ముగిసిన ఎయిడెడ్‌ ప్రస్థానం!

ABN , First Publish Date - 2021-12-04T06:20:33+05:30 IST

ఇంటర్మీడియెట్‌ విద్యావ్యవస్థలో ఎంతో ఘన చరిత్ర కలిగి.. ఎందరో విద్యార్థుల ఉన్నత చదువులకు బీజం వేసిన ఎయిడెడ్‌ జూనియర్‌ కళాశాలలు పూర్తిగా కనుమరుగయ్యాయి.

ముగిసిన ఎయిడెడ్‌ ప్రస్థానం!

ఎయిడెడ్‌ జానియర్‌ కాలేజీలు ఇక లేనట్టే!

ప్రభుత్వంలోకి 58మంది ఉద్యోగుల చేరిక 


తిరుపతి(విద్య), డిసెంబరు 3: ఇంటర్మీడియెట్‌ విద్యావ్యవస్థలో ఎంతో ఘన చరిత్ర కలిగి.. ఎందరో విద్యార్థుల ఉన్నత చదువులకు బీజం వేసిన ఎయిడెడ్‌ జూనియర్‌ కళాశాలలు పూర్తిగా కనుమరుగయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో 2021-22 విద్యాసంవత్సరంలో ఈ పరిస్థితి తలెత్తింది. నాలుగు దశాబ్దాల కిందట జిల్లాలో ఏర్పాటైన ఆ కాలేజీలు తొలినాళ్లలో పేద, మధ్య తరగతికి చెందిన వివిధ వర్గాల విద్యార్థులతో కళకళ లాడుతూ వచ్చాయి. ఈ క్రమంలో జిల్లాలో ప్రైవేట్‌ కళాశాలల రాకతో వాటితో పోటీపడి విద్యను అందించి తమ ఉనికిని నిలుపుకుంటూ వచ్చాయి. రెండేళ్ల కిందట అధికారంలోకి వచ్చిన వైసీపీ ఆ ఎయిడెడ్‌ కళాశాలల మెడపై విలీనం పేరుతో కత్తికట్టింది. రాష్ట్రంలోని ఎయిడెడ్‌ విద్యాసంస్థలను ప్రభుత్వ వ్యవస్థలోకి విలీనం చేసేలా ఈ ఏడాది ఆగస్టులో ఆర్డినెన్స్‌, జీవోను తెచ్చారు. ప్రొసీడింగ్స్‌ కూడా ఇచ్చారు. దీంతో ఎయిడెడ్‌ జూనియర్‌ కళాశాలల ఉద్యోగులు జిల్లా వృత్తి విద్యాశాఖాధికారి కంట్రోల్‌లోకి వెళ్లారు. ఇందులో భాగంగా ఎయిడెడ్‌లలో పనిచేసే ఉద్యోగులు, ఆ సంస్థల ఆస్తులను పూర్తిగా ప్రభుత్వానికి అప్పగిస్తే వారి పేరుమీద ప్రభుత్వమే కళాశాలలు నడుపుతుందని, లేకుంటే ఉద్యోగులను మాత్రమే ప్రభుత్వంలోకి విలీనం చేస్తే, ప్రైవేట్‌ అన్‌ఎయిడెడ్‌గా నిర్వహించుకోవచ్చని ప్రతిపాదించారు. ఈ రెండింటికి ముందుకు రాకపోతే గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ ఇచ్చేదిలేదని తేల్చి చెప్పారు. కాగా ప్రభుత్వంలో విలీనానికి కొందరు ఉద్యోగులు సంతృప్తి చెందినా.. దశాబ్దాలుగా ఉన్న కళాశాలకు గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ నిలుపుదల చేస్తామన్న నిర్ణయంపై విద్యార్థి, ప్రజా సంఘాలు ఆందోళన చేపట్టాయి. దీనిపై కొందరు హైకోర్టును ఆశ్రయించడంతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పునిచ్చింది. దీంతో కోర్టు ఉత్తర్వులను బేస్‌ చేసుకుని గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ ఆపేదిలేదని తిరిగి ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. అప్పటికే గవర్నమెంట్‌ వ్యవస్థలోకి వెళ్లిన ఉద్యోగులు సంతృప్తి చెంది కౌన్సెలింగ్‌ ద్వారా ప్రభుత్వంలోకి మెర్జ్‌ అయ్యారు. ఈ క్రమంలో జిల్లాలో మూడు కళాశాలలకు చెందిన ఉద్యోగులు ప్రభుత్వంలోకి చేరడంతో ఆ కళాశాలలు ఈ ఏడాది నుంచి ప్రైవేట్‌ అన్‌ ఎయిడెడ్లుగా మారాయి. ఇంతకముందే జిల్లాలో ఉన్న మరోరెండు ప్రైవేట్‌ ఎయిడెడ్‌ (ద్వారకనాథ జూనియర్‌, బీటీ కళాశాల) కళాశాలలు సిబ్బంది లేకుండా మూతపడిన విషయం తెలిసిందే. ఇప్పుడు మిగిలి ఉన్న మరో మూడు కళాశాలలు కూడా ప్రైవేట్‌ అన్‌ ఎయిడెడ్‌గా మారడంతో జిల్లాలో ఎయిడెడ్‌ కళాశాలల ప్రస్థానం ముగిసింది. కొన్ని దశాబ్దాలుగా నామమాత్రపు ఫీజులతో నాణ్యమైన విద్యతో పాటు, తమ పిల్లలకు అందుబాటులో ఉండే ఆ కాలేజీలు ఇక లేవన్న విషయాన్ని విద్యార్థుల తల్లిదండ్రులు జీర్ణించుకోలేక పోతున్నారన్నది కాదనలేని నిజం. 


