‘నై’వేధ్యం

ABN , First Publish Date - 2021-05-11T05:00:28+05:30 IST

ఖమ్మం పాతబస్టాండ్‌లోని వేంకటేశ్వరస్వామి ఒంటరయ్యాడు. ఆయన్ను దర్శించుకునే వారు లేక స్వామి వారి ఆలయం ‘శ్రీహరివాసం’ కళతప్పింది.

‘నై’వేధ్యం
పాత బస్టాండ్‌లో తాళం వేసి ఉన్న వెంకటేశ్వర ఆలయం

 ఖమ్మం పాత బస్టాండ్‌లో పూజలందుకోని వేంకటేశ్వరస్వామి

 భక్తులు లేక కళతప్పిన శ్రీహరివాసం

ఖమ్మం ఖానాపురంహవేలీ, మే10: ఖమ్మం పాతబస్టాండ్‌లోని వేంకటేశ్వరస్వామి ఒంటరయ్యాడు. ఆయన్ను దర్శించుకునే వారు లేక స్వామి వారి ఆలయం ‘శ్రీహరివాసం’ కళతప్పింది. గతంలో నిత్యం వేలాది రాకపోకలు సాగించిన పాత బస్టాండ్‌... కొత్తబస్టాండ్‌ ప్రారంభంతో నిర్మానుష్యంగా మారింది. ఒకప్పుడు పాతబస్టాండ్‌కు వచ్చిన ప్రయాణికులు నిత్యం అక్కడి వేంకటేశ్వరస్వామిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించేవారు. సుమారు 40 సంవత్సరాల క్రితం బస్టాండ్‌ ఏర్పడిన తొలి రోజుల్లో బస్టాండ్‌ ప్రాంగణంలోనే వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని నిర్మించారు. క్రమంగా భక్తుల సంఖ్య పెరగడంతో అర్చకుడు కూడా ధూప దీప నైవేధ్యాలు సమర్పించేవారు. అంతేకాదు కోరిన కోరికలు తీర్చే ఏడు కొండల స్వామిగా ఆర్టీసీ సిబ్బంది నిత్యం పూజించేవారు. విధులకు వెళ్లే ముందు.. వచ్చిన తర్వాత ఆయనకు నమస్కరించుకునేవారు. అలాగే బస్టాండ్‌ నుంచి రాకపోకలు సాగించే వారు కూడా అక్కడ ఆగి.. వేంకటేశ్వరునికి మొక్కుకుని వెళ్లేవారు. అలా ఎంతో మంది భక్తులు తామనుకున్నది నెరవేరి.. మళ్లీ బస్టాండ్‌లోని ఆలయానికి వచ్చి మొక్కులు చెల్లించేవారు. కొందరు స్వామి సన్నిధిలో రాత్రిబస చేసి ఉదయాన్నే వెళ్లేవారు. ఇక బస్టాండ్‌ చుట్టుపక్కల ఉండే భక్తులు, వ్యాపారులు కూడా ఆ స్వామిని వారిని నిత్యం పూజించేవారు. కానీ ప్రస్తుతం పాత బస్టాండ్‌ నుంచి బస్సులు రాకపోకలు లేకపోవడంతో ఖాళీ ఉన్న ఈ ప్రాంగణాన్ని కరోనా అనుమానితులకు నిర్ధారణ పరీక్షలు చేసేందుకు వినియోగిస్తుండటం, అనుమానితులు కూడా వందల సంఖ్యలో అక్కడికి వస్తుండటంతో స్వామిని దర్శించుకునేందుకు అటువైపు వెళ్లేవారు లేకుండా పోయారు. చివరకు ఆలయాన్ని తెరిచేవారు కూడా లేక స్వామి వారికి ధూప దీప నైవేద్యాలు కూడా ఆగిపోయినట్టు సమాచారం. అయితే వేదపండితుల సలహాలు తీసుకుని ఆర్టీసీ వారికి ఇష్టదైవమైన పాత బస్టాండ్‌లోని వేంకటేశ్వరుని ఆలయం మాదిరిగానే కొత్త బస్టాండ్‌లోనూ ప్రత్యేకంగా గుడిని నిర్మించాలని పలువురు కోరుతున్నారు. 

Updated Date - 2021-05-11T05:00:28+05:30 IST