పాస్‌వే ప్రారంభించకుండా రైల్వే గేటు మూసివేత

ABN , First Publish Date - 2021-07-27T05:26:41+05:30 IST

అండర్‌ పాస్‌వేను ప్రారంభించకుండానే చింతల అగ్రహారం రైల్వే గేటును మూసి వేయడంతో సుమారు 15 గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

పాస్‌వే ప్రారంభించకుండా రైల్వే గేటు మూసివేత
మూసి వేసిన రైల్వే గేటు

15 గ్రామాల ప్రజల ఇబ్బందులు

సమీపంలో మేహాద్రిగెడ్డ ఉండడంతో అండర్‌ పాస్‌వేలో ఊరుతున్న నీరు

ప్రైవేటు ఆపరేటర్‌ ద్వారా నీరు తోడే ఏర్పాట్లు

నిత్యం నీరు తోడకపోవడంతో వాహనచోదకుల అవస్థలు


పెందుర్తి రూరల్‌, జూలై 26 : అండర్‌ పాస్‌వేను ప్రారంభించకుండానే చింతల అగ్రహారం రైల్వే గేటును మూసి వేయడంతో సుమారు 15 గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అండర్‌ పాస్‌వే నుంచి వెళదామంటే అక్కడ నీరు నిలిచిపోయి ఉండడంతో పాటు విద్యుత్‌ సౌకర్యం లేక అవస్థలు పడుతున్నారు. గత్యంతరం లేక చాలా మంది ఇక్కడి నుంచి సుమారు రెండు కిలో మీటర్ల దూరంలో ఉన్న పెదగాడి రోడ్డు ఓవర్‌ బ్రిడ్జి గుండా రాకపోకలు సాగిస్తున్నారు. చింతల అగ్రహారం రైల్వే గేటు గుండా చింతల అగ్రహారం, గవర పాలెం కాలనీ, లక్ష్మీపురం, చీమలాపల్లి, పొర్లుపాలెం తదితర గ్రామాల ప్రజలు నిత్యం రాకపోకలు సాగిస్తుంటారు. వేపగుంట, రాంపురానికి ఇటు వైపు నుంచే వెళుతుంటారు. అయితే రైల్వే గేటు తరచూ మూసి ఉండడంతో ప్రజలు ఇబ్బంది పడేవారు. ప్రజల అభ్యర్థన మేరకు రైల్వే అధికారులు గేటు సమీపంలో సుమారు రూ.4 కోట్లతో అండర్‌ పాస్‌వే నిర్మాణం చేపట్టారు. ఈ పనులు దాదాపు పూర్తి కావచ్చాయి.  

పాస్‌వేలో నీరు నిలిచి ఇబ్బందులు

అండర్‌ పాస్‌వేకు సమీపంలో మేహాద్రిగెడ్డ రిజర్వాయర్‌ ఉండడంతో పాస్‌వేలో నీరు ఊరు తోంది. నీటిని బయటకు తోడడానికి రైల్వే అధికారులు పాస్‌ వే పక్కన లోతైన సంప్‌ నిర్మించారు. పాస్‌ వేలో ఊరిన నీరు సంప్‌లోకి వెళ్లడానికి వీలుగా సీసీ కాలువ నిర్మించారు. సంప్‌లో చేరిన నీటిని బయటకు తోడడానికి వీలుగా సంప్‌ పక్కనే పంప్‌ హౌస్‌ నిర్మించారు. ఇందులో విద్యుత్‌ పంప్‌ సెట్‌ ఏర్పాటు చేసి నీటిని బయటకు తోడడానికి ఏర్పాట్లు చేశారు. కానీ ఇంకా పంప్‌ సెట్‌ ఏర్పాటు చేయలేదు. ప్రస్తుతానికి ఓ ప్రైవేటు ఆపరేటరు ద్వారా ఆయిల్‌ ఇంజన్‌ ఏర్పాటు చేసి సంప్‌లోని నీటిని బయటకు తోడిస్తున్నారు. అయితే నిత్యం నీరు తోడకపోవడం వల్ల పాస్‌వేలో నీరు నిలిచిపోతోంది. కాగా అండర్‌ పాస్‌వే పూర్తిస్థాయిలో సిద్ధం కాకుండానే రైల్వే గేటును మూసి వేశారు. గేటు ముందు స్టాపర్‌ బోర్డులను ఏర్పాటు చేశారు. గేటు మూసేసి గేటు బేరర్లకు తాళాలు వేసేశారు. దీంతో కొందరు అండర్‌ పాస్‌వే గుండా రాకపోకలు సాగిస్తూ అందులో నిలిచిపోయిన నీరు వల్ల అవస్థలు పడుతున్నారు. పాస్‌వేలో నీరు తోడడానికి పక్కా ఏర్పాట్లు చేయకుండా  గేటును మూసి వేయడం పట్ల స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పంప్‌ హౌస్‌లో వెంటనే మోటారు ఏర్పాటు చేసి నిత్యం నీరు తోడేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.


Updated Date - 2021-07-27T05:26:41+05:30 IST