Cmతో కేఏఎస్‌ అధికారుల భేటీ

ABN , First Publish Date - 2022-06-04T17:53:46+05:30 IST

కర్ణాటక అడ్మినిస్ట్రేటివ్‌ సర్వీస్‌ (కేఏఎస్‌) అధికారుల సంఘం పదాధికారులు ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మైను శుక్రవారం భేటీ అయ్యారు. ఈ

Cmతో కేఏఎస్‌ అధికారుల భేటీ

బెంగళూరు, జూన్‌ 3 (ఆంధ్రజ్యోతి): కర్ణాటక అడ్మినిస్ట్రేటివ్‌ సర్వీస్‌ (కేఏఎస్‌) అధికారుల సంఘం పదాధికారులు ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మైను శుక్రవారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తమ సమస్యలను సీఎం దృష్టికి తెచ్చారు. ఈ బృందానికి సంఘం అధ్యక్షుడు రవి తిర్లాపుర నాయకత్వం వహించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు నిరుపేదలకు, దీనదళితులకు, మహిళలకు సకాలంలో నిక్కచ్చిగా అందేలా చొరవ చూపాలని సీఎం ఈ సందర్భంగా అధికారులకు సూచించారు. కేఏఎస్‌ సంఘం నూతన పదాధికారులను ప్రత్యేకంగా అభినందించిన ఆయన మీరు కూడా ప్రభుత్వంలో భాగస్వామ్యులన్న సంగతిని గుర్తించాలన్నారు. ప్రభుత్వం ఎన్నో ఆశలు, ఆకాంక్షలతో రూపొందించే సంక్షేమ పథకాలు ఒక్కోసారి అట్టడుగు వర్గాలకు అందడం లేదని ముఖ్యమంత్రి ఒకింత ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల సమస్యలపై అధికారులు తక్షణం స్పందిస్తే జనతాదర్శన్‌ వంటి కార్యక్రమాలలో ప్రజలనుంచి విజ్ఞప్తులు స్వీకరించాల్సిన అవసరం తమకు ఉండదన్నారు. ప్రభుత్వ పథకాలు చక్కగా అమలైతే ఇటు అధికారులతోపాటు ప్రభుత్వానికి కూడా మంచి పేరు వస్తుందన్నారు. కేఏఎస్‌ అధికారులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిశీలించి తప్పకుండా పరిష్కరిస్తానని ఆయన భరోసా ఇచ్చారు. 

Updated Date - 2022-06-04T17:53:46+05:30 IST