టీఆర్‌ఎస్‌పై తిరుగుబాటు తప్పదు

ABN , First Publish Date - 2020-12-04T04:55:26+05:30 IST

టీఆర్‌ఎస్‌పై తిరుగుబాటు తప్పదు

టీఆర్‌ఎస్‌పై తిరుగుబాటు తప్పదు
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న సీఎల్పీ నేత భట్టి విక్రమార్క

ఖమ్మంకార్పొరేషన్‌లో కాంగ్రెస్‌దే విజయం

7న అన్ని డివిజన్లలో నిరుద్యోగ శంఖారావం 

సీఎల్పీ నేత భట్టి విక్రమార్క

ఖమ్మం, డిసెంబరు 3 (ఆంధ్రజ్యోతిప్రతినిధి) : మోసాలు, మాయమాటలతో మభ్యపెట్టి గత కార్పొరేషన్‌ ఎన్నికల్లో గెలిచిన టీఆర్‌ఎస్‌పై ఈ సారి ప్రజాతిరుగుబాటు తప్పదని, రాబోయే ఖమ్మంకార్పొరేషన్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలిచి తీరుతుందని సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క తెలిపారు. గురువారం ఖమ్మంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాబోయే ఖమ్మంకార్పొరేషన్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలుపే లక్ష్యంగా పట్టణ, డివిజన్‌స్థాయిలో సమన్వయ కమిటీలు నియమించామని, అన్ని డివిజన్లలో తమ పార్టీ పోటీచేస్తుందని తెలిపారు. రాష్ట్రంలో నియంత పాలనకు వ్యతిరేకంగా.. ఖమ్మం, వరంగల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో భావస్వారూప్య పార్టీలతో పొత్తులు పెట్టుకుంటామన్నారు. గత ఎన్నికల సమయంలో టీఆర్‌ఎస్‌ పెద్దలు ఇచ్చిన నిరుద్యోగ భృతి, డబుల్‌బెడ్‌రూం ఇళ్లు, ఆసరా పింఛన్ల హామీలను పూర్తిస్థాయిలో నెరవేర్చలేదని, దీంతో ప్రజలు టీఆర్‌ఎస్‌ మోసాలకు విసుగుచెంది ఉన్నారన్నారు. ఈనెల 7న రాష్ట్రమంత్రులు ఖమ్మం వస్తున్నందున.. అదేరోజు ఖమ్మంకార్పొరేషన్‌ పరిధిలోని అన్ని డివిజన్లలో నిరుద్యోగులకు ఇచ్చినహామీమమేరకు నిరుద్యోగ భృతి ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ నిరుద్యోగ శంఖారావం పేరుతో నిరసన దీక్షలు చేపడతామని, అనుమతి ఇస్తే మంత్రుల దృష్టికి తీసుకెళతామని వివరించారు. ప్రతీ నియోజకవర్గంలో పదివేల ఇళ్లు ఇస్తామన్నారని, కానీ ఖమ్మం నగరంలో ఎవరికీ ఇవ్వలేదని అర్హులైన వారందరికి ఆసరా పింఛన్లు ఇస్తామని దరఖాస్తులు తీసుకుని ఆరేళ్లయినా మంజూరుచేయలేదని భట్టి ఆరోపించారు. పేద, మధ్యతరగతివారు ఇళ్లప్లాట్లు కొనుగోలు చేస్తే ఎల్‌ఆర్‌ఎస్‌ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం తనవాటా కోసం రిజిస్ర్టేషన్లు అడ్డుకుంటుందని, కరోనా సమయంలో ఇది హేతుబద్దమైనది కాదని భట్టి పేర్కొన్నారు. మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ తనపై హత్యాప్రయత్నంచేశారని చెప్పడం ద్వారా రాష్ట్ర మంత్రికే రక్షణలేదని అంగీకరించారని, అలాంటి రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఎలా రక్షణ ఇస్తుందో అర్థమవుతుందన్నారు. తమ హయాంలో ఖమ్మంనగర జరిగిన అభివృద్ధిని.. టీఆర్‌ఎస్‌ పాలనలో జరిగిందని ప్రచారం చేసుకుంటున్నారు తప్పా నిజమైన అభివృద్ధి లేదన్నారు. హైవే రోడ్లు ఖమ్మం నగరం నుంచి వెళుతున్నందున.. ఏ ప్రభుత్వమైనా ఉన్న రోడ్లను అభివృద్ధి చేయడం సహజమని, మమతా ఆసుపత్రి చుట్టూ రోడ్లువేసుకుని అభివృద్ధిగా చెప్పుకుంటున్నారని ఆరోపించారు. ఈ విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, డీసీసీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్‌, నగర అధ్యక్షుడు జావీద్‌, కార్పొరేటర్లు దీపక్‌చౌదరి, తిలక్‌, వడ్డెబోయిన నర్సింహారావు  తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-04T04:55:26+05:30 IST