భాల్లో పంటను పొలాల్లో వదిలేశారు.  ప్రస్తుతం మాత్రం టమోటా సాగు చేసిన రైతుల ఇంట సిరులు కురుస్తున్నాయి. అనంతపురం కక్కలపల్లి టమోటా మార్కెట్‌లో మొదటి రకం టమోటా 15కిలోల బాక్స్‌ రూ.1000లు పలుకుతోంది. 


భారీగా పెరిగిన ధరలు..

గత మూడు నాలుగేళ్లతో పోలిస్తే టమోటా ధరలు భారీగా పెరిగాయి. నాలుగేళ్ల కిందట స్థానిక మార్కెట్‌లో 15 కిలోల బాక్సు రూ.800 పలికింది. ఆ తరువాత ఆ స్థాయి ధరలు ఎన్నడూ పలుకలేదు. మళ్లీ ఇప్పుడు ఆ స్థాయికి ధరలు చేరాయి. వాతావరణంలో నెలకొన్న మార్పులు, ఎడతెరిపిలేని వర్షాలే ధరల పెరుగుదలకు కారణంగా చెప్పుకోవచ్చు. పంటసాగు కూడా ప్రస్తుతం ఆశించిన విధంగా లేదు. వర్షాలకు కాయల్లో నాణ్యత లేకపోవడం, కాయలపై మచ్చలు ఏర్పడుతున్నాయి. ఈ క్రమంలో ఉత్పత్తులు తగ్గిపోయాయి. దీంతో ధరలు అమాంతం పెరిగిపోయాయి. ప్రస్తుతం మార్కెట్‌లో 15 కిలోల బాక్సు రూ.900 నుంచి రూ.1000 మధ్య పలుకుతున్నాయి ద్వితీయ రకం కాయలు రూ. 650 నుంచి రూ.800 మధ్య పలుకుతున్నాయి. తృతీయ రకం కాయలు రూ.300 నుంచి రూ.500 మధ్య ధర ఉంటోంది. గతంలో మచ్చల కాయలు, ఇతరత్రా కాయలు మార్కెట్‌ల్లో పారబోసేవారు.  ప్రస్తుతం ఆ కాయలు కూడా రూ.150 నుంచి రూ.200 మధ్య ధర పలుకుతుండటం గమనార్హం.


తగ్గిన ఉత్పత్తులు..

తగ్గిన ఉత్పత్తుల కారణంగా టమోటా ధరలు పెరిగిపోయాయి. జిల్లాలో అనంతపురం కక్కలపల్లి టమోటా మార్కెట్‌తో పాటు, కళ్యాణదుర్గం, ముదిగుబ్బ తదితర ప్రాంతాల్లో టమోటా వ్యాపారం సాగుతోంది. అయితే ప్రస్తుతం ఉత్పత్తులు తగ్గిపోవడంతో ఆయా ప్రాంతాల్లో టమోటా వ్యాపారం పడిపోయింది. కక్కలపల్లి టమోటా మార్కెట్‌కు ఉత్పత్తులు భారీగా తగ్గిపోయాయి. నెల రోజుల కిందట వరకు మండీలకు 10 వేలు, 20 వేల బాక్సులు వచ్చేవి. ప్రస్తుతం పెద్ద మండీలలో సైతం 5 వేలు దాటడం లేదు. దీన్ని బట్టి చూస్తే టమోటా ఉత్ప త్తులు ఏమేరకు తగ్గాయో అర్థం చేసుకోవచ్చు. ఇదే పరిస్థితి ఈనెలాఖరి వరకు ఉంటుందని ఆయా వర్గాలు చెబుతున్నాయి. ఇదిలా ఉండగా.. బహిరంగ మార్కెట్‌లో కిలో రూ.80 నుంచి రూ.100 పలుకుతుండటంతో వినియోగదారులు బెంబేలెత్తిపోతున్నారు.


బాక్సు రూ.520తో అమ్ముడు పోయాయి 

మాది బెళుగుప్ప మండలం కాల్వపల్లి. గతంలో రెండు ఎకరాల్లో పంట సాగు చేసి నష్టపోయా. ధరలు లేని కారణంగా రూ.70వేలు నష్టం వాటిల్లింది. పంటను తొలగించి తిరిగి సాగు చేశా. పంట ఇటీవల చేతికొచ్చింది. రెండో కోత కోసి 40 బాక్సులు మార్కెట్‌కు తీసుకువచ్చా. రేటు బాగానే పలికింది. బాక్సు రూ.520తో అమ్ముడుపోయాయి. రానున్న రోజుల్లోను ధరలు ఇలానే ఉంటే నష్టాల నుంచి బయట పడే అవకాశం ఉంటుంది.

-  సంగమేష్‌, రైతు, కాలవపల్లి, బెళుగుప్ప మండలం

Updated Date - 2021-11-19T06:20:15+05:30 IST