ప్రభుత్వ కళాశాలల్లో 58మంది చేరిక


జిల్లాలో మూడు ఎయిడెడ్‌ కళాశాలలో పనిచేసే బోధన, బోధనేతర ఉద్యోగులు 58మంది కౌన్సెలింగ్‌ ద్వారా ప్రభుత్వ విద్యావ్యవస్థలోకి వచ్చారు. వీరికి గతనెల 18న బదిలీలు జరిపారు. 30వ తేది సాయంత్రం ఆర్డర్స్‌ ఇవ్వగా.. డిసెంబరు ఒకటిన తమకు కేటాయించిన కాలేజీల్లో వారు విధులలో చేరారు. ఇతర జిల్లాల నుంచి కౌన్సెలింగ్‌ ద్వారా మరో 18మంది ఉద్యోగులు జిల్లాకు వచ్చారు. వీరితో కలిపి జిల్లాకు 76మంది ఉద్యోగులు వచ్చారని డీవీఈవో శ్రీనివాసులరెడ్డి పేర్కొన్నారు. వీరిలో 39మంది బోధన, 37మంది బోధనేతర ఉద్యోగులు ఉన్నారన్నారు. ఈ ఏడాది రేణిగుంటలో శ్రీనివాస జూనియర్‌, తిరుపతిలో ఏజీఎస్‌ జూనియర్‌ కాలేజీలలో విద్యార్థులు ప్రవేశాలు పొందారు. ఇకనుంచి ఈ కళాశాలలు ప్రైవేట్‌ అన్‌ ఎయిడెడ్‌గా కొనసాగుతాయి. తిరుచానూరు కాలేజీలో ఈ ఏడాదిలో అడ్మిషన్లు లేవు. మదనపల్లెలోని బీటీ కాలేజీలోనూ స్టాఫ్‌ లేని కారణంగా అది కూడా ప్రైవేట్‌ అన్‌ ఎయిడెడ్‌గా కొనసాగుతుంది. దీంతో ఈ ఏడాది నుంచి మన జిల్లాలో ఎయిడెడ్‌ జూనియర్‌ కళాశాలలు లేవని డీవీఈవో తెలిపారు. 


ఎయిడెడ్ల ప్రస్థానం ఇలా.. 


తిరుపతి పరిసరాల్లో రేణిగుంట, తిరుచానూరు, తిరుపతి ప్రాంతాలలో 1980వ దశకం నుంచి 2021వరకు మూడు ఎయిడెడ్‌ జూనియర్‌ కాలేజీలు ఇంటర్‌ విద్యలో పలు కోర్సులను ఆఫర్‌ చేస్తూ కొనసాగాయి. వీటిలో రేణిగుంటలో 1980లో శ్రీనివాస జూనియర్‌ కళాశాల (కోడ్‌ 09051), తిరుచానూరులో 1982లో శ్రీనివాస జూనియర్‌ (09039), తిరుపతిలో 1983లో ఏజీఎస్‌ (09037) పేరుతో ఎయిడెడ్‌ జూనియర్‌ కళాశాలలు ఏర్పాటయ్యాయి. 1990వరకు పలు కోర్సుల్లో ఒక్కో కాలేజీలో వెయ్యికి తక్కువగా లేకుండా విద్యనభ్యసించేవారు. 1990నుంచి 2000వరకు 800 మంది.. 2000-2015వరకు ఏటా దాదాపు 500మంది విద్యార్థులు చదివేవారు. అప్పటి నుంచి గడిచిన విద్యాసంవత్సరం వరకూ ఆ కాలేజీల్లో దాదాపు 300మంది వరకు చదివేవారని సమాచారం.

Updated Date - 2021-12-04T06:20:33+05:30 IST