సరిహద్దు గేట్లు ఎత్తేశారు!

ABN , First Publish Date - 2022-05-23T05:20:30+05:30 IST

సరిహద్దు ప్రాంతాల్లో చెక్‌పోస్టులు మూతపడడంతో అక్రమార్కుల ఇష్టారాజ్యం కొనసాగుతోంది. ఇసుక, మద్యం, గంజాయి తదితర వస్తువుల అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు రెండేళ్ల కిందట ఏర్పాటు చేసిన చెక్‌పోస్టులను అర్థాంతరంగా ఎత్తివేశారు. దీంతో జిల్లాలో 129 మంది ఎస్పీవోలు రోడ్డున పడ్డారు. చెక్‌పోస్టుల వద్ద తనిఖీలు లేకపోవడంతో అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది.

సరిహద్దు గేట్లు ఎత్తేశారు!
తనిఖీలు లేని వసుంధర చెక్‌పోస్టు

మూతపడిన చెక్‌పోస్టులు
అక్రమార్కుల ఇష్టారాజ్యం
యథేచ్ఛగా ఇసుక, మద్యం, గంజాయి అక్రమ రవాణా
(మెళియాపుట్టి/ఇచ్ఛాపురం రూరల్‌)

సరిహద్దు ప్రాంతాల్లో చెక్‌పోస్టులు మూతపడడంతో అక్రమార్కుల ఇష్టారాజ్యం కొనసాగుతోంది. ఇసుక, మద్యం, గంజాయి తదితర వస్తువుల అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు రెండేళ్ల కిందట ఏర్పాటు చేసిన చెక్‌పోస్టులను అర్థాంతరంగా ఎత్తివేశారు. దీంతో జిల్లాలో 129 మంది  ఎస్పీవోలు రోడ్డున పడ్డారు. చెక్‌పోస్టుల వద్ద తనిఖీలు లేకపోవడంతో అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది.   
............................
ఇసుక, మద్యంతో పాటు గంజాయి తదితర నిషేధిత వస్తువుల అక్రమ రవాణాను అడ్డుకోవడానికి సరిహద్దుల్లో ఏర్పాటు చేసిన చెక్‌పోస్టులు మూన్నాళ్ల ముచ్చటగా మారాయి. ఏప్రిల్‌ 1 నుంచి ఇవన్నీ మూతపడ్డాయి. దీంతో సరిహద్దు ప్రాంతాల్లో నిషేధిత వస్తువుల అక్రమ రవాణా యథేచ్ఛగా సాగిపోతోంది. మద్యం, సారా, ఖైనీ, గుట్కా వంటివి ఒడిశా నుంచి జిల్లాకు చేరుతున్నాయి. ఇసుక కూడా అక్రమంగా తరలిపోతోంది. పోలీస్‌ శాఖ చెక్‌ పోస్టులు మూతపడడంతో అక్రమార్కుల పని మరింత సులువవుతోంది. అడపాదడపా పోలీస్‌ శాఖ, ఎస్‌ఈబీ సిబ్బంది తనిఖీలు చేస్తున్నారు. అయినా పెద్ద మొత్తంలో నిషేధిత వస్తువులు లభ్యమవుతున్నాయి. జిల్లాలో పదుల సంఖ్యలో మండలాలకు ఒడిశాలోని గంజాం, గజపతి జిల్లాలతో అనుబంధం ఉంది. రెండు రాష్ట్రాలను కలుపుతూ ఎన్నో గ్రామీణ రహదారులు ఉన్నాయి. వాటి ద్వారా నిషేధిత వస్తువుల రవాణా సాగిపోతోంది. ప్రస్తుతం స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరోలో తగినంత సిబ్బంది లేరు. సారా తయారీ శిబిరాలపై దాడులకే వారు పరిమితమవుతున్నారు. ప్రధాన మార్గాల్లో పోలీసులు ఇంతోకొంత తనిఖీలు చేస్తున్నారు. ఇదే అదునుగా అక్రమార్కులు నిషేధిత వస్తువులను సరిహద్దు దాటించేస్తున్నారు. ప్రధానంగా ఇచ్ఛాపురం, కంచిలి, సోంపేట, మందస, మెళియాపుట్టి, పాతపట్నం, కొత్తూరు, భామిని, సీతంపేట మండలాల మీదుగా అక్రమ రవాణా యథేచ్ఛగా సాగిపోతోంది. సరిహద్దు రహదారుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినా.. అవి కూడా పనిచేయక పోవడంతో నిఘా కొరవడుతోంది. అక్రమార్కుల ఇష్టారాజ్యం కొనసాగుతోంది.

