మూతపడిన కొనుగోలు కేంద్రాలు

ABN , First Publish Date - 2021-06-20T05:41:07+05:30 IST

ఆళ్లగడ్డ వ్యవసాయ సబ్‌ డివిజన్‌లో 1336 హెక్టార్లలో మొక్కజొన్న పంట సాగైంది.

మూతపడిన కొనుగోలు కేంద్రాలు
రోడ్డుపై ఆరబోసిన మొక్కజొన్న దిగుబడులు

  1.  రైతుల వద్దే మొక్కజొన్న దిగుబడులు
  2. సమయం అయిపోయిందంటున్న అధికారులు


 ఆళ్లగడ్డ, జూన్‌ 19: ఆళ్లగడ్డ వ్యవసాయ సబ్‌ డివిజన్‌లో 1336 హెక్టార్లలో మొక్కజొన్న పంట సాగైంది. దిగుబడులు ఆశాజనంగా ఉన్నాయి. పంట దిగుబడులను అమ్ముకునేందుకు రైతు భరోసా కేంద్రాల్లో రిజిస్ర్టేషన్‌ చేసుకొనే వీలును అధికారులు కల్పించారు. పట్టణంలోని వ్వవసాయ మార్కెట్‌ కమిటీ లో మొక్కజొన్న పంట దిగుబడులను అమ్ముకునేందుకు కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ప్రభుత్వం క్వింటం ధర రూ. 1850గా ప్రభుత్వం ప్రకటించింది. కొనుగోలు కేంద్రం నుంచి గోదాముకు తరలించే బాధ్యత ప్రైవేటు గుత్తేదారునికి అప్పజెప్పింది.


రైతుల వద్ద మూలుగుతున్న పంట దిగుబడులు

గ్రామాల్లోని రైతుల వద్ద మొక్కజొన్న పంట దిగుబడులు వేల క్వింటాళ్లలో మూలుగుతున్నాయి. వీటిని కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకోడానికి  ప్రభుత్వం  సమయం నిర్దేశించింది. కానీ రైతులు పంట దిగుబడులను ఆరబోసుకోవలసి రావడంతో  ప్రభుత్వం ఇచ్చిన గడువు ముగిసిపోయింది. దీంతో రైతులు దిక్కుతోచని పరిస్థితుల్లో పడ్డారు. ఇది ఇలా ఉండగా పట్టణంలోని మొక్కజొన్న పంట దిగుబడులను ఎన్ని క్వింటాళ్లయినా కొనాలని ప్రభుత్వం ఆదేశించింది. కానీ అధికారులు మాత్రం గడువు ముగిసిందంటూ కొనుగోలు కేంద్రాన్ని మూసేశారు.  బయట మార్కెట్‌లో తక్కువ ధర ఉండటంతో నష్టపోతున్నామని రైతులు ఆవేదన చెందుతున్నారు.  


బినామీ పేరుతో మాయ

  మొక్కజొన్న దిగుబడులను వేర్‌ హౌస్‌ గోదాములకు తరలించేందుకు గుత్తేదారుడు ముందుకు రావాలి. కానీ ఇక్కడ ఆ పరిస్థితి కన్పించలేదు. కానీ పంట దిగుబడులను గోదాములకు తరలించేందుకు లారీలు వినియోగించినట్లు గుత్తేదారులు అధికారులకు తెలిపారు. కానీ గుత్తేదారులు లారీలు పెట్టకపోవడంతో రైతులే రవాణా భారాన్ని మోస్తున్నారు. దీంతో రైతులకు రవాణా ఖర్చు కింద రూ. 250 భారం పడుతోంది. దీనిపై విచారణ చేసిన అధికారులు గుత్తేదారుల టెండరు రద్దు చేసినా తిరిగి బినామీ పేరుతో టెండరు వేసుకొని ప్రభుత్వం నుంచి రూ.కోట్లు దండుకుంటున్నారు. దీన్ని బట్టి ఆ ఇద్దరికీ లోపాయికారి ఒప్పందం ఉందేమోనన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 




Updated Date - 2021-06-20T05:41:07+05:30 IST