వీధిన పడిన ఎస్పీవోలు
వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2020 జనవరిలో జిల్లావ్యాప్తంగా 29 సరిహద్దు చెక్‌పోస్టులు, 5 మొబైల్‌ టీంలు ఏర్పాటు చేసింది. ఇందులో 129 మందిని ఎస్పీవోలు(స్పెషల్‌ ప్రొటెక్షన్‌ ఆఫీసర్లు)గా కాంట్రాక్టు పద్ధతిపై నియమించి నెలకు రూ.15వేల వేతనం నిర్ణయించింది. చెక్‌పోస్టుల వద్ద గదులు, మరుగుదొడ్లతో పాటు సీసీ కెమెరాలను ఏర్పాటు చేసింది. కానీ ఎస్పీవోలకు సక్రమంగా జీతాలివ్వలేదు. భవిష్యత్తులో రెగ్యులర్‌ చేస్తారన్న ఆశాభావంతో వీరు కరోనా తీవ్రంగా ఉన్నప్పుడు కూడా విధులు నిర్వహించారు. కాగా, ఇటీవల ఆ ఉద్యోగాలను రద్దు చేస్తూ డీజీపీ ఉత్తర్వులు జారీ చేయడంతో ఏప్రిల్‌ 1 నుంచి ఇచ్ఛాపురం, కవిటి, కంచిలి, పలాస, మందస. పాతపట్నం, భామిని, కొత్తూరు, మెళియాపుట్టి, పైడిభీమవరం తదితర మండలాలు వద్ద చెక్‌ పోస్టులు మూతపడ్డాయి. సిబ్బంది ఉండేందుకు ఏర్పాటు చేసిన గదులు, నిర్వహణ లేక సీసీ కెమెరాలు నిరుపయోగమయ్యాయి. ఇసుక అక్రమ రవాణా నియంత్రణలో పాలుపంచుకున్నందున స్పెషల్‌ పోలీసులకు భూగర్భ గనుల శాఖ వేతనాలు చెల్లించేది. ప్రభుత్వం ఇసుక రీచ్‌ల నిర్వహణను ప్రైవేటు సంస్థకు అప్పగించడంతో ఆ శాఖ జీతాలు ఇవ్వడం నిలిపివేసింది. మీరే చూసుకోవాలంటూ ఎస్‌ఈబీతో పాటు ఎక్సైజ్‌ శాఖకు బదలాయించడంతో వారికి కష్టాలు ప్రారంభమయ్యాయి. కొవిడ్‌ సమయంలో వేతనాలు సకాలంలో ఇవ్వకపోయినా కుటుంబానికి దూరంగా ఉంటూ సరిహద్దులో అక్రమ రవాణాను అడ్డుకున్నామని, దీనికి ప్రభుత్వం ఇచ్చే ప్రతిఫలం ఇదేనా అని స్పెషల్‌ పోలీసులు ప్రశ్నిస్తున్నారు. దీనిపై స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంటు బ్యూరో అసిస్టెంటు కమిషనర్‌ కేపీ గోపాల్‌ను వివరణ కోరగా ప్రభుత్వం వారి వేతన బకాయిలు పూర్తిగా చెల్లించిందన్నారు. ప్రస్తుతం వారి సేవలను వినియోగించుకోవడం లేదని తెలిపారు.

సేవలను గుర్తించలేదు
ఆర్మీలో పని చేస్తూ 2019లో రిటైర్‌ అయ్యాను. వేరే రాష్ట్రంలో ఉద్యోగ అవకాశం వచ్చినా ప్రభుత్వ ఉద్యోగమని ఎస్పీవోగా చేరాను. కొవిడ్‌ సమయంలో ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా కుటుంబానికి దూరంగా ఉంటూ పని చేశాను. అక్రమ రవాణా సాగించే ఎంతో కష్టమైన కేసుల్ని పట్టించాను. మా సేవల్ని ప్రభుత్వం గుర్తించక తీసి వేయడంతో ఇంటి వద్దే ఖాళీగా ఉంటున్నా.
- శివంగి ధనరాజు, సీమూరు, కవిటి   

అర్ధాంతరంగా తీసేశారు
ఆర్మీలో పని చేస్తూ 2002లో వాలంటరీ రిటైర్మెంట్‌ తీసుకున్నా. వేరే రాష్ట్రంలో కన్‌స్ట్రక్షన్‌ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకునేవాడ్ని. 2020లో ఎస్‌పీవోగా పిలుపు రావడంతో అక్కడ పనులు వదులుకుని వచ్చి చేరాను. నెలనెలా వేతనాలు సరిగ్గా ఇవ్వకున్నా రెగ్యులర్‌ చేస్తుందని అంకిత భావంతో పని చేశాను. ఇప్పుడు అర్ధాంతరంగా తీసివేయడంతో రోడ్డున పడ్డాను.
- దువ్వు సూర్యనారాయణ, ఈదుపురం, ఇచ్ఛాపురం  

సిబ్బంది కొరత
పోలీస్‌ శాఖకు సంబంధించి సిబ్బంది కొరత ఉంది. సరిహద్దు ప్రాంతాల్లో నిత్యం తనిఖీలు చేయడం కుదిరే పనికాదు. అయినా ఉన్నంతలో ఎస్‌ఈబీతో సంయుక్తంగా విస్తృత దాడులు చేస్తున్నాం. సరిహద్దు చెక్‌పోస్టుల వద్ద ఎస్‌పీవోలు ఉండేవారు. నిషేధిత వస్తువుల రవాణాకు అడ్డుకట్ట పడేది.
- సందీప్‌కుమార్‌, ఎస్‌ఐ, మందస 

Updated Date - 2022-05-23T05:20:30+05:30 